logo

కబ్జాల వైపు కన్నెత్తి చూడరా?

ప్రభుత్వ భూముల్లో ఎవరైనా నిలువ నీడలేని పేదలు గుడిసె వేసుకుంటే రెవెన్యూ అధికారులు తొలగించడం సాధారణంగా గమనిస్తుంటాం.

Updated : 05 May 2024 06:57 IST

అధికారులపై వెల్లువెత్తుతున్న విమర్శలు..

 కాగజ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ భూముల్లో ఎవరైనా నిలువ నీడలేని పేదలు గుడిసె వేసుకుంటే రెవెన్యూ అధికారులు తొలగించడం సాధారణంగా గమనిస్తుంటాం. అయితే ఆర్థిక, రాజకీయ అండ కలిగిన వారు సర్కారు స్థలాలను దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నా.. సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణాలకు సమీపంలో, ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న స్థలాలకు డిమాండ్‌ ఉండటంతో.. పలువురు అక్రమార్కులు వాటిపై కన్నేశారు. ఇలా కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని పలు ప్రధాన రహదారుల పక్కన ఉన్న సర్కారు భూములు ఇప్పటికే కబ్జాదార్ల గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. మిగిలి ఉన్న గుంట, అరగుంట స్థలం కూడా ఈ మధ్యకాలంలో కబ్జాలోకి వెళ్తోంది.

 కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని కాగజ్‌నగర్‌-పెంచికల్‌పేట ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఇళ్ల స్థలాల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ రహదారి పక్కనే ఈజ్‌గాం శివారులోని ప్రభుత్వ భూమి సర్వే నం.34ని ఆక్రమించుకొని భవనాలు నిర్మించుకున్నారు. ఇదే సర్వే నంబరులో 50 మంది పేదలకు ఇళ్లస్థలాలు కేటాయించడంతో.. ఇళ్లు నిర్మించుకున్నారు. ఈ కాలనీకి పంచశీలనగర్‌గా నామకరణం జరిగింది. ఈ కాలనీకి ఆనుకొని ఉన్న సర్వే నం.34 ప్రభుత్వ మిగులు భూమిని రాజకీయ పలుకుబడి కలిగిన పలువురు తమ ఆధీనంలోకి తీసుకొని విక్రయించుకుంటున్నారు. పంచశీలనగర్‌ ప్రభుత్వ భూమిలోనే నివాసముంటున్న ఓ వ్యక్తి తన ఇంటిని అనుకొని ఉన్న సర్వే నం.34 ప్రభుత్వ భూమిలోని రెండు గుంటలను ఆక్రమించుకున్నాడు. తదనంతరం మరొక వ్యక్తికి లక్షలాది రూపాయలకు విక్రయించాడు. వీటికి ఎలాంటి హక్కు పత్రాలు లేవు. ఈ స్థలం కొనుగోలు చేసిన వ్యక్తికి ఎలాంటి పత్రాలు, రిజిస్ట్రేషన్‌ కూడా లేదు. ఈజ్‌గాం పంచాయతీ అనుమతి లేకుండానే ఇంటి నిర్మాణం కూడా చేపడుతున్నారు. అయినా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
ఈ విషయంపై తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌ను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు.

గువ్వలగూడలో రహదారి ఆక్రమణ

కాగజ్‌నగర్‌-పెంచికల్‌పేట ప్రధాన రహదారి పక్కన కాగజ్‌నగర్‌ మండలంలో గువ్వలగూడ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో  రహదారి పక్కనే పలువురు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని ఇళ్లు, వ్యాపార సముదాయాలు నిర్మించుకున్నారు. గువ్వలగూడనుంచి దహెగాం మండలం ఇట్యాలకు వెళ్లే మార్గంలో.. ఓ వ్యక్తి ఏకంగా రహదారి స్థలాన్ని ఆక్రమించుకుని సిమెంట్‌ స్తంభాలు పాతుకున్నాడు. నిత్యం రాకపోకలతోపాటు వ్యవసాయ పనులకు వెళ్లే దారిని మూసివేసే యత్నంలోనే భాగంగా కబ్జాకు పాల్పడుతున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని