logo

ఇంటర్‌లో అందలం.. పదిలో అధమం

జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో వ్యత్యాసం ఆందోళన కలిగిస్తోంది. మూడేళ్ల ఫలితాలను పరిశీలిస్తే ఈ తేడా ప్రధానంగా పాఠశాల విద్యాశాఖాధికారులను నైరాశ్యంలోకి నెడుతోంది. ఇంటర్‌ ఫలితాల్లో వరుసగా మూడేళ్లలో రాష్ట్రంలో 4, 2, 7 స్థానాల్లో నిలవగా పది ఫలితాల్లో మాత్రం 30, 29, 31 స్థానాలకే పరిమితమైంది.

Published : 04 May 2024 06:23 IST

ఇంత తేడా ఎందుకో.?
న్యూస్‌టుడే, ఆసిఫాబాద్‌ అర్బన్‌

జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో వ్యత్యాసం ఆందోళన కలిగిస్తోంది. మూడేళ్ల ఫలితాలను పరిశీలిస్తే ఈ తేడా ప్రధానంగా పాఠశాల విద్యాశాఖాధికారులను నైరాశ్యంలోకి నెడుతోంది. ఇంటర్‌ ఫలితాల్లో వరుసగా మూడేళ్లలో రాష్ట్రంలో 4, 2, 7 స్థానాల్లో నిలవగా పది ఫలితాల్లో మాత్రం 30, 29, 31 స్థానాలకే పరిమితమైంది. జిల్లాలో పదో తరగతి పూర్తి చేసుకొన్న విద్యార్థులే తదుపరి రెండేళ్లలో ఇంటర్‌ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ఈ తేడాకు కారణమేమిటనే ప్రశ్న విద్యానిపుణులను తొలుస్తోంది. ఏడాది, రెండేళ్లలోనే ఆ విద్యార్థుల్లో అంత పరిణతా? సెలబస్‌ సులభమా?, పరీక్షల్లో నిర్వాహణలో అనుకూలతలా? తదితర విషయాలపై కనుగొనాల్సి ఉంది.
గతేడాదితో పోలిస్తే జిల్లాలో ఈసారి పదో తరగతి ఫలితాల్లో దాదాపు 8శాతం ఉత్తీర్ణత పెరిగింది. గతేడాది 75.63శాతం ఉత్తీర్ణతతో 29వ స్థానంలో నిలిస్తే తాజాగా ఉత్తీర్ణత శాతం 83.29కి పెరిగింది. అయినా మిగతా జిల్లాలతో పోలిస్తే రెండు స్థానాలు దిగజారి 31వ స్థానానికి పరిమితమైంది. ఇంటర్‌కు వచ్చే సరికి పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తోంది. ఫలితాల్లో రాష్ట్రంలో 7లోపు ర్యాంకుల్లో ఉంటోంది.

ఫలితాలపై విశ్లేషణ

పదో తరగతి ఫలితాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికలు అమలు చేసింది. ప్రత్యేకంగా జిల్లా విద్యాశాఖాధికారి ప్రధానోపాధ్యాయులతో వరుస సమీక్షలు జరిపారు. గడిచిన విద్యా సంవత్సరం ఉపాధ్యాయులు, బదిలీలు, పదోన్నతుల తతంగం సుమారు నెలపాటు బోధనపై ప్రభావం చూపింది. శిక్షణలు, సెలవులు ప్రతికూలంగా మారాయి. అయినప్పటికీ డిసెంబరులోగానే పదో తరగతి సిలబస్‌ పూర్తి చేయించి వెంటనే పునఃశ్చరణ తరగతులకు రోజువారీ ప్రణాళికలను అమలు పరిచారు. వెనుకబడిన విద్యార్థుల దత్తత, హాజరు శాతం పెంచేందుకు శ్రద్ధ తీసుకొన్నారు. నిపుణులతో సందేహాలు తీర్చడం, ప్రేరణ తరగతులు నిర్వహించడం ద్వారా సిద్ధం చేశారు. అయినా తుది ఫలితాలు ఆశాజనకంగా రాకపోవడానికి విద్యార్థుల గైర్హాజరు ప్రధాన కారణంగా ఉపాధ్యాయులు చూపుతున్నారు. ఈ ప్రాంతంలో విద్యార్థుల మాతృభాషలు వేరుగా ఉండటం, కుటుంబ సామాజిక, ఆర్థిక పరిస్థితులు, పోషకుల్లో పిల్లల చదువుల పట్ల ఆసక్తి లేకపోవడం, విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు కొరవడటం తుది ఫలితాలను దెబ్బతీస్తున్నాయని అంచనా వేస్తున్నారు.

ఆ రెండింటిలోనే తప్పారు..

విద్యార్థులు ప్రధానంగా సైన్సు, గణితం పేపర్లలో ఎక్కువ మంది ఫెయిల్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాలు కొంత కఠినంగానే ఉన్నప్పటికీ విద్యార్థులు నిత్యం తరగతులకు హాజరై ఉంటే ఫలితాలు బాగుండేవని సంబంధిత ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. దీంతోపాటు ఉపాధ్యాయుల కొరత కూడా ఓ కారణమేనని చెబుతున్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడ పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించడం, కాపీయింగ్‌కు అవకాశాలు లేకపోవడం ఫలితాలు పడిపోవడానికి కారణాలని పోషకులు పేర్కొంటున్నారు. పది ఉత్తీర్ణులై ఇంటర్‌కు వెళ్లారంటే ఎంతో కొంత విద్యార్థిలో విషయంపై అవగాహన పెరుగుతుందని, ఇంటర్‌ పరీక్షల్లో విద్యార్థులకు వెసులుబాటు ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్‌ విద్యలోనూ బోధన ప్రణాళికలు మెరుగైన ఫలితాలకు కారణంగా సంబంధిత అధికారులు వివరిస్తున్నారు. ఇంటర్‌లో మెరుగైన పలితాలు వచ్చినట్లే పదో తరగతిలోనూ రావడానికి అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని పోషకులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని