logo

గొంతు తడవదు.. గోస తీరదు

ఆసిఫాబాద్‌ మండలం సుద్దాఘాట్ గ్రామానికి చెందిన ప్రజలు నిత్యం కిలోమీటరు దూరంలోని వాగు నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. పక్కనే చెలమ తీసి నీటిని పట్టుకెళ్తున్నారు. వాగు అవతల ఉన్న పదుల సంఖ్యల్లో గ్రామాలదీ ఇదే పరిస్థితి.

Published : 28 Mar 2024 03:31 IST

తాగునీటి పథకాలున్నా.. ఏజెన్సీ ప్రాంతాల్లో తీవ్ర ఎద్దడి
ఈనాడు, ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే, ఇచ్చోడ

ఆసిఫాబాద్‌ మండలం సుద్దాఘాట్ గ్రామానికి చెందిన ప్రజలు నిత్యం కిలోమీటరు దూరంలోని వాగు నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. పక్కనే చెలమ తీసి నీటిని పట్టుకెళ్తున్నారు. వాగు అవతల ఉన్న పదుల సంఖ్యల్లో గ్రామాలదీ ఇదే పరిస్థితి.

మ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ప్రజల గొంతు ఎండుతోంది. మిషన్‌ భగీరథ పథకంలో తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు వాగులు, చెలమల వెంట వెళ్తూ తంటాలు పడుతున్నారు. కొత్త పైప్‌లైన్ల ఏర్పాటు, మోటార్ల మరమ్మతులకు నిధులు మంజూరైనా పనులు ప్రారంభించకపోవడంతో వందలాది గ్రామాలవాసులు వాగులు, చెలమలు, వ్యవసాయ బావుల వద్దకు కోసుల దూరం నడుచుకుంటూ వెళ్లి అవస్థలు పడుతున్నారు.

కుమురం భీం ప్రాజెక్టు నుంచి ఆదిలాబాద్‌, మంచిర్యాల, కుమురం భీం జిల్లాలకు తాగునీరు అందిస్తున్నారు. జలాశయంలో మానిక్‌గూడ వద్ద 112 ఎల్‌ఎండీ సామర్థ్యమున్న తాగునీటి ప్లాంట్ నుంచి 1146 గ్రామాలకు తాగునీరు అందేలా ప్రధాన పైప్‌లైన్‌తో పాటు, గ్రామాల్లో అంతర్గత పైప్‌లైన్‌ కోసం రూ.1136 కోట్లు ఖర్చు చేశారు. 2009లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, ఆదిలాబాద్‌, కుమురం భీం జిల్లాలకు తాగునీరు అందించేందుకు ధనోరా వద్ద రూ.72 కోట్లు వెచ్చించి ప్లాంట్ పనులు ప్రారంభించారు. 2016-17లో పనులు పూర్తయ్యాయి. డిజైన్‌ లోపం కారణంగా ఆదిలోనే ఈ పథకం అలంకారప్రాయంగా మిగిలింది. ఈ తరుణంలో 2018-19లో మరో రూ.18 కోట్లు కేటాయించి పైప్‌లైన్‌ మరమ్మతులు చేశారు. అయినా నీరు సరఫరా కావడం లేదు .ఈ ప్లాంట్ పరిధిలో 935 గ్రామాలకు నీటి సరఫరా కావాలి.

ధనోరా తాగునీటి ప్లాంట్లో 300 హెచ్‌పీ ఆరు మోటార్లు ఉండగా.. 42 ఎల్‌ఎండీ (మిలియన్‌ లీటర్‌ ఫర్‌ డిమాండ్‌) సామర్థ్యంతో ఉంది. మానిక్‌గూడలో 469 హెచ్‌పీ మోటార్లు నాలుగు ఉన్నాయి. ధనోరా నుంచి 15 కిలోమీటర్ల దూరంలో కెరమెరి ఘాట్ ప్రాంతం 225 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ నిర్మించిన పంపింగ్‌ స్టేషన్‌కు నీరు సక్రమంగా రాకపోవడం, ఈ మార్గంలో ఉన్న 56 పంపింగ్‌ స్టేషన్లలో తరచూ విద్యుత్తు సమస్య తలెత్తడం వల్ల తాగునీటి సరఫరా కేవలం కాగితాలకే పరిమితమవుతోంది.

పనులు ప్రారంభం కాలేదు..

కుమురం భీం జలాశయంలో మరో తాగునీటి ప్లాంట్ ఏర్పాటు, పంపింగ్‌ స్టేషన్లకు కొత్తగా విద్యుత్తు లైన్లు, పైప్‌లైన్‌ మరమ్మతులకు రూ.60 కోట్లు సీఎం రేవంత్‌ రెడ్డి మంజూరు చేశారు. టెండర్‌ నిర్వహించినా వివిధ కారణాలతో గుత్తేదారుకు పనులు అప్పగించలేదు. మరోసారి టెండర్‌ నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ తరుణంలో అనేక గ్రామాలతో పాటు, మారుమూల పల్లెల్లో ప్రస్తుతం తాగునీటి కోసం త్రీవ్ర అవస్థలు ఎదురవుతున్నాయి. పనులు ప్రారంభానికి సమయం ఉన్నందున ప్రస్తుతం పైప్‌లైన్‌ మరమ్మతులు చేసి నీరందేలా చూడాలని ఉమ్మడి జిల్లావాసులు కోరుతున్నారు.  


కుమురం భీం జిల్లా తిర్యాణి మండలం గోవెన గ్రామస్థులు మూడు కాలాలపాటు చెలమ నీరే తాగుతున్నారు. గ్రామంలో ఒక్క చేతిపంపు లేదు. భగీరథ నీరు రాకపోవడంతో కిలోమీటరు దూరంలోని వాగులో చెలమ తవ్వుకుని నీరు తెచ్చుకుంటున్నారు. కొలాంగూడ, గోండుగూడ, భీమన్‌గొంది, సోలార్‌గూడ, సమతులగుండం గ్రామవాసులందరూ వాగులు, వ్యవసాయ బావుల వద్దకు బిందెలతో వెళ్తున్నారు.


ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలోని ధర్మసాగర్‌ గ్రామానికి కుమురం భీం ప్రాజెక్టు నుంచే నీళ్లు రావాలి. భగీరథ నీటి సరఫరా లేక, గ్రామంలో తాగునీటి వనరులేవీ లేకపోవడంతో.. ఈ గ్రామస్థులు ఇలా పంట పొలాలకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. ఇంద్రవెల్లి, ఆదిలాబాద్‌, నార్నూర్‌, ఉట్నూర్‌, గాదిగూడ మండలాల్లో ఇదే రీతిన సమస్య తీవ్రంగా ఉంది.


చర్యలు తీసుకుంటాం

వెంకటపతి, ఇంట్రా ఈఈ

టెండర్‌ త్వరలోనే నిర్వహించి పనులు పూర్తి చేస్తాం. మిషన్‌ భగీరథ పథకం ద్వారా ప్రజలకు తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటాం. మరమ్మతులు సైతం వెంటనే చేపడతాం,

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని