logo

ఎండ మాయం.. వానతో అపారనష్టం

జిల్లా వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం వరకు ఎండ నిప్పుల కొలిమిని తలపించినప్పటికీ రెండు గంటల తర్వాత వాతావరణం మారిపోయి. ఒక్కసారిగా ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి.

Published : 08 May 2024 03:36 IST

హాజీపూర్‌ మండలం టీకనపల్లిలో తడిసిన ధాన్యాన్ని చూపిస్తున్న రైతు

లక్షెట్టిపేట, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం వరకు ఎండ నిప్పుల కొలిమిని తలపించినప్పటికీ రెండు గంటల తర్వాత వాతావరణం మారిపోయి. ఒక్కసారిగా ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. వడగళ్ల వానకుతోడు పిడుగులు పడటంతో జిల్లా వాసులు భయాందోళనకు గురయ్యారు. అకాల వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఈదురుగాలులకు చెట్లు నేలకొరగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్తంభాలు పడిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి రైతాంగానికి వేదన మిగిల్చింది. ఇక ఈదురు గాలులకు కోత దశకు వచ్చిన మామిడి నేల రాలి తీరని నష్టాన్ని మిగిల్చింది.

అన్నదాత అరిగోస

జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లో వరిధాన్యం చేతికి రావడంతో రైతులు అమ్మడానికి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించారు. దీంతో రహదారులు, కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ చూసినా వరికుప్పలు దర్శనం ఇస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ధాన్యం తరలింపులో జాప్యంతో కేంద్రాల్లో ధాన్యం పెద్ద ఎత్తున నిల్వలు ఉన్నాయి. ఒక్కసారిగా కురిసిన వర్షానికి చాలా ప్రాంతాల్లో పంట తడిసింది. కళ్లాల్లో నీరు వచ్చి చేరడంతో తేమ శాతం తగ్గడానికి ఇంతకాలం మండుటెండలను సైతం లెక్క చేయకుండా ఉన్న రైతులకు అకాల వర[్షం అశనిపాతంగా మారింది.

కన్నెపల్లిలో రహదారిపై పడ్డ పాఠశాల వేదిక పై కప్పు రేకులు

మామిడి రైతులను నిండా ముంచిన గాలులు

జిల్లాలో ఈదురు గాలులు, రాళ్ల వానతో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. బెల్లంపల్లి డివిజన్‌ పరిధిలోని పలు మండలాల్లో కోతకు వచ్చిన మామిడి పంట నేలరాలడంతో రైతులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది.

భగభగల నుంచి కాస్త ఉపశమనం

అకాల వర్షం రైతులకు నష్టాన్ని మిగిల్చగా జిల్లా వాసులకు మాత్రం ఎండ తీవ్రత నుంచి కాస్త ఉపశమనం కలిగించింది. జిల్లాలో మంగళవారం 4 డిగ్రీల మేర తగ్గి 41.8 డిగ్రీలకు పరిమితమైంది. సాయంత్రం 4 గంటల నుంచి వాతావరణం చల్లబడింది. దీంతో గత వారం రోజులుగా వడగాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం ఊపిరిపీల్చుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు