logo

ఆయన ఎన్నికల ఖర్చు రూ.500

ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని ప్రతి ఒక్కరికి తెలుసు. వార్డు సభ్యుడు మొదలు ఏ ఎన్నిక జరిగినా డబ్బులు కుమ్మరించాల్సిందే. ఇక అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఖర్చులు తడిసిమోపెడవుతాయి.

Updated : 08 May 2024 06:56 IST

ఎంపీ ఆశన్న ఘనత
కూరగాయలమ్మి డబ్బులు సమకూర్చిన తల్లి

కందుల ఆశన్న

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పట్టణం: ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని ప్రతి ఒక్కరికి తెలుసు. వార్డు సభ్యుడు మొదలు ఏ ఎన్నిక జరిగినా డబ్బులు కుమ్మరించాల్సిందే. ఇక అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఖర్చులు తడిసిమోపెడవుతాయి. కేవలం రూ.500 ఖర్చుతోనే ఎంపీగా విజయం సాధించారంటే ఈ తరం నమ్మకపోవచ్చు. ఆయనే దివంగత లోక్‌సభ సభ్యుడు కందుల ఆశన్న. ఆదిలాబాద్‌ రెండో ఎంపీగా ఎన్నికైన ఆయన అతి సామాన్య కుటుంబం నుంచి రాజకీయాల్లో వచ్చి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. న్యాయవాదిగా, నిజాయతీపరుడిగా పేరు గడించిన ఆయనది ఆదిలాబాద్‌ పట్టణం కుమార్‌పేట్‌ కాలనీ. తండ్రి నర్సిములు చిన్నతనంలోనే చనిపోవడంతో తల్లి గంగవ్వ కూరగాయలు అమ్మి కష్టపడి చదివించింది. ఆమె ముగ్గురు సంతానం. ఈయన రెండో సంతానం. ఏడో తరగతి వరకు ఆదిలాబాద్‌లో అభ్యసించిన ఆశన్నపై చదువుల కోసం నిజామాబాద్‌ వెళ్లారు. ఎల్‌ఎల్‌బీ హైదరాబాద్‌లో చదివి న్యాయవాద పట్టా అందుకున్నారు. 

దిల్లీ ఎన్నికలంటే భయపడ్డ తల్లి

ఆ సమయంలో సోషలిస్టులు, వామపక్ష పార్టీల ప్రభావం ఆదిలాబాద్‌లో అధికం. అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయాలను శాసించిన చిలుకూరి భోజారెడ్డి న్యాయవాదైన ఆశన్నను ఎంపీగా పోటీ చేయించేందుకు ఆమె తల్లిని అడిగారు. దిల్లీకి పంపడానికి భయపడిన ఆమెను ఒప్పించారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా 1957లో ఆశన్నను బరిలోకి దింపారు. పార్టీ ఫండ్‌ కింద రూ.250 ఇవ్వగా ఆయన తల్లి గంగవ్వ కూరగాయలు అమ్మి భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్నదంతా రూ.250 ఇచ్చింది. వాటితోనే ఆయన ప్రచారం చేసి విజయం సాధించినట్లు ఆయన కుమారులు రవీందర్‌, గజేందర్‌లు తెలిపారు. 1952లో ఎంపీగా ఎన్నికైన ఆశన్న ఆ తరువాత కూడా రాజకీయాల్లో కొనసాగి మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. జిల్లా కేంద్రంలో సీసీఐ పరిశ్రమ, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసిన వారిలో ఆయన పాత్ర కీలకం. భూదాన ఉద్యమ కర్త ఆచార్య వినోబాభావే చేపట్టిన యాత్ర ఆదిలాబాద్‌కు వచ్చిన సమయంలో ఆయన వెంటే దాదాపు 60 కిలోమీటర్లు నడిచి భూ సేకరణకు సహకరించారు. న్యాయవాదిగా ఏడు పదుల వయసులోనూ జిల్లా కోర్టుకు వెళ్లి సేవలందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు