logo

కమలదళం.. కదనోత్సాహం

‘‘గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబాకు ప్రణామం.. బాసర సరస్వతీ, పోరాటయోధుడు కుమురం భీం, రాంజీగోండ్‌, కొండా లక్ష్మణ్‌ బాపూజీలకు ప్రణామాలు..’’ అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కాగజ్‌నగర్‌లో నిర్వహించిన వికాస సంకల్ప సభలో ప్రసంగం ప్రారంభించారు.

Published : 06 May 2024 05:29 IST

అమిత్‌షా రాకతో.. శ్రేణుల్లో జోష్‌
ఈనాడు, ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే, కాగజ్‌నగర్‌, కాగజ్‌నగర్‌ గ్రామీణం

‘‘గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబాకు ప్రణామం.. బాసర సరస్వతీ, పోరాటయోధుడు కుమురం భీం, రాంజీగోండ్‌, కొండా లక్ష్మణ్‌ బాపూజీలకు ప్రణామాలు..’’ అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కాగజ్‌నగర్‌లో నిర్వహించిన వికాస సంకల్ప సభలో ప్రసంగం ప్రారంభించారు. కాంగ్రెస్‌, భారాస పాలనలో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలను ప్రస్తావిస్తూనే, మోదీ హయాంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. ఎలాంటి మచ్చలేని వ్యక్తి, గోడం నగేష్‌ను గెలిపించి, మోదీని మరోసారి ప్రధాని చేయాలని పిలుపునిచ్చారు. అమిత్‌షా మాట్లాడుతున్నంత సేపు సభలో జోష్‌ కనిపించింది. ఠారెత్తిస్తున్న ఎండలో సైతం వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో సభ విజయవంతం కావడంపై పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

మొదట అమిత్‌షా పర్యటన ఆదివారం ఉదయం 11 గంటలకని నేతలు ప్రకటించారు. అనంతరం మారిన షెడ్యూల్‌ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకని చెప్పారు. సాయంత్రం 4.22 గంటలకు ఆయన హెలికాప్టర్‌లో రాగా.. 4.34 గంటలకు వేదికపైకి చేరుకున్నారు. 23 నిమిషాలపాటు ఆద్యంతం అమిత్‌షా ప్రసంగం హుషారుగా సాగగా.. ఆయనతోపాటు సభికులు పెద్దఎత్తున స్పందించారు. పలుమార్లు మోదీ.. మోదీ అంటూ, జైశ్రీరామ్‌, వందేమాతరం, హర్‌హర్‌ మోదీ, హర్‌ఘర్‌ మోదీ అంటూ.. సభ ఆవరణను నినాదాలతో హోరెత్తించారు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలకు నేతలు తాగునీరు, భోజనం ఏర్పాటు చేశారు.

అభివాదం చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, చిత్రంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు రామారావు పటేల్‌, పాల్వాయి హరీశ్‌బాబు, మహేశ్వర్‌రెడ్డి, పాయల్‌ శంకర్‌, ఎంపీ అభ్యర్థి గోడం నగేష్‌, తదితర నాయకులు

మాది సంక్షేమం.. వారిది అవినీతిమయం..

భాజపా హయాంలో రాష్ట్రంతోపాటు ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను అమిత్‌షా సభలో వివరించారు. 2.14 లక్షల మందికి రూ.5 లక్షల చొప్పున అందించామన్నారు. 47వేల మంది మహిళలకు ఉజ్వల గ్యాస్‌ సిలెండర్లు, 55వేల మంది రైతులకు ఏటా రూ.6 వేలు పంపిణీ చేశామని చెప్పారు. 150 కిలోమీటర్ల మేర గ్రామీణ సడక్‌ యోజన రోడ్లు, 350 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రహదారులు, జైనథ్‌-బేల రోడ్డు విస్తరణ, రూ.40 కోట్లతో వంతెన, రూ.40 కోట్లతో ఆదిలాబాద్‌ రైల్వేస్టేషన్‌ మరమ్మతులతోపాటు, మంచిర్యాల-ఆసిఫాబాద్‌-ఉట్నూరు వరకు నాలుగు వరుసల రహదారిని పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. మరోవైపు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును కాంగ్రెస్‌, భారాసలు వదిలిపెట్టాయని విమర్శిస్తూ స్థానిక సమస్యలకు ప్రాధాన్యమిచ్చారు.

హాజరైన కార్యకర్తలు, ప్రజలు

సభలో పదనిసలు..

  • మోదీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చారు. రాత్రివేళల్లో రాహుల్‌, ప్రియాంక సైతం వ్యాక్సిన్‌ తీసుకున్నారని అనగానే సభలో స్పందన లభించింది. మోదీని మరోసారి ప్రధాని చేస్తారా, కమలం పువ్వు గుర్తుకే ఓటేస్తారా అని చెబుతూ సభికుల నుంచి సానుకూల సమాధానాలను అమిత్‌షా రాబట్టారు.
  • భారాస, కాంగ్రెస్‌ ఒకటేనని, ఓవైసీ-బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ ఏకమై తమ ఓటుబ్యాంకు కాపాడుకునేలా ప్రయత్నిస్తున్నారని, అందుకే విమోచన దినోత్సవం చేయడం లేదని విమర్శించారు. సభికులు చప్పట్లతో స్పందించారు.
  • రెండు చేతులు ఎత్తి భారత్‌మాతాకీ జై, జై శ్రీరామ్‌ అని సభికులతో అమిత్‌షా అనిపించారు. సభికులను ఆకట్టుకునేలా పలుమార్లు ఆదిలాబాద్‌ వాసియో అని సంబోధించారు. అమిత్‌షా రాకముందే నలుగురు ఎమ్మెల్యేలు ప్రసంగించారు.
  • ఛాయ్‌వాలా మోదీ కావాలా, కోట్లు సంపాదించే రాహుల్‌ బాబా కావాలని అని అనగానే సభలో మోదీ.. మోదీ అని అరుపులు వినిపించాయి. ఎమ్మెల్యే హరీశ్‌బాబు మాట్లాడుతుండగా యువకులు పెద్దఎత్తున స్పందించారు.
  • ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్‌బాబు, రామారావు పటేల్‌, ఏలేటి మహేశ్వరరెడ్డి, పాయల్‌ శంకర్‌, మాజీ మంత్రి అమర్‌సింగ్‌ తిలావత్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్‌, నేతలు సుహాసినిరెడ్డి, బ్రహ్మానందర్‌, రాఠోడ్‌ రమేశ్‌, కోట్నాక విజయ్‌కుమార్‌, అరిగెల నాగేశ్వరరావు, ధోని శ్రీశైలం, కొంగ సత్యనారాయణ, పాల్గొన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని