logo

స్పందించాల్సిన తరుణమిదే!

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి.

Updated : 19 Apr 2024 04:52 IST

దరఖాస్తులకు 22తో గడువు పూర్తి
దివ్యాంగులు, వృద్ధులు ఇంటినుంచే ఓటు వేసుకునే అవకాశం

కార్యాలయంలో 12 డి దరఖాస్తు ఇస్తున్న ఓటరు కుటుంబ సభ్యుడు

నక్కపల్లి, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. ఈ కోవలోనే దివ్యాంగులు, వృద్ధులు ఇంటినుంచే ఓటు వేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం అమలులోకి తెచ్చింది. మే 13న జరిగే ఎన్నిక కోసం ఇలాంటి వారంతా దరఖాస్తు చేసుకోడానికి గడువు ఈనెల 22తో ముగియనుంది.

గత సార్వత్రిక ఎన్నికల వరకు ఎన్నికల దివ్యాంగులు, వృద్ధులు నేరుగా పోలింగ్‌ కేంద్రానికే వచ్చి ఓటేయాల్సిన పరిస్థితి. కొన్ని పార్టీల మద్దతుదారులు ఇలాంటి వారిని తామే స్వయంగా కేంద్రాలకు తీసుకువచ్చి ఓటేయిస్తుండటంతో ఇందులో పారదర్శకత లోపిస్తోంది. దీనికి తోడు ఇళ్ల నుంచి రాలేనివారు ఓటు వేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో దివ్యాంగులు, అనారోగ్య కారణాలతో ఇళ్లకే పరిమితమైనవారు, 85 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటినుంచే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఇందుకోసం ఫారం 12డిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే వీరి సేకరించిన ఎన్నికల సంఘం ఆ మేరకు బూత్‌స్థాయి అధికారుల ద్వారా వారికి 12డి ఫారాలు అందించేలా చొరవచూపింది. ఆసక్తి ఉన్నవారంతా దరఖాస్తులు నింపారు. మరోవైపు అనారోగ్య సమస్యలతో ఇళ్లకే పరిమితమైన వారిని బీఎల్వోలు గుర్తించి దరఖాస్తులు అందిస్తున్నారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో దివ్యాంగ ఓటర్లు 25 వేలకుపైగా ఉండగా, 85 ఏళ్లు దాటిన వృద్ధులు సుమారు 8 వేల మంది ఉంటారని అంచనా. ఇళ్ల వద్ద అనారోగ్య సమస్యలతో మంచాలకు పరిమితమైనవారు వందల సంఖ్యలో ఉంటారని అంచనా. కాగా ఇంటి వద్ద ఓటేయడానికి అనుమతి పొందిన వారు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటేయడం కుదరదు. ఓటు పొందినవారికి పోస్టల్‌ బ్యాలెట్‌ అందిస్తారు. ఆ మేరకు సెక్టోరల్‌ అధికారి పోలింగ్‌ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తారు. బూత్‌స్థాయి అధికారి, పోలీసు అధికారి పర్యవేక్షణ, ఆయా పార్టీల పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలో ఇలాంటి వారు రహస్యంగా పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవచ్చు. హోం ఓటింగ్‌ కార్యక్రమాన్ని వీడియో చిత్రీకరణ చేస్తారు.

రెండు విడతల్లో..

12డి దరఖాస్తు ఇవ్వడానికి ఈనెల 22తో గడువు ముగియనుంది. వీరికి 24వ తేదీ తర్వాత ఓటు వచ్చిన విషయాన్ని బీఎల్వోల ద్వారా తెలియజేస్తాం. ఈ మేరకు వచ్చే నెల మూడో తేదీ నుంచి పదో తేదీలోగా రెండు విడతల్లో పోలింగ్‌ చేయిస్తాం. మొదటి విడతలో వినియోగించుకోనివారు, రెండో విడతలో ఓటేయొచ్చు. అర్హులు ఎవరైనా పోస్ల్టల్‌ బ్యాలెట్‌ కోరుకుంటే 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇక కేంద్రాలకు వచ్చి ఓటేసే దివ్యాంగులకు కేంద్రాల వద్ద ర్యాంపులు, చక్రాల కుర్చీలు అందుబాటులో ఉంటాయి. 

కె.గీతాంజలి, ఆర్‌ఓ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని