logo

దేనికైనా ఓ లెక్క ఉండాలబ్బా!

ఏ పని చేసినా ఒక పద్ధతి ఉండాలంటారు. దీనినే గ్రామీణ ప్రాంతాల్లో పెద్దలు ఓ లెక్కతో నడవాలని చెబుతారు. ఆలోచించి అడుగేయకుంటే అనర్థాలు తప్పవని స్థూలంగా ఈ మాటల మర్మం. కొందరు కొన్ని విషయాల్లో ‘అతి’ చేస్తుంటారు.

Updated : 11 Mar 2024 06:12 IST

‘అతి’తో అనర్థాలు తప్పవు
మామడ, న్యూస్‌టుడే

ఏ పని చేసినా ఒక పద్ధతి ఉండాలంటారు. దీనినే గ్రామీణ ప్రాంతాల్లో పెద్దలు ఓ లెక్కతో నడవాలని చెబుతారు. ఆలోచించి అడుగేయకుంటే అనర్థాలు తప్పవని స్థూలంగా ఈ మాటల మర్మం. కొందరు కొన్ని విషయాల్లో ‘అతి’ చేస్తుంటారు. దీని మూలంగా వ్యతిరేక ఫలితాలు వస్తుంటాయి. వాహన వేగంలో పరిమితి లేకుంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ఆహారం విషయంలో అదుపు లేకుంటే ఆరోగ్యానికి ప్రమాదం. నోటి మాటలు ఆధీనంలో లేకుంటే అనవసర గొడవలొస్తాయి. అంతర్జాలం..సామాజిక మాధ్యమంలో పొద్దస్తమానం మునిగి తేలితే వచ్చే ఇబ్బందులు కోకొల్లలు. పాతకాలం నుంచి అతి వద్దనే సామెతలు వాడుకలో ఉన్నాయి. ఇప్పుడూ మితం ముద్దు అనే నినాదాలు కనిపిస్తాయి. ఇలా ఎన్నో అంశాలు ‘అధికంగా’ చేయడంవల్ల ఎదురయ్యే ఇబ్బందులు..అధిగమించాల్సిన అవసరాన్ని వివరిస్తూ కథనం.

నోరు దాటని మాటకు రాజువే

ఎక్కువగా మాట్లాడితే జనాలకు వ్యంగ్య బిరుదులొస్తాయి. వాగుడుకాయ..వసపిట్ట అని పిలిపించుకోక తప్పదు. అందుకే పెద్దలు అవసరం మేరకే మాట్లాడాలని, అతిగా నోటికి పని చెప్పొద్దంటారు. ‘నోరు జారిన మాటకు నీవు బానిసవు-నోరు దాటని మాటకు నీవు రాజువు’ అని అంటారంటే మాటకున్న విలువ దానిని అదుపులో పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతుందో అర్థం చేసుకోవాలి. మాటలతోనే గొడవలు పెరిగిన సంఘటనలు, పోలీసు స్టేషన్ల దాకా వస్తున్న కేసులు చాలానే ఉంటున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత పోలీసు స్టేషన్లలో వంద కేసులు నమోదైతే అందులో సగానికి పైగా చిన్న తగాదాలే ఉంటున్నాయి.

అంతర్జాలంలో అదే పనిగా..

ఇటీవలి కాలంలో మానసిక వైద్యుల దగ్గరకు చిత్రవిచిత్రమైన కేసులు వెళ్తున్నాయి. అవన్నీ అంతర్జాలం..చరవాణి..సామాజిక మాధ్యమాల్లో ఏదో ఒక దానితో ముడిపడినవే. మా బాబుకు 15 సంవత్సరాలు. రోజూ ఫోన్‌ పట్టుకొని ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ చూస్తూనే ఉంటున్నాడు. వద్దంటే వినట్లేదు. రాత్రి 12 దాటినా పడుకోవట్లేదు. తరచూ ఫోన్‌ తీస్తూ చూస్తున్నాడంటూ ఆయన కొడుకు ‘అతి’ని గోడుగా చెప్పుకున్నాడు ఓ తండ్రి. అదే వైద్యుని దగ్గరకు ఇటీవల ఒక అమ్మాయిని తల్లిదండ్రులు తీసుకెళ్లారు. ఆ అమ్మాయి ఫేస్‌బుక్‌లో మిత్రులతో కలిసి దిగిన ఫొటో ఒకటి పోస్టు చేసిందట. ఎవరో ఆమె గురించి సరదాగా బాగా లేవని..ముక్కు వంకర అని వ్యంగ్యంగా వాఖ్యలు పోస్టు చేసినందుకు మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేయడంతో మానసిక వైద్యుడి దగ్గరకు కౌన్సెలింగ్‌కు వెళ్లారు.

అతి వేగం ప్రమాదకరం..

రోజూ ఎన్నోచోట్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాటికి ప్రధాన కారణం అదుపులో లేని వేగమే.. పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడం, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడమూ ఇందుకు కారణమే. ప్రతి ప్రమాదం తర్వాత విచారణలో మితిమీరిన వేగమేనన్నది రవాణా అధికారుల నివేదికలో తేలుతోంది. 2023 సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో 1606 ప్రమాదాలు జరిగాయి. అందులో 286 మంది ప్రాణాలు కోల్పోయారు. 750 మంది వరకు అవయవాలు దెబ్బతిన్న వారున్నారు. యువత బైక్‌ రేసింగ్‌ మోజులో వేగాన్ని అదుపులో పెట్టుకునే విచక్షణ కోల్పోయి ప్రమాదాలు తెచ్చుకుంటున్నారు.

తిండితోనూ తిప్పలే

చాలా మంది బయటి తిండికి ప్రాధాన్యమిస్తున్నారు. కల్తీ పదార్థాల విక్రయాలు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో జిహ్వను అదుపు చేసుకోకుంటే అనారోగ్యానికి ద్వారం తెరిచినట్లే. పరిమితికి మించి తిన్నా..ఎక్కడ పడితే అక్కడ నాలుకకు రుచి చూపించినా ఆరోగ్యం చెడిపోవడం ఖాయం. బయటి ఆహార పదార్థాల్లో రంగుల వాడకం, హానికర వస్తువుల వినియోగం ఎక్కువైంది. గతంలో నిర్మల్‌లో కల్తీ నూనె రాకెట్‌ బయటకొచ్చింది. ఆహార నియమనిబంధలను పాటించకుండా ఊబకాయం సమస్యతో సతమతమవుతున్న వారి సంఖ్య ఉమ్మడి జిల్లాలో తక్కువేం లేదు. ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాలల్లోని ‘బరువు తగ్గాలా’ అని బోర్డులు పెట్టుకున్న దుకాణాల వద్ద రోజుకు పదుల సంఖ్యలో కనిపిస్తున్నారు. వీరికి నిర్వాహకులు.. నిపుణులు చెబుతున్న ప్రధానమైన సూచన తిండి (పరిమితి) నియమాలే. అది ముందుగా ఎవరికి వారే అదుపులో పెట్టుకుంటే ఊపిరి పీల్చుకునేందుకు అవస్థా ఉండదు. ఆసుపత్రుల వెంటా తిరగాల్సిన అవసరమూ రాదు.

ఆలోచించండి..అదుపులో ఉండండి

రహదారిపై ప్రయాణం చేస్తుంటే అక్కడక్కడా speed thrills but kills అన్న బోర్డులు కనిపిస్తాయి. వాటిని చూసైనా ప్రాణం మీద పట్టింపుతో వేగాన్ని అదుపు చేసుకునే ప్రయత్నం చేయాలి.


అదుపులో లేకుంటే ఇబ్బందులే

ఆచార్య డా.ఏ.విశాల్‌, నరాల, మానసిక వైద్య నిపుణుడు

ఇంతకు ముందు రోగాల నిర్ధారణకు సంబంధించి వైద్యుల పుస్తకాల్లో పలు వ్యాధుల గురించి ఉండేవి. ఈ మధ్య కాలంలో కొత్తగా ‘ఇంటర్నెట్‌ అడిక్షన్‌ సిండ్రోమ్‌’ అనే కొత్త జబ్బుల గురించి ప్రత్యేకంగా వివరిస్తున్నారు. అంటే అతిగా అంతర్జాలం వినియోగిస్తూ క్రమంగా దానిని వ్యసనంగా మార్చుకుంటున్నారు. ఇదే కోవలోకి సామాజిక మాధ్యమాల్లో పొద్దస్తమానం తలమునకలవుతున్న వారు వస్తారు. వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నందున మానసికంగా, శారీరకంగా తెలియకుండానే అలసి పోతుంటారు. నరాల సమస్య వస్తుంది. అశ్లీల వీడియోలు, చిత్రాలు చూస్తూ తప్పుదోవ పట్టే ప్రమాదం ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి సమస్యలతో మా దగ్గరికి రోజుకు కనీసం అయిదారుగురు వస్తున్నారంటే మన దగ్గరా అంతర్జాలం అతి ఎక్కువే అయింది. అత్యవసరమైతే తప్ప దాంతో కాలక్షేపం చేయొద్దు. పరిమితంగా అవసరం మేరకే దేనినైనా ఉపయోగిస్తే మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని