logo

ప్రతిష్ఠాత్మకం.. ఎంపీ స్థానం..

ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, భాజపా, భారాస ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఓట్లు చీల్చే పార్టీ ఏది? ఆ ఓట్లు ఏపార్టీకి మేలు చేకూరుస్తాయనే అంశం మూడు పార్టీల నేతలను అంతర్మథనానికి గురిచేస్తోంది.

Updated : 09 May 2024 07:05 IST

మంత్రి.. ఎమ్మెల్యేలకు పరీక్షే..
ఈటీవీ- ఆదిలాబాద్‌

శాసనసభ ఎన్నికల్లో మనకు వచ్చిన ఓట్ల ఆధిక్యత ఇప్పుడు ఎంపీకి కూడా వస్తుందా.? ప్రజల్లో ఆశించినంత ఉత్సాహం కనిపించటంలేదు. కారణమేంటి.? ఒకవేళ ఓట్ల పరంగా మనకు ఆధిక్యత రాకుండా కాంగ్రెస్‌కు అనుకూలంగా మారితే పరిస్థితి ఏమిటి.? రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న పథకాల పట్ల జనంలో కాంగ్రెస్‌ ఆశించినంత సానుకూలత ఉందా.? చివరి నిమిషంలో ఓటింగ్‌ సరళి కుడి, ఎడమైతే ఎలా.? అప్పుడు ఏ పార్టీకి అనుకూలంగా మారుతుంది’’

తాజాగా భారాస, భాజపా నేతలను అంతర్మథనానికి గురిచేస్తున్న అంశాలివి.


పెద్దపల్లి లోక్‌సభ స్థానం పరిధిలోకి వచ్చే మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్‌ని వదిలేస్తే ఆదిలాబాద్‌ లోక్‌సభస్థానం పరిధిలోని ఖానాపూర్‌ ఒకేచోట విజయం సాధించాం. ఆరుచోట్ల ఓడిపోయాం. శాససభ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే దాదాపుగా 2 లక్షల పైచిలుకు ఓట్లను సమకూర్చుకుంటే తప్పితే ఎంపీగా విజయం సాధించటం కష్టం. క్షేత్రస్థాయిలో వస్తున్న స్పందన ఓట్లరూపంగా మారుతుందా.?

కాంగ్రెస్‌ నేతల ఆలోచన సరళి ఇది


దిలాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, భాజపా, భారాస ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఓట్లు చీల్చే పార్టీ ఏది? ఆ ఓట్లు ఏపార్టీకి మేలు చేకూరుస్తాయనే అంశం మూడు పార్టీల నేతలను అంతర్మథనానికి గురిచేస్తోంది. ఫలితంగా ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి ఇది పరీక్షా సమయంగా మారింది. పోలింగ్‌కు మరో అయిదురోజులే గడువు ఉన్నందున గెలుపోటములపై ప్రధాన పార్టీల్లో తీవ్రమైన చర్చ సాగుతోంది.


భాజపాలో కనిపించని హుషారు

శాసనసభ ఎన్నికలతో పోల్చుకుంటే భాజపాలో ప్రస్తుతం ఉత్సాహం కనిపించటంలేదు.  ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, పాయల్‌శంకర్‌, పాల్వాయి హరీష్‌బాబు, రామారావు పాటిల్‌ ప్రాతినిథ్యం ఉన్నప్పటికీ ప్రచారంలో వెనకబడే ఉంది. ఇటీవల కాగజ్‌నగర్‌కు అగ్రనేత అమిత్‌షా, బుధవారం ఖానాపూర్‌కు రాజాసింగ్‌ సింగ్‌ తప్పితే రాష్ట్ర, జాతీయ నేతలెవరూ రాలేదు. శాసనసభ ఎన్నికల్లో నిర్మల్‌, ఆదిలాబాద్‌, సిర్పూర్‌(టి), ముథోల్‌ ఎమ్మెల్యేలుగా విజయం సాధించినప్పటికీ ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో భాజపా 4,48,961 ఓట్లతో రెండోస్థానంలోనే ఉంది. భారాస 4,65,476ఓట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా గెలిచిన నాలుగు స్థానాల్లోని  ఓట్లు చెదరకుండా చూసుకోవటంతోపాటు మిగిలిన బోథ్‌, ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌ స్థానాల్లో ఓటర్లను ప్రభావితం చేయటం భాజపా ఎమ్మెల్యేలకు పరీక్షగా మారింది.


కాంగ్రెస్‌లో కలకలం

గ్రూపు విభేదాలకు నిలయమైన కాంగ్రెస్‌లో ఇప్పుడూ అదే పరిస్థితి ఉంది. ఇతరపార్టీల్లోని కీలకనేతలు, సొంతపార్టీకి చెందిన పాత నేతలంతా పనిచేయటానికి ఆసక్తి చూపిస్తున్నప్పటికీ అందరినీ సమన్వయం చేసే నాయకత్వం కొరవడింది. మూడుసార్లు సీఎం రేవంత్‌రెడ్డి, నిర్మల్‌కు అగ్రనేత రాహుల్‌గాంధీ వచ్చివెళ్లిన తర్వాత కూడా పెద్దగా మార్పు కనిపించటంలేదు. మొన్నటిశాసనసభ ఎన్నికల్లో ఖానాపూర్‌ ఎమ్మెల్యేగా వెడ్మబొజ్జు గెలిచినప్పటికీ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కలిపి 2,51,886 ఓట్లు సాధించి మూడోస్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండటం కలిసివచ్చే అవకాశంగా కనిపిస్తోంది. ఎంపీగా ఆత్రం సుగుణ గెలవాలంటే శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లతోపాటు మరో 2లక్షల ఓట్లు అధికంగా సాధించాల్సి ఉంది.  భాజపానో, భారాసనో ఏదో ఒకపార్టీ ఓటు బ్యాంకుకు గండికొడితే తప్పితే కాంగ్రెస్‌ ఆధిక్యం సాధించటం కష్టమే. మంత్రి సీతక్క జిల్లా ఇన్‌ఛార్జితోపాటు, ఆదిలాబాద్‌ ఎంపీ స్థానానికి కూడా బాధ్యులుగా ఉన్నారు. ఇది ఒకరకంగా తనకు పరీక్షే. తాజాగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్మల్‌ జిల్లా పార్టీ అంతరంగిక సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్‌ గెలుపోటములను సమీక్షిస్తున్నారు.


భారాసలో భయం

శాసనసభ ఎన్నికల ముందు తిరుగులేని రాజకీయశక్తిగా ఉన్న భారాస ఇప్పుడు డీలాపడింది. మొన్నటి ఎన్నికల్లో ఆసిఫాబాద్‌లో కోవ లక్ష్మి, బోథ్‌లో అనిల్‌జాదవ్‌ గెలుపుతో రెండు స్థానాలకే పరిమితమైంది. కానీ శాసనసభ ఎన్నికల్లో 4,65,476 ఓట్లు సాధించి మొదటిస్థానంలోనే నిలిచింది. ఇప్పుడు ఆదిలాబాద్‌ ఎంపీ స్థానం గెలవటం ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఆసిఫాబాద్‌, బోథ్‌ సహా పార్టీకి పట్టున్న స్థానాలుగా భావిస్తున్న ఆదిలాబాద్‌, నిర్మల్‌, సిర్పూర్‌ ఏమేరకు భారీ ఓట్లు రాబట్టుకోవడం సందేహంగానే కనిపిస్తోంది. కీలకనేతల్లో జోగు రామన్న, దండె విఠల్‌లాంటివారు పార్టీలోనే ఉన్నప్పటికీ కోనప్ప, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్‌, విఠల్‌రెడ్డి పార్టీ మారటం ఓటర్లపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎంపీగా ఆత్రం సక్కు విజయం సాధించాలంటే శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను తిరిగి తెచ్చుకోవటం ఒక్కటే భారాస ముందున్న కర్తవ్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని