logo

రాష్ట్రంలో అరాచక పాలన

పార్లమెంట్‌ అభ్యర్థి సి.ఎం.రమేశ్‌పై వైకాపా నాయకుల దాడిని నిరసిస్తూ పేటలో ఆదివారం కూటమి నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

Published : 06 May 2024 01:38 IST

పేటలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న కూటమి నాయకులు

పాయకరావుపేట, ఎస్‌.రాయవరం, నక్కపల్లి, కోటవురట్ల, న్యూస్‌టుడే: పార్లమెంట్‌ అభ్యర్థి సి.ఎం.రమేశ్‌పై వైకాపా నాయకుల దాడిని నిరసిస్తూ పేటలో ఆదివారం కూటమి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద తెదేపా, జనసేన, భాజపా నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనకు ఈ సంఘటన అద్దం పడుతోందని ఆరోపించారు. ఎస్‌.రాయవరం మండలం పెదగుమ్ములూరులో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జనసేన, భాజపా నియోజకవర్గ ఇన్‌ఛార్జులు గెడ్డం బుజ్జి, పాకలపాటి రవిరాజు నాయకులు, కార్యకర్తలతో కలిసి కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. గుడివాడలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు అమలకంటి అబద్ధం, మాజీ అధ్యక్షుడు నల్లపరాజు వెంకటరాజు, ప్రధాన కార్యదర్శి అల్లు నరసింహమూర్తి నిరసన తెలిపారు. నక్కపల్లిలో కూటమి నాయకులు మాట్లాడుతూ వైకాపా ఓటమి భయంతోనే సీఎం రమేశ్‌పై దాడికి పాల్పడ్డారని అన్నారు. ఈ ఎన్నికల్లో వైకాపాను ప్రజలు ఇంటికి సాగనంపడానికి సిద్ధమయ్యారన్నారు. సీఎం రమేశ్‌కు ముత్యాలనాయుడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కోసూరు శ్రీనివాసరావు, అడ్డూరి లోవరాజు, మీసాల బాబులు, దేవవరపు లోవరాజు, నున్న కాశీ పాల్గొన్నారు. కోటవురట్ల మండలం రాట్నాలపాలెంలో నిరసన చేపట్టారు. జానకీ శ్రీను, కనకరాజు, దాసరి వెంకట్రావు, శ్రీను, ఏసు, గోవిందు తదితరులు పాల్గొన్నారు.  

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడుకు ఓటమి భయం పట్టుకుందని, దీంతోనే దాడులకు పాల్పడుతున్నారని భాజపా రాష్ట్ర కార్యదర్శి సురేంద్రమోహన్‌ తెలిపారు. పార్టీ ఎన్నికల కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కార్యకర్తను పరామర్శించడానికి వెళ్తున్న సీఎం రమేశ్‌పై ముత్యాలనాయుడు దాడులు చేయించడం సరికాదన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు, జనసేన చోడవరం ఇన్‌ఛార్జ్‌ రాజు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా డ్రోన్‌ ఎరగవేస్తే దీన్ని సాకుగా చూపి భాజపా కార్యకర్తపై దాడులు చేయించడం దారుణమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని