logo

ప్రాణాలు పోతున్నా పట్టింపు కరవాయే

రైతులు తాము పండించిన పంటలు ఆరబెట్టుకునేందుకు ఉపాధి హామీ పథకంలో కల్లాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తున్నా వాటి గురించి అవగాహన లేకనో.. ఎవరు నిర్మించుకోవాలనే నిర్లక్ష్యమో తెలియదు కానీ రహదారులపైనే ఆరబెట్టుకోవడం పరిపాటిగా మారింది.

Updated : 09 May 2024 07:07 IST

రహదారులపై పంటల ఆరబోతతో తరచూ ప్రమాదాలు

ఆరబెట్టిన మొక్కజొన్నలు, ధాన్యం పక్కన ప్రమాదకరంగా పెట్టిన రాళ్లు

లోకేశ్వరం, న్యూస్‌టుడే: రైతులు తాము పండించిన పంటలు ఆరబెట్టుకునేందుకు ఉపాధి హామీ పథకంలో కల్లాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తున్నా వాటి గురించి అవగాహన లేకనో.. ఎవరు నిర్మించుకోవాలనే నిర్లక్ష్యమో తెలియదు కానీ రహదారులపైనే ఆరబెట్టుకోవడం పరిపాటిగా మారింది. రోడ్డుపై సగం వరకు పంటలు ఆరబెట్టుకోవడంతో పాటు అటువైపు వాహనాలు రాకుండా ఉండేందుకు పెద్ద బండ రాళ్లు పెడుతుంటారు. పైపెచ్చు వానొస్తే తడవకుండా నల్లని టార్పాలిన్లు కప్పుతుంటారు. ఇవన్నీ వాహన చోదకుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అయినా పంటలు రోడ్డుపై ఆరబెట్టవద్దని ఇటు రహదారులు, భవనాల శాఖ అధికారులు, పోలీసులు రైతులకు అవగాహన కల్పిద్దాం.. అలా చేసిన వారిపై చర్యలు తీసుకుందామనే ఆలోచన చేయకపోవడం విడ్డూరం.

రైతన్నలారా..మీరే ఆలోచించాలి

అరుగాలం కష్టించి పండించిన పంటను కాపాడుకునేందుకు రైతులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో పంట చుట్టూ రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగలు తగిలి ఎందరో ప్రాణాలు కోల్పోయారు. పంటలు ఆరబెట్టే క్రమంలో ఇలా రోడ్డుపై వేసిన పంట కుప్పల కారణంగా విలువైన ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. అయినా రైతన్నలు ఆలోచన మాత్రం మారడం లేదు. దేశానికి అన్నం పెట్టేందుకు రాత్రి, పగలనే తేడా లేకుండా కష్టపడే రైతుకు వారు చేసే పొరపాట్లపై అవగాహన కల్పించేందుకు అధికారులు చొరవ చూపాలి. ఎవరి పనుల్లో వారే నిమగ్నమవుతున్న అధికారులు సైతం ఈ వైపు ఆలోచించడం లేదు. రోడ్డుపై ధాన్యం ఆరబెట్టి విలువైన ప్రాణాలు పోవడానికి కారణంగా నిలిస్తే ఏమిచ్చినా ఆ తల్లిదండ్రులు, భార్యాపిల్లలకు తీరని దుఃఖాన్ని మిగిల్చిన వారే అవుతారు. ఒక్క సారి మీరే ఆలోచించాలి.


తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న ఈ క్షతగాత్రుడి పేరు మౌలాన. నాలుగేళ్ల కిందట తన మేనల్లుడిని ద్విచక్రవాహనంపై తీసుకుని ధర్మోర నుంచి లోకేశ్వరం వైపు వస్తుండగా రహదారిపై ఆరబెట్టిన పంట కుప్పలపైకి వెళ్లిన వాహనం అదుపుతప్పడంతో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అదే రోజు మౌలాన, నాలుగు రోజుల తర్వాత మేనల్లుడు మృత్యువాతపడ్డారు.


చిరునవ్వులు చిందిస్తున్న ఈ యువకుడి పేరు ధర్మపురి సూర్యకిరణ్‌. దశాబ్ద కాలంగా లోకేశ్వరంలో సూపర్‌మార్కెటు వ్యాపారం చేసుకుంటూ ఎందరో యువకులకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలం తల్వేద గ్రామంలోని అత్తగారింట్లో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తూ సీహెచ్‌ కొండూర్‌ వద్ద రహదారిపై ఆరబోసిన ధాన్యం కుప్పపైకి ద్విచక్ర వాహనం దూసుకుపోవడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వ్యాపారంలో రాణిస్తూ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలుస్తున్న ఒక్కగానొక్క కుమారుడు మరణించాడని తెలుసుకున్న తల్లిదండ్రులను, పాతికేళ్ల వయసులోనే భర్తను కోల్పోయి ఇద్దరు చిన్న పిల్లలను ఎలా పోషించుకోవాలో తెలియక రోదిస్తున్న భార్యను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని