logo

చిన్నగూడు.. ఆదర్శం చూడు

ఎక్కడి నుంచో వలస వచ్చిన కూలీలు వారు. ఉండేందుకు తాత్కాలికంగా టార్పాలిన్‌లతో కట్టుకున్న నివాసాలు వారివి. పనికెళితేనే పూట గడిసే పరిస్థితి. వారి గురించి ఇంతే చెబితే అందులో ప్రత్యేకత ఉండదు.

Updated : 06 May 2024 06:27 IST

ఛత్తీస్‌గఢ్‌ కూలీల పెరటి తోటల పెంపకం

తమ గుడిసెల ముందర సాగు చేస్తున్న పెరటి తోటలో కూరగాయలు తెంపుతున్న మహిళలు

మామడ, న్యూస్‌టుడే: ఎక్కడి నుంచో వలస వచ్చిన కూలీలు వారు. ఉండేందుకు తాత్కాలికంగా టార్పాలిన్‌లతో కట్టుకున్న నివాసాలు వారివి. పనికెళితేనే పూట గడిసే పరిస్థితి. వారి గురించి ఇంతే చెబితే అందులో ప్రత్యేకత ఉండదు. ఇంకాస్త లోతుకు వెళ్లి వారి ఇళ్ల ముందర కనిపించే కూరగాయల తోటను పరిశీలిస్తే ఔరా అని ముక్కున వేలేసుకోవాల్సిందే. నిర్మల్‌ పట్టణంలోని బొమ్మరిల్లు కాలనీలో గృహనిర్మాణ పనుల నిమిత్తం ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఓ పది కుటుంబాలు వచ్చి రెండు మూడేళ్లుగా పని ప్రదేశంలోనే ఉంటున్నాయి.

కాసింత స్థలంలోనే కావల్సినన్ని కూరగాయలు

వారి నివాసాలు చాలా చిన్నగా ఉంటాయి. గట్టిగా గాలి వస్తే పైకప్పు లేచి పోతుంది. చుట్టూ కట్టిన అట్టలు చిరిగి పోతాయి. కానీ వారిళ్ల ముందర ఉన్న కాసింత స్థలంలోనే ఆ మహిళలు ఇంటికి సరిపడా కూరగాయలు సాగు చేస్తున్నారు. ఒకటి రెండూ కాదు ఆకుకూరలు, పలు రకాల కాయగూరలు పండిస్తున్నారంటే నిజంగా వారిని అభినందించాల్సిందే. గోంగూర, తోటకూర, టమాట, సొరకాయ, బీరకాయ, బెండ వంటివి సాగు చేస్తూ వంట చేసే సమయంలోనే అప్పటికప్పుడు తెంపి తాజా కూరలు వండుకుంటున్నారు. మనలో చాలామంది ఎంత స్థలం ఉన్నా ఇంటిపంటపై ఉత్సాహం చూపించక మందులు చల్లిన కూరగాయలనే కొని తెచ్చుకుంటారు. అలాంటి వారు ఈ ఛత్తీస్‌గఢ్‌ వాసులనుంచి ఎంతో నేర్చుకోవచ్చు. వారంలో కేవలం రెండు రోజులే బయట కూరగాయలు కొంటామని మిగతా రోజుల్లో మా ఇళ్ల ముందరి వాటినే తెంపి వంట చేసుకుంటామని సీమ, ఉత్తర, పార్వతి, మీరా చెప్పారు. తమ ఇంటి పంటతో వంట ఎంతో రుచిగా అనిపిస్తుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని