logo

రైతుల పేరు... దళారుల జోరు

అన్నదాతలకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం జొన్నలను కొనుగోలు చేస్తుంటే ఇదే అదనుగా దళారులు రైతుల పేరున విక్రయించి అక్రమాలకు పాల్పడుతున్నారు.

Published : 07 May 2024 04:05 IST

ఆంధ్రా, మహారాష్ట్ర నుంచి భారీగా జొన్నల తరలింపు
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ వ్యవసాయం  

ఆంధ్రా ప్రాంతం నుంచి అమ్మకానికి వచ్చిన జొన్నలు

అన్నదాతలకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం జొన్నలను కొనుగోలు చేస్తుంటే ఇదే అదనుగా దళారులు రైతుల పేరున విక్రయించి అక్రమాలకు పాల్పడుతున్నారు. పంటఉత్పత్తుల కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతుండటంతో ప్రభుత్వం మూడేళ్లుగా సమగ్ర సర్వేను ప్రతిపాదికగా తీసుకుంటోంది. అయినా సర్వే సమయంలోనే కొంతమంది రైతులు పంటను సాగు చేయకపోయినా.. జొన్న సాగు చేసినట్లుగా చూపారు. అలాంటి రైతులకు కొంత కమీషన్‌ ఆశచూపి వారి పేరున మద్దతు ధరతో పంటను విక్రయించి అక్రమాలకు పాల్పడుతున్నారు. స్థానిక దళారులు ఆంధ్రా, మహారాష్ట్ర నుంచి తక్కువ ధరతో జొన్నలు కొనుగోలు చేసి, ఇక్కడి రైతుల పేరుతో మద్దతు ధరతో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

జిల్లాలో ఈ ఏడాది జొన్న పంట కొంత ఆశాజనకంగా ఉంది. దిగుబడులు రావడం, మద్దతు ధర ఎక్కువగా ఉండటంతో లాభాలొస్తాయని రైతులు ఆశపడ్డారు. తీరా పంట విక్రయించే సమయంలో మార్కెట్లో ధర తగ్గడంతో ఆందోళనలో మునిగారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు కేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. ఆదిలాబాద్‌ జిల్లాలో 9 కేంద్రాలు ఏర్పాటు చేసింది. ప్రారంభంలో కొనుగోళ్లపై పరిమితి విధించారు. ఎకరానికి 8.80 క్వింటాళ్లకు మించి కొనొద్దని ఆదేశాల్లో పేర్కొన్నారు. జిల్లా మొత్తంలో 66 వేల ఎకరాల్లో పంట సాగు చేశారు. ఎకరానికి 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని రైతులు తెలిపారు. ఎకరానికి 15 క్వింటాళ్ల వరకు అనుమతి ఇవ్వాలని కోరడంతో.. తాజాగా ప్రభుత్వం 12 క్వింటాళ్ల వరకు అనుమతి ఇస్తున్నట్లు మార్కెట్‌ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రకటించారు.  

పక్కాగా నిబంధనలు

ప్రభుత్వ కేంద్రాల్లో పంటను విక్రయించాలంటే యాసంగిలో అధికారులు చేపట్టిన సర్వేలో రైతులు ఎన్ని ఎకరాల్లో జొన్న పంటను చేశారనేది ఆన్‌లైన్‌లో నమోదై ఉండాలి. రైతు మూడు ఎకరాల్లో జొన్న పంటను సాగు చేస్తే ప్రభుత్వ నిబంధనల మేరకు 36 క్వింటాళ్ల వరకు విక్రయించుకునే వీలుంది. రైతుల పేర్లు పొరపాటున ఆన్‌లైన్‌లో నమోదై లేకుంటే.. సాగు చేసినట్లుగా వ్యవసాయాధికారులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. అదే కౌలుదార్లకు సంబంధిత రైతు సంతకంతోపాటు వ్యవసాయాధికారి ధ్రువీకరిస్తే.. వాస్తవ సాగుదారు పేరున పంటను కొనుగోలు చేసే అవకాశం ఉంది.

జరుగుతోంది ఇలా..

మార్కెట్లో తక్కువ, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఎక్కువగా ఉండటంతో దళారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రారంభం నుంచే కొంతమంది ఒక ప్రణాళిక ప్రకారం ఈ వ్యవహారాన్ని నడిపినట్లు తెలుస్తోంది. ముందు జాగ్రత్తగా కొంతమంది దళారులు తమకు తెలిసిన రైతులతో వాళ్లు పంట సాగు చేయకపోయినా.. జొన్న సాగు చేసినట్లుగా అధికారులతో ఆన్‌లైన్‌లో చేయించారు. తాజాగా వారి పేర్లతోనే దళారులు పంటను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మరికొంతమంది వ్యవసాయ విస్తరణాధికారులతో కుమ్మక్కై పంట సాగు చేసినట్లుగా తెలిసిన రైతుల పేరున ధ్రువీకరణ పత్రం తీసుకొని వాళ్ల పేరుతో పంటను విక్రయిస్తున్నారు.

ఈ విషయమై మార్కెట్‌ ఏడీ శ్రీనివాస్‌ను వివరణ కోరగా, ప్రభుత్వ నిబంధనల మేరకు ఆన్‌లైన్‌లో రైతుల పేరు ఉంటేనే పంటను కొనుగోలు చేస్తున్నామన్నారు. దళారులు అక్రమంగా విక్రయించేందుకు రైతులు అవకాశం ఇవ్వొద్దని ఆయన సూచించారు.

ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు : రూ. 3,180
ప్రైవేటులో : రూ. 2,600

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని