logo

నింగికెగసిన ఆడబిడ్డలకు సలాం

జల్‌.. జంగల్‌.. జమీన్‌ అనే నినాదంతో ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి ప్రభుత్వం 1981 ఏప్రిల్‌ 20న తుపాకీ ఎక్కుపెట్టింది. ఆదివాసీలపై తూటాల వర్షం కురిపించింది.

Published : 20 Apr 2024 02:39 IST

నేడు ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం

న్యూస్‌టుడే, ఇంద్రవెల్లి : జల్‌.. జంగల్‌.. జమీన్‌ అనే నినాదంతో ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి ప్రభుత్వం 1981 ఏప్రిల్‌ 20న తుపాకీ ఎక్కుపెట్టింది. ఆదివాసీలపై తూటాల వర్షం కురిపించింది. హక్కుల సాధనలో 13 మంది అమరులయ్యారు. అడవి బిడ్డల అమరత్వం నింగికెగిసిన అగ్ని శిఖలా ఇంద్రవెల్లిలో అమరుల జ్ఞాపకార్థం స్తూపమై నిలిచింది. ఈ ఘటనకు 43 ఏళ్లు. కొన్నేళ్ల పాటు స్తూపం వద్ద ఏప్రిల్‌ 20న ఆదివాసీలు స్వేచ్ఛగా నివాళులర్పించలేని పరిస్థితి. పోలీసుల బందూకుల నీడలో అమరుల స్తూపం ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు 2005లో జరిగిన ఎన్నికల్లో ఆదివాసీల ప్రజాప్రతినిధిగా బోథ్‌ ఎమ్మెల్యేగా సోయం బాపురావు(తెరాస) నుంచి విజయం సాధించిన రోజున అర్ధరాత్రి గిరిజన అమరవీరుల స్మారక స్తూపం వద్దకు చేరుకుని నివాళులర్పించారు. అప్పటి నుంచి ఏటా గిరిజనులు 25వ తేదీన నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో పలు ఆంక్షలతో అనుమతి ఇవ్వడంతోపాటు 50 మందితో నివాళులర్పించడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. అప్పటి ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయకపోయినా జిల్లా పాలనాధికారులు, ఎస్పీలు కేవలం రెండు, మూడు గంటల సమయం మాత్రమే కేటాయించారు. ఆ సమయంలో ఆదివాసీలు స్వేచ్ఛా వాతావరణంలో ఆదివాసీల సంప్రదాయ పూజలు నిర్వహించి అమరులకు నివాళులర్పించారు.

32 ఏళ్లు నిర్బంధం

ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవంపై ఉమ్మడి రాష్ట్రంలో 32 ఏళ్లు నిర్బంధం కొనసాగింది. ఉమ్మడి రాష్ట్రంలో 1987లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత గిరిజనులకు నివాళులర్పించడానికి అనుమతి ఇచ్చారు. 1987లో గిరిజన రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడంతోపాటు సభను నిర్వహించారు. ఈ సభకు ప్రజా గాయకుడు గద్దర్‌, జార్జి ఫెర్నాండేజ్‌లు హాజరయ్యారు. తర్వాత అమరులకు నివాళులర్పించుటకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం, భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు పోలీసులను రంగంలోకి దించి ప్రతి పల్లెలను జల్లెడ పట్టేవారు. ఏప్రిల్‌ మాసం వచ్చిందంటే గిరిజనులు తమ వివాహాలను సైతం వాయిదా వేసి మే నేలలో నిర్వహించేవారు. ఈ ఏడాది రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకిరాగానే గిరిజన గ్రామాల్లో స్వేచ్ఛగా వివాహాలు జరుపుతున్నారు.

బాధిత కుటుంబాలకు ఓదార్పు..

అనాటి పోలీసు కాల్పులలో అమరులైన కుటుంబాలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంజూరు చేశారు. అమరుల కుటుంబాలకు ఐటీడీఏ ద్వారా రుణాలను సైతం మంజూరు చేస్తామని అమరుల కుటుంబాలకు హామీ ఇచ్చారు. చాలా మంది బాధితులకు ఇంకా న్యాయం జరగలేదని పలువురు ఆదివాసీలు పేర్కొంటున్నారు.

మమ్మల్ని గుర్తించలేదు :

మడావి జంగుబాయి, కన్నాపూర్‌, సిరికొండ మండలం

1981 ఏప్రిల్‌ 20న మా మామ మడావి రాము, భర్త మడావి శంభులతో కలిసి ఇంద్రవెల్లి వెళ్లాను. మామ రాము పోలీసు కాల్పులకు మరణించాడు. భర్త శంభుతో పాటు నాకు పోలీసు తూటలు తగిలి చేతులకు గాయాలయ్యాయి. భర్త శంభు పోలీసు తూటాల గాయంతో మరణించాడు. నేటికీ నాకు ఎలాంటి సాయం అందలేదు. కనీసం పింఛను సైతం ఇవ్వడం లేదు. కన్నాపూర్‌లో 6.19 గుంటల సాగు భూమి ఉంది. గతంలో రూ.200 పింఛను వచ్చేది. పదేళ్ల నుంచి రావడం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలను గుర్తించి ఇంటి స్థలాలు, పక్కా ఇళ్లు మంజూరు చేసినా నాకు అందలేదు.

గాయాలతో నా భర్త చనిపోయాడు..

కినక జైతు బాయి, కన్నాపూర్‌, సిరికొడ మండలం

నా భర్త కినక రాజు వార సంతకు వెళ్లి పోలీసు కాల్పులకు గురయ్యారు. గాయాలతో ఇంటికి వచ్చిన భర్తకు చెట్ల మందులతో రక్తం రాకుండా కట్టు కట్టుకున్నాం. తీవ్ర గాయాలతో నా భర్త చనిపోయాడు. అప్పటి నుంచి పిల్లలను పోషిస్తూ పెద్ద చేశాను. ప్రభుత్వం నుంచి మా కుటుంబానికి సహాయం అందలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇళ్లు సైతం మంజూరు కాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ చేసి మాకు న్యాయం చేయాలి.

వంద మంది పోలీసులతో బందోబస్తు

ఇంద్రవెల్లి గిరిజన అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ఉట్నూరు డీఎస్పీ నాగేందర్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో వంద మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సై దుబ్బాక సునీల్‌ తెలిపారు. బందోబస్తులో ఇద్దరు సీఐలు, 7 మంది ఎస్సైలతోపాటు ఇతర పోలీసులు బందోబస్తులో పాల్గొంటారని ఎస్‌ఐ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని