logo

జగన్‌.. ఇదేనా స్వచ్ఛ సంకల్పం?

చింతపల్లిలో స్వచ్ఛభారత్‌ కల నెరవేరడం లేదు. మేజర్‌ పంచాయతీలో నమూనా ప్రాజెక్టుగా నిర్మించిన ఘన సంపద ఉత్పాదన కేంద్రం నేటికీ నిరుపయోగంగా మిగిలిపోయింది.

Updated : 19 Apr 2024 04:47 IST

నిరుపయోగంగా సంపద కేంద్రాలు

చింతపల్లిలో పేరుకుపోతున్న పాలిథిన్‌ వ్యర్థాలు

చింతపల్లి, న్యూస్‌టుడే: చింతపల్లిలో స్వచ్ఛభారత్‌ కల నెరవేరడం లేదు. మేజర్‌ పంచాయతీలో నమూనా ప్రాజెక్టుగా నిర్మించిన ఘన సంపద ఉత్పాదన కేంద్రం నేటికీ నిరుపయోగంగా మిగిలిపోయింది. ఈ కేంద్రానికి పలు విడతలుగా ఇప్పటివరకూ సుమారు రూ.10 లక్షలకు పైగానే ఖర్చు చేశారు. చెత్త నుంచి సంపద సృష్టించాలనే లక్ష్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు అధికారులు, గుత్తేదారులకు కాసులు పండించింది తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇక పంచాయతీల్లో నిర్మించిన సంపద కేంద్రాలు కేవలం అలంకారప్రాయంగా మిగిలిపోయాయి.

చింతపల్లిలో సంపద కేంద్రం

చింతపల్లి మండలంలో 17 పంచాయతీలున్నాయి. వీటిలో చింతపల్లి ఒక్కటే మేజరు పంచాయతీ. సుమారు 14వేల మంది పైచిలుకు జనాభా ఇక్కడ నివసిస్తున్నారు. నిత్యం చింతపల్లి వచ్చి వెళ్లేవారి సంఖ్య మూడు వేల నుంచి ఐదు వేల మధ్య ఉంటుంది. దీంతో ఇక్కడ చెత్త సమస్య అధికంగా ఉంటోంది. పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యత పంచాయతీకి పెద్ద సవాలుగా మారింది. కొద్దికాలం క్రితం వరకూ ఒక ఎడ్లబండి, ఐదుగురు సిబ్బందితోనే నెట్టుకొచ్చేవారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌లో రెండు ట్రాక్టర్లు వచ్చాయి. అయినా తగినంత పారిశుద్ధ్య సిబ్బంది లేకపోవడంతో వీధులన్నీ చెత్తాచెదారాలతో నిండిపోతున్నాయి. ఈ పరిస్థితిని నివారించే లక్ష్యంతో  చింతపల్లిలో ఏర్పాటు చేసిన ఘన సంపద ఉత్పాదన కేంద్రం వినియోగంలోకి వచ్చినా దీని ద్వారా ఆదాయం ఏమీ రావడం లేదు. ఇక మండలంలో నిర్మించిన 14 సంపద కేంద్రాలు నిరుపయోగంగానే ఉంటున్నాయి.

కార్మికులకు వేతనాల్లేవు

జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరిట వైకాపా ప్రభుత్వం 2021లో హడావిడి చేసింది. ఆ తరువాత క్లాప్‌ మిత్రల పేరిట పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులను నియమించినా వారికి నెలనెలా సరిగ్గా వేతనాలు ఇవ్వడం లేదు. నెలకు రూ. ఆరు వేల చొప్పున ఒక్కో కార్మికునికి 15వ ఆర్థిక సంఘం నిధులతో అప్పుడప్పుడు జీతాలు ఇస్తున్నారు. నెలలు తరబడి వేతనాలు ఇవ్వకపోవడంతో చాలా చోట్ల క్లాప్‌ మిత్రలు విధులకు హాజరు కావడంలేదు.

సీఎం పర్యటనతో..

విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ చేయడానికి కొద్దినెలల క్రితం ముఖ్యమంత్రి జగన్‌ చింతపల్లి వచ్చారు. ఆయన కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలోనే బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభా ప్రాంగణానికి ఆనుకునే డంపింగ్‌ యార్డు ఉంది. అక్కడే ఘన సంపద కేంద్రం ఉంది. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో జిల్లాలోని అధికార యంత్రాంగం అంతా ఉరుకులు పరుగులు పెట్టి డంపింగ్‌ యార్డు ప్రాంగణాన్నంతటినీ శుభ్రం చేయించారు. ఇందుకోసం వందల సంఖ్యలో కార్మికులను వినియోగించారు. ఆయన వెళ్లాక పరిస్థితి మళ్లీ షరా మామూలైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని