logo

ఇక రెండు రోజులే..

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు మూడు రోజులు మాత్రమే గడువు ఉండగా.. ప్రచారం శనివారం సాయంత్రానికే పరిసమాప్తం కానుంది.

Published : 10 May 2024 05:42 IST

ముమ్మరంగా  ప్రధాన పార్టీల ప్రచారం

ఈనాడు, ఆసిఫాబాద్‌: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు మూడు రోజులు మాత్రమే గడువు ఉండగా.. ప్రచారం శనివారం సాయంత్రానికే పరిసమాప్తం కానుంది. ఈ తరుణంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలు మండల కేంద్రాలు, గ్రామాలను సుడిగాలిలా చుట్టేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటు వేసి, తమకే మద్దతు తెలపాలని అభ్యర్థిస్తున్నారు. పోటాపోటీగా సభలు, సమావేశాలు ఏర్పాటు నిర్వహిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో సంపూర్ణంగా ఓటర్లు గంపగుత్తగా తమకే ఓటు వేసేలా తీర్మానాలు సైతం చేసుకుంటున్నారు. ఇలా తీసుకున్న నేతలు ఈ ప్రాంతాలను వదిలేసి, మిగతా చోట్ల ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. ఉదయం నుంచి పగలంతా ప్రచారం చేస్తూ.. రాత్రి వేళల్లో కులపెద్దలు, సంఘాలు, గ్రామ పటేళ్లను కలుస్తున్నారు. ఓటేస్తే సమస్యలను పరిష్కరిస్తామని హామీలు గుప్పిస్తున్నారు.

మంత్రి అన్నీ తానై..

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క.. జిల్లాలోని అన్ని మండలాలను కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణతో కలిసి ఇప్పటికే చుట్టేశారు. మంత్రి మారుమూల గ్రామాలను సైతం వదలకుండా ప్రచారం నిర్వహించారు. కౌటాల, బెజ్జూరు, చింతలమానేపల్లి మండలాల్లోని అసమ్మతి నేతలను బుజ్జగించడంతో పాటు, ఇతర పార్టీల నుంచి గణనీయంగా నాయకులను పార్టీలో చేర్చుకున్నారు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో అజ్మీరా శ్యామ్‌నాయక్‌, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌ చేరోవైపు ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు. మండల స్థాయి నేతలు, కొందరు జడ్పీటీసీ సభ్యులు ఆయా మండలాల్లో విస్తృతంగా ఓటర్ల వద్దకు వెళ్లి, ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల ముందు ఉంచుతున్నారు. అభ్యర్థి ఆత్రం సుగుణ సొంత గ్రామం సిర్పూర్‌(యు), జైనూర్‌ మండలాల సరిహద్దుల్లో ఉంటూ.. వారి కుటుంబ సభ్యులు, బంధువులు సైతం ప్రచారంలో ముమ్మరంగా పాల్గొని స్థానిక వ్యక్తికి మద్దతు తెలపాలని అభ్యర్థిస్తున్నారు.

  • కాంగ్రెస్‌ నుంచి మంత్రి సీతక్క జిల్లా అంతటా పర్యటించగా, సిర్పూర్‌లో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, నియోజకవర్గ ఇన్‌ఛార్జి రావి శ్రీనివాస్‌లు విస్తృతంగా ప్రజల్లో తిరుగుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సైతం హస్తం శ్రేణుల్లో జోష్‌ నింపింది.

భారాస ఇలా..

గురువారం సాయంత్రం ఆసిఫాబాద్‌లో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ రోడ్‌షో ఉంటుందని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అనంతరం సమయాభావంతో రావడం లేదని చెప్పారు. ఇప్పటి వరకు ఆ పార్టీ అగ్రనేతలు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు వంటి వారు ఎవరూ జిల్లాలో ప్రచారం చేయకపోవడం వల్ల కార్యకర్తలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్‌ అన్నీ తామై ప్రచారం నిర్వహిస్తున్నారు. మండల కేంద్రాల్లో సభలను నిర్వహిస్తూ, చేరికలను ప్రోత్సహిస్తున్నారు.

భాజపా దూకుడు..

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సభ విజయవంతం కావడం వల్ల కమలనాథులు ప్రచార దూకుడు పెంచారు. ఎంపీ అభ్యర్థి గోడం నగేష్‌, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, నేతలు కొత్తపల్లి శ్రీనివాస్‌, కోట్నాక విజయ్‌కుమార్‌లు రెండు నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. చిన్నపాటి సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రధాని మోదీ విశిష్టతను వివరిస్తున్నారు. ఆసిఫాబాద్‌ జడ్పీటీసీ సభ్యుడు అరిగెల నాగేశ్వరరావు భారాస నుంచి భాజపాలో చేరడంతో కొన్ని మండలాల్లో బలోపేతం అయినట్లుగా పార్టీ శ్రేణులు భావించాయి. అయితే భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆజ్మీరా ఆత్మారామ్‌ నాయక్‌, తన మద్దతుదారులతో గురువారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆత్మారాం నాయక్‌ రెండుసార్లు ఆసిఫాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన పార్టీ మారడం భాజపాకు ఏ మేరకు నష్టమనే చర్చ జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని