logo

రూ.కోట్లలో అక్రమాలు.. కానరాని చర్యలు

పంచాయతీలకు వస్తున్న నిధులను కొందరు ప్రజాప్రతినిధులు పక్కదారి పట్టిస్తున్నారు. రశీదులు లేకుండానే నిధులు ఖర్చు చేస్తున్నారు. మార్కెట్ ధరకన్నా ఎక్కువ వెచ్చించి వివిధ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.

Updated : 20 Apr 2024 06:40 IST

ఆడిట్లో అవకతవకలు గుర్తిస్తున్నా ఫలితం శూన్యం

ఈనాడు, ఆసిఫాబాద్‌: పంచాయతీలకు వస్తున్న నిధులను కొందరు ప్రజాప్రతినిధులు పక్కదారి పట్టిస్తున్నారు. రశీదులు లేకుండానే నిధులు ఖర్చు చేస్తున్నారు. మార్కెట్ ధరకన్నా ఎక్కువ వెచ్చించి వివిధ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఈ తతంగమంతా ఆడిట్లో గుర్తిస్తున్నారు. ఏటా జిల్లావ్యాప్తంగా పంచాయతీల్లో రూ.కోట్ల ఖర్చుకు లెక్కలు లేవని తేలుస్తున్నారు. అయినా కఠిన చర్యలు తీసుకోకపోవడం, సొమ్ములను రికవరీ చేయకపోవడం అక్రమార్కులకు కలిసి వస్తోంది. ఇదే తీరున మార్కెట్ కమిటీల్లోనూ, పురపాలికల్లోనూ నిధుల గోల్‌మాల్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి పథకాలపై తీవ్ర ప్రభావం పడటంతో మౌలిక వసతులు కొరవడుతున్నాయి.

పంచాయతీలు, పురపాలిక, మార్కెట్ కమిటీల్లో ఏటా ఆడిట్ అధికారులు వచ్చిన నిధులు, చేపట్టిన పనులు, అందుకు తగిన రశీదులు ఉన్నాయా లేదా అని తనిఖీ చేస్తారు. జరిగిన అవకతవకలను గుర్తిస్తారు. వీటిని నెల నుంచి మూడు నెలల వరకు పరిష్కరించుకోవాలని అధికారులు సంబంధిత శాఖకు నోటీసులు అందజేస్తారు. ప్రస్తుతం కేవలం నోటీసులు ఇవ్వడం వరకే ఆడిట్ అధికారులు పరిమితమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా 335 పంచాయతీలు ఉండగా 2005 నుంచి 2020 వరకు 35,488 అభ్యంతరాలను అధికారులు గుర్తించారు. ఈ పనుల విలువ రూ.8.05 కోట్లు. వీటిపై ఇంకా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

లెక్కల్లో చిక్కులు..

2021-22 ఆర్థిక సంవత్సరానికి 3,043 అభ్యంతరాలు గుర్తించగా రూ.5 కోట్ల పనులకు సంబంధించి లెక్కలు లేవని అధికారులు గుర్తించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ ప్రక్రియ తుది దశకు చేరుకొంది. 2021-22 సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా 15 మండలాల్లో గుర్తించిన ఆడిట్ అభ్యంతరాల విలువ రూ.5.14 కోట్ల వరకు ఉంది. ఒక్కో మండలంలో రూ.19 లక్షల నుంచి రూ.49 లక్షల వరకు అంటే వెచ్చించిన నిధులకు సంబంధించి లెక్కలు లేవు. ఇందులో ఆసిఫాబాద్‌ మండలంలోని పంచాయతీల్లో రూ.49.06 లక్షలు, చింతలమానేపల్లి, రూ.49 లక్షలు, కౌటాల రూ.48 లక్షల చొప్పున ఖర్చు చేసిన వాటికి సరైన ఆధారాలు లేవని తనిఖీల్లో అధికారులు గుర్తించారు.

పురపాలికలోనూ అదే తీరు

కాగజ్‌నగర్‌ పురపాలికలో 2019-20 సంవత్సరంలో రూ.12.3 లక్షలు, 2020-21లో రూ.3.46 కోట్ల విలువైన పనులకు సంబంధించి సరైన రశీదులు లేవు. 2005 నుంచి 2019 వరకు రూ.17 కోట్ల పనులకు సంబంధించి పురపాలికలో అధికారులు ఆడిట్ అభ్యంతరాలు గుర్తించారు. పురపాలక ఆదాయ, వ్యయాలకు సంబంధించి ప్రత్యేక రిజిస్టర్‌లు లేకపోవడం, విడుదలైన నిధులను ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నిబంధనల మేరకు ఖర్చు చేయకపోవడం, ట్రేడ్‌ లైసెన్స్‌ రుసుముల వసూళ్లలో నిర్లక్ష్యం, టెండర్‌ లేకుండానే పనులను నచ్చిన వారికి అప్పగించడం, చేసిన పైప్‌లైన్‌ పనులకు సంబంధించి బిల్లులు లేకపోవడం తదితర పనులు పురపాలికలో చోటుచేసుకున్న అక్రమాలను అధికారులను గుర్తించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలోనూ పురపాలికలో 28 ఆడిట్ అభ్యంతరాలను గుర్తించారు. వీటి విలువ రూ.10.16 లక్షలుగా తేల్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని