logo

భానుడి భగభగ

వేసవి ప్రారంభంలోనే సూర్యుడు నిప్పులు గక్కుతున్నాడు. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన పది ప్రాంతాల్లో ఆరు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే ఉన్నాయి. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో జైనథ్‌లో మధ్యాహ్న సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 42.3 డిగ్రీలుగా నమోదు అయింది.

Published : 28 Mar 2024 03:19 IST

రికార్డుస్థాయిలో ఉమ్మడి జిల్లాలో ఎండలు
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ వ్యవసాయం

వేసవి ప్రారంభంలోనే సూర్యుడు నిప్పులు గక్కుతున్నాడు. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన పది ప్రాంతాల్లో ఆరు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే ఉన్నాయి. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో జైనథ్‌లో మధ్యాహ్న సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 42.3 డిగ్రీలుగా నమోదు అయింది. పగటి పూట రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఓ వైపు ఎండలు, మరో వైపు ఉక్కపోతతో ప్రజలు సతమతమవుతున్నారు. జిల్లాలో వారం రోజుల కిందట 38 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రత రెండు రోజుల్లోనే సాధారణం కంటే రెండు డిగ్రీలు అధికంగా నమోదు కావడం కలవరపరుస్తోంది. మూడు రోజులుగా వడగాల్పుల తీవ్రత అధికమైంది. 

రికార్డు స్థాయిలో..

  • రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రం మొత్తంలో అత్యధికంగా రికార్డయ్యే పది ప్రాంతాల్లో ఎక్కువగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావే ఉన్నాయంటే జిల్లాలో ఎండల తీవ్రత ఎంతగా ఉందో తెలుస్తోంది.
  • ఆదిలాబాద్‌ జిల్లాలోని సాత్నాల, తలమడుగు, బేల మండలం చెప్రాల ప్రాంతాల్లో 42 డిగ్రీలు దాటగా, అర్లి, జైనథ్‌, అదిలాబాద్‌ పట్టణం, భోరజ్‌, బేల, సిరికొండ, లోకారి ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది.
  • మంచిర్యాల జిల్లాలోని కొండపూర్‌లో అత్యధికంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, జన్నారం, భీమిని, కోటపల్లి, భీమారం, మంచిర్యాల, నెన్నెల, కన్నెపల్లి ప్రాంతాల్లో 39 డిగ్రీలు దాటింది.
  • నిర్మల్‌ జిల్లాలో దస్తూరాబాద్‌లో అత్యధికంగా 41.4 డిగ్రీలు నమోదు కాగా కడెం, నిర్మల్‌, కుభీరు, నర్సాపూర్‌, వడ్యాల్‌, తానూర్‌, బుట్టాపూర్‌, తదితర ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటింది.
  • కుమురం భీం జిల్లాలో ఆసిఫాబాద్‌లో 42 డిగ్రీలు నమోదు కాగా రెబ్బెన, కెరమెరి, తిర్యాణి, వాంకిడి, గిన్నెధరి, సిర్పూరు(టి), లోనవెల్లి, కాగజ్‌నగర్‌, పెంచికల్‌పేట ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని