logo

నాయకా.. ఆరోగ్యమూ ముఖ్యమే

మండుటెండల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. రానున్న రోజుల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ సైతం  హెచ్చరించింది. ప్రచారానికి మిగిలింది ఎనిమిది రోజులు మాత్రమే.

Updated : 04 May 2024 06:51 IST

ప్రచారానికి మిగిలింది ఎనిమిది రోజులే
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ క్రీడావిభాగం

మండుటెండల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. రానున్న రోజుల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ సైతం  హెచ్చరించింది. ప్రచారానికి మిగిలింది ఎనిమిది రోజులు మాత్రమే. అయిదేళ్లకోకసారి వచ్చే ఈ ఎన్నికల్లో అభ్యర్థులు తమ గెలుపు కోసం తీవ్రమైన ఎండల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. వేసవి తాపం ఆందోళన కలిగిస్తోంది. పదవితో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమని వారు తెలుసుకోవాలి. ప్రచార నేపథ్యంలో వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


1. సమయానికి భోజనం

సమయానికి భోజనం చేయకపోవడంతో శక్తిని కోల్పోతాం. ప్రచార సమయంలో వివిధ నియోజకవర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతుంటారు. ఈ నేపథ్యంలో తమ కోసం కొంత సమయం కేటాయించుకోవాలి. సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. మాంసాహారం వద్దు, తేనీరు ఎక్కువగా తాగవద్దు.


2. మధుమేహం ఉంటే..

ఆహారపు అలవాట్లతో పాటు అధిక ఒత్తిడితో మధుమేహం బారిన పడే ప్రమాదముంది. ఈ వ్యాధి ఉన్న వారు సకాలంలో మాత్రలు వేసుకోవాలి, వేళకు భోజనం చేయాలి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. ఆ స్థాయిలో హెచ్చు, తగ్గులు ఉంటే మెదడుపై ప్రభావం చూపి ఆలోచనా శక్తి క్షీణిస్తుంది.


3. నిద్ర అవసరమే

ప్రచారంలో అభ్యర్థులకు నిద్రకు సమయం లభించక పోవచ్చు. నిద్రలేమి అనేక రుగ్మతలకు దారి తీస్తుంది. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి క్షీణిస్తుంది, అధిక రక్తపోటు రావడానికి అవకాశం ఉంటుంది. వైద్యులు సూచించిన ప్రకారం కనీసం ఏడు గంటల నిద్ర అవసరం.


4. రోజూ రక్తపోటును పరీక్షించుకోవాలి

ప్రచార పర్వంలో నాయకులు విజయమే లక్ష్యంగా ఆవేశానికి గురై ఆందోళన చెందుతుంటారు. దీంతో గుండె దడ పెరుగుతుంది. అధిక, అల్ప రక్తపోటు(బీపీ)కు దారి తీస్తుంది. ప్రచార సమయంలో రోజూ రక్తపోటును పరీక్షించుకోవాలి. బీపీ ఉంటే నిర్దిష్ట వేళకు మాత్రలు వేసుకోవాలి. ప్రచారం సమయంలో సంయనం పాటించాలి.


5. ఆరోగ్యం కోసం వ్యాయామం

నాయకులు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. రోజూ ఉదయం కనీసం 45 నిమిషాలు తగ్గకుండా సులువైన వ్యాయామాలు చేయాలి. ఉదయపు నడక ఎంతో మేలు. శిక్షకుల పర్యవేక్షణలో యోగాసనాలు కూడా వేయవచ్చు. రక్తపోటు, మధుమేహం ఉన్నవారైతే కచ్చితంగా వ్యాయామాలు చేయాల్సిందేనని వైద్యులు సూచిస్తున్నారు.


ఇలా చేయాలి

ప్రచారంలో రక్షణ కవచాలైన టోపీలు ధరించాలి, గొడుగులు వాడాలి.

ఒత్తిడి అనిపిస్తే ప్రశాంత వాతావరణంలో, ఏకాంతంలో పావుగంట ధ్యానం చేయాలి.

మేలు చేసే కొబ్బరి నీళ్లు తాగాలి.

ప్రచార వాహనాల్లో ద్రవ పదార్థాలు, పుచ్చకాయలు, పళ్లరసాలు, ఫలాలు, ఓఆర్‌ఎస్‌ పొట్లాలు, తాగునీరు ఉంచుకోవాలి.

ఉదయం 10 గంటలలోపు ప్రచారాన్ని ముగించుకునేలా చూసుకోవాలి. అవసరమైతే సాయంత్రం 5 తర్వాత చేసుకోవాలి.

ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కార్యక్రమాల సమయసారిణి తయారు చేసుకోవాలి.


పోలింగ్‌ కేంద్రాల్లోకి పోలీసులకు అనుమతి ఉండదు

చెన్నూరు, న్యూస్‌టుడే

మొత్తం ఎన్నికల నిర్వహణలో పోలీసులది కీలకపాత్ర. దాదాపు ఎన్నికల ప్రక్రియలో అన్ని చోట్ల వారి జోక్యం ఉంటుంది. ఎన్నికల ప్రచారాలకు, సభలకు, ర్యాలీలకు వారి అనుమతులు తప్పనిసరి. ఎన్నికల నియమావళి గీత దాటితే కేసులు నమోదు చేస్తారు. ఎన్నికలు ప్రశాంతంగా నడిపించేందుకు అన్ని రకాలుగా కీలకపాత్ర పోషిస్తారు. అలాంటి పోలీసులు పోలింగ్‌ కేంద్రాలకు పోయేందుకు అనుమతి లేదు తెలుసా..?

  • పోలింగ్‌ జరుగుతున్న సమయంలో పోలింగ్‌ కేంద్రంలో ఎలాంటి సమస్య వచ్చినా సాధ్యమైనంత వరకు కేంద్రంలోని ఎన్నికల అధికారే సిబ్బందితో ఆయా సమస్యలను పరిష్కరించుకుంటారు. శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు ఎన్నికల అధికారి పిలిస్తే తప్ప ప్రత్యేక కారణం లేకుండా పోలీసులు బూత్‌లోకి పోవడానికి అనుమతి లేదు.
  • పోటీ చేసే అభ్యర్థి అయినా, ఇంకా ముఖ్యమైన వ్యక్తి ఓటు వేసేందుకు వచ్చినా భద్రత సిబ్బంది మాత్రం ద్వారం బయటే ఆగాలి. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇబ్బంది కలిగించే ఏ పనీ ముఖ్యమంత్రిగానీ, మంత్రులుగానీ, వారి అనుచరులు కానీ చేయరాదు.
  • పోటీలో ఉన్న అభ్యర్థి జడ్‌ ప్లస్‌ కేటగిరీ రక్షణ ఉన్నా వారి వెంట వచ్చే సిబ్బందిని పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించరు. మఫ్తీలో ఉన్న భద్రతా సిబ్బంది ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుంది.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కేబినెట్‌ మంత్రులు, ఉప ముఖ్యమంత్రులకు భద్రతా సిబ్బంది ఉంటారు. వారు కూడా పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లకూడదు.
  • పోలింగ్‌ సిబ్బంది రాజకీయ నాయకులు, మంత్రుల మాటలు పట్టించుకోకుండా ఎన్నికల సంఘం ఆదేశాలను మాత్రమే అమలు చేయాలి. ఎన్నికల సంఘం అనుమతి పత్రం ఉంటేనే కేంద్రంలోకి అనుమతించాలి.
  • పదవుల్లో ఉన్నవారు, పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రవర్తించకూడదు. ఎలాంటి మాటలు, సైగలు చేసినా నేరంగా పరిగణిస్తారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని