logo

వసతులు లేక ఇక్కట్లు

పేదలకు గూడు కల్పించేందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు పడకగదుల ఇళ్ల పథకంలో భాగంగా పట్టణంలోని బంగల్‌పేట్‌ శివారులో పెద్దమొత్తంలో జీప్లస్‌2 విధానంలో గృహాలను నిర్మించారు.

Published : 06 May 2024 05:05 IST

రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారులకు తప్పని అవస్థలు

ఇళ్ల మధ్య మురుగు దుస్థితి

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: పేదలకు గూడు కల్పించేందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు పడకగదుల ఇళ్ల పథకంలో భాగంగా పట్టణంలోని బంగల్‌పేట్‌ శివారులో పెద్దమొత్తంలో జీప్లస్‌2 విధానంలో గృహాలను నిర్మించారు. దరఖాస్తులదారుల్లోంచి లక్కీ డ్రా విధానంలో అర్హులను ఎంపికచేసి సుమారు 1,500 కుటుంబాలకు వీటిని పంపిణీ చేశారు. ఇది జరిగి దాదాపు ఆరేడు నెలలవుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ ప్రాంతంలో ఇప్పటికీ సరైన వసతులు లేకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మురుగుమయం..

పెద్దమొత్తంలో కుటుంబాలు నివాసం ఉండటంతో ఇళ్ల నుంచి వెలువడుతున్న మురుగును సక్రమంగా బయటకు తరలించేందుకు ఏర్పాటుచేసిన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా మురుగంతా బయటకు చేరి ఇళ్లమధ్య నిల్వఉంటోంది. ఫలితంగా దోమలబెడద పెరుగుతోంది. చెత్తసేకరణకు మున్సిపల్‌ వాహనాలు సక్రమంగా వచ్చిన దాఖలాలు లేకపోవడంతో ఆరుబయట పడేస్తున్నారు. దీనివల్ల చెత్త పోగవుతోంది. మొత్తంగా పారిశుద్ధ్యం దెబ్బతినడంతో వ్యాధుల వ్యాప్తి ఎక్కువయ్యే అవకాశం ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు.

రోడ్డు దుస్థితి ఇలా..

రహదారుల్లేవు..

కాలనీలో అంతర్గత రహదారుల్లేవు. మట్టిరోడ్లే కావడంతో చాలావరకు గుంతలమయంగా మారాయి. వాహనదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. మహాలక్ష్మి ఆలయ సమీపంలోని రెండుపడక గదుల ఇళ్లకు వెళ్లే ప్రధానమార్గం చూస్తే విషయం అర్థమవుతోంది. దీనికితోడు మురుగునీరు చేరడంతో ఈ రోడ్డువెంట వాహనాలను నడపడం చోదకులకు నరకప్రాయంగా మారుతోంది. విద్యుద్దీపాల సమస్య లేకపోయినా.. సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయానికి వెళ్లే ప్రధాన రోడ్డులో ఏర్పాటుచేసిన సెంట్రల్‌ లైటింగ్‌ ప్రారంభించిన రోజు మినహా ఎప్పుడూ వెలగడం లేదని, ఫలితంగా ఈ మార్గమంతా అంధకారం నెలకొంటోందని పేర్కొంటున్నారు.

తాగునీటికి..

నూతనంగా ఏర్పడిన ఈ కాలనీల్లో నీటి అవసరాలకు ఇబ్బందులు తప్పటం లేదు. మిషన్‌ భగీరథ పథకం కింద నీటి సరఫరా పూర్తిస్థాయిలో జరగడం లేదు. కొన్ని సందర్భాల్లో నీరు రంగుమారి వస్తోందని, ఫలితంగా తాగేందుకు అవకాశం లేకుండాపోతోందని మండిపడుతున్నారు. చేతిపంపులు సరిపడా ఏర్పాటుచేయకపోవడంతో ఉన్నచోట నీటికోసం పడిగాపులు తప్పటం లేదు. కొంతమంది బ్లాక్‌ల వారీగా తమ ప్రాంతంలో సొంత ఖర్చులతో బోర్లు వేయించుకొని నీటి అవసరాలు తీర్చుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని