logo

అభిమాన తరంగం.. ఉప్పొంగిన ఉత్సాం

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో శనివారం రాత్రి నిర్వహించిన కేసీఆర్‌ రోడ్‌షో గులాబీ శ్రేణుల్లో ఉత్తేజం నింపింది.

Updated : 05 May 2024 06:55 IST

మంచిర్యాలలో కేసీఆర్‌ రోడ్‌షో విజయవంతం

మంచిర్యాల పట్టణం, మంచిర్యాల సిటీ, మంచిర్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో శనివారం రాత్రి నిర్వహించిన కేసీఆర్‌ రోడ్‌షో గులాబీ శ్రేణుల్లో ఉత్తేజం నింపింది. ఈ రోజు మంచిర్యాల జిల్లాలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైన అభిమానులంతా మండుటెండలోనూ తరలివచ్చారని కేసీఆర్‌ కొనియాడారు. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డా ఓపికగా కేసీఆర్‌ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. భారాస ప్రభుత్వంలో తాగునీరు, కరెంట్‌,  అభివృద్ధి ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా ఉందని అప్పటి ఇప్పటి పరిస్థితులను కేసీఆర్‌ ప్రజలకు వివరించారు. అయిదు నెలల్లో ఎలా ఆగం అయ్యాం.. మంచిర్యాల జిల్లా ఉండాలన్నా, రైతుబంధు యథావిదిగా రావాలన్నా భారాసకు పట్టం కట్టాలి. జిల్లా కేంద్రంలో నిర్మాణ దశలో ఉన్న సమీకృత మార్కెట్‌ సముదాయం పనులను ఎందుకు ఆపారు. భారాస హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ నిలిపివేసి పురోగతికి ఆటంకం కల్పిస్తున్నారు.. అంటూ సమస్యలపై కేసీఆర్‌ ప్రసంగించినప్పుడు భారాస శ్రేణుల్లో జోష్‌ కన్పించింది.

 ప్రజలకు బస్సులో నుంచి నమస్కరిస్తున్న కేసీఆర్‌, ఈశ్వర్‌

 పల్లె, పట్టణ ప్రగతిపై జిల్లాలో పట్టణాలు ఎక్కువగా ఉండటంతో భారాస హయాంలో చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి గురించి వివరించారు. ప్రస్తుతం పల్లెల అభివృద్ధికి నిదులు ఇవ్వడం లేదు. హరితహారం మొక్కలు, పల్లె ప్రకృతివనాలు ఎండిపోతున్నాయి. క్రీడా ప్రాంగణాల్లో మొక్కలు మొలుస్తున్నాయి.. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరిస్తుందని దుయ్యబట్టారు.

  • ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డిపై తనదైన శైలిలో ప్రసంగించడంతో కార్యకర్తలు జేజేలు కొట్టారు. మీకు రైతుబంధు వస్తుందా.. రుణమాఫీ చేశారా.. కల్యాణలక్ష్మి తులం బంగారం ఇచ్చారా, రంజాన్‌ తోఫా ఇచ్చారా, ప్రధాని మోదీ ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ఇచ్చారా అంటూ కేసీఆర్‌ ప్రజలను అడగగా ఇవ్వలేదంటూ సమాధానం ఇచ్చారు.
  • గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు అస్వస్థతకు ఆసుపత్రుల పాలవుతున్నారని విద్యార్థుల సమస్యలను ప్రస్తావించారు.
  • సాయంత్రం అయిదు గంటల నుంచి కేసీఆర్‌ మంచిర్యాల ఐబీ చౌరస్తా వరకు వచ్చే వరకు కళాకారులు ఆటపాటలతో కార్యకర్తల్లో హుషారునింపారు. కేసీఆర్‌ చేసిన అభివృద్ధిని పొగుడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు వివరిస్తూ పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు భారీ సంఖ్యలో ప్రత్యేక వాహనాల్లో తరలించారు. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా పూర్తిగా జనంతో నిండిపోయింది. కళాకారులు పాడే పాటలతో వేదిక ముందున్న కార్యకర్తలు గులాబీ కండువాలు ఊపుతూ నృత్యాలు చేశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని