logo

చంద్రబాబుతోనే పోలవరం పూర్తి

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, దానికోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రంపచోడవరం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని  మిరియాల శిరీషాదేవి అన్నారు.

Published : 06 May 2024 01:53 IST

ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి శిరీషాదేవి

ఎటపాక, న్యూస్‌టుడే: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, దానికోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రంపచోడవరం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని  మిరియాల శిరీషాదేవి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్ల్లో ప్రచారం నిర్వహించారు. తొలుత లక్ష్మీపురంలో తెదేపా మండల అధ్యక్షుడు పుట్టి రమేష్‌ ఆధ్వర్యంలో ఆమెకు స్వాగతం పలికారు. పోలవరం పూర్తి కావాలన్నా, నిర్వాసితులకు ప్యాకేజీ అందరికి అందాలన్నా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఎటపాకలోని ఆంజనేయస్వామి ఆలయం నుంచి ప్రారంభమైన ఎన్నికల ప్రచారం పురుషోత్తపట్నం, నెల్లిపాక, తోటపల్లి, గౌరిదేవిపేట, లక్ష్మీపురం, నందిగామ, మురుమూరు తదితర పంచాయతీ గ్రామాల్లో సాగింది. నేతలు పాటి చలపతిరావు, కిలారు వెంకటేశ్వరరావు, నలజాల శ్రీకాంత్‌, వల్లభనేని చందు, బొల్లా పుల్లయ్య, బాచినేని శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

కూటమి పథకాలతో అన్నివర్గాలకు లబ్ధి

చింతపల్లి గ్రామీణం, గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు.. ఉమ్మడి మ్యానిఫెస్టోలో ప్రకటించిన పథకాలతో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుందని తెదేపా రాష్ట్ర కార్యదర్శి కిల్లు రమేష్‌నాయుడు పేర్కొన్నారు. ఆదివారం చింతపల్లి మండలంలోని పెదబరడ, చిన్నబరడ, చిక్కుడుబట్టి, ఎర్రబొమ్మలు, గూడెంకొత్తవీధి మండలంలోని జర్రెలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వైకాపా దుర్మార్గ పాలన సాగించిందని విమర్శించారు. ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేశారని ఆరోపించారు. యువతకు ఉపాధి లేదని, మహిళలకు రక్షణ కరవైందని పేర్కొన్నారు. చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తెదేపాను గెలిస్తే ప్రతి కుటుంబానికి ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని పేర్కొన్నారు. జీవో నంబరు 3 పునరుద్ధరణ కూటమి గెలుపుతోనే సాధ్యమన్నారు. సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి గిడ్డి ఈశ్వరిని, కమలం గుర్తుకు ఓటు వేసి కొత్తపల్లి గీతను గెలిపించాలని అభ్యర్థించారు. దేవరాపల్లి సర్పంచి బుజ్జిబాబు, తెదేపా మండల యువత అధ్యక్షుడు ముర్ల కోటేశ్వరరావు, జనసేన మండల అధ్యక్షుడు కొయ్యం బాలరాజు, ప్రధాన కార్యదర్శి పొత్తూరు విష్ణుమూర్తి, యువత అధ్యక్షుడు అరడ కోటేశ్వరరావు, భాజపా మండల అధ్యక్షుడు బోండ్ల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని