logo

విత్తు ధర పెంచి చిత్తు చేశావు!

కొందరు ప్రైవేటుగా విత్తనాలు కొనుగోలు చేస్తుంటారు. వారికి ఎలాంటి రాయితీ వర్తించదు. గరిష్ఠ చిల్లర ధరకే విత్తనాలు కొనుగోలు చేయాలి. వారిపై ధరల పెరుగుదల భారం మూడింతలు పడింది.

Published : 07 May 2024 06:58 IST

జగన్‌ జమానాలో అన్నదాతలపై విపరీతమైన భారం
సోనామసూరి బస్తాపై గరిష్ఠంగా రూ. 233 వడ్డింపు
ఈనాడు అనకాపల్లి, న్యూస్‌టుడే, అనకాపల్లి

కొందరు ప్రైవేటుగా విత్తనాలు కొనుగోలు చేస్తుంటారు. వారికి ఎలాంటి రాయితీ వర్తించదు. గరిష్ఠ చిల్లర ధరకే విత్తనాలు కొనుగోలు చేయాలి. వారిపై ధరల పెరుగుదల భారం మూడింతలు పడింది. జగన్‌ బాదుడే బాదుడులో ఏ వర్గాన్ని విడిచిపెట్టలేదు. విద్యుత్తు ఛార్జీల నుంచి విత్తనాల ధరల వరకు పెంచేశారు. మాట్లాడితే రైతు పక్షపాతినని చెప్పుకొనే సీఎం సాగుకు సాయం అందించకపోగా, రాయితీలకు కోతలు పెట్టారు. విత్తు ధరలు పెంచి అన్నదాతలను అప్పుల్లోకి నెట్టారు. రైతులకు అవసరమైన విత్తనాలను సరఫరా చేయకుండా భరోసా కేంద్రాల చుట్టూ తిప్పారు. గతంలో రాయితీ విత్తనాలు సహకార సంఘాలు, వ్యవసాయ శాఖ గోదాముల్లో దొరికేవి. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో విత్తు కోసం యాప్‌లో నమోదు చేసుకుని ముందుగా డబ్బులు చెల్లించి.. వారం నిరీక్షిస్తేగానీ అందడం లేదు. కోరిన విత్తనాలను అందుబాటులో పెట్టకుండా.. ఈ-పంట పేరుతో ఒకటి, రెండు బస్తాల కంటే ఎక్కువ ఇవ్వకుండా అన్నదాతలను అవస్థలకు గురి చేస్తున్నారు.

కాడి వదిలేస్తున్న రైతు

రైతులకు ఏటా రాయితీ అందించే వరి విత్తనాల ధరలు భారీగా పెంచేశారు. గతంతో పోల్చితే రకాన్ని బట్టి క్వింటాకు రూ. 550 నుంచి రూ. 760 వరకు పెరగడంతో సన్న, చిన్నకారు రైతులపై ఆ మేరకు అదనపు భారం పడింది. ఓవైపు ఇంధన ధరలు, ఎరువుల రేట్లు పెరిగిపోయాయి. ఇంకోవైపు కూలీల వేతనాలు ఆకాశాన్నంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో విత్తనాల రేట్లు కూడా పెంచడంతో చాలామంది కర్షకులు కాడిని వదిలేశారు. కొందరు కౌలుకు ఇచ్చి సాగుకు దూరంగా ఉన్నారు. కౌలు తీసుకోవడానికి రానిచోట బీడు భూములుగా వదిలేశారు. దీంతో ఏటా సాగు విస్తీర్ణం తగ్గిపోయింది.

రూ. కోట్లలో  భారం

ఉమ్మడి జిల్లాలో 1.02 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తుంటారు. మొత్తం సాగు విస్తీర్ణానికి సరిపడా విత్తనాలను ప్రభుత్వం ఎప్పుడూ సరఫరా చేయదు. కేవలం 30 నుంచి 35 శాతం విస్తీర్ణానికే రాయితీ విత్తనాలను అందుబాటులో ఉంచింది. మిగతా వారంతా ప్రైవేటుగా కొనుగోలు చేసుకోవాల్సిందే. ఉమ్మడి జిల్లాలో రైతాంగానికి 55 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయి. తెదేపా హయాంలో క్వింటా వరి విత్తనాలు రాయితీ పోను రూ.2,320 నుంచి రూ.2,390 వరకు ఉండేది. వైకాపా సర్కారు వచ్చాక అవే విత్తనాలు రూ. 2,850 నుంచి రూ. 2,960 వరకు పెరిగాయి. క్వింటాకు సగటున రూ. 570 పెరిగింది. ఈ లెక్కన రాయితీ విత్తుపై రూ.3.69 కోట్లకు అదనంగా రైతులు ఖర్చుచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కేవలం శాఖాపరంగా సరఫరా చేసిన విత్తనాలపై భారం మాత్రమే.

పచ్చిరొట్టపైనా బాదుడే!

వరి సాగుకు ముందు తొలకరి వర్షాలు పడిన వెంటనే పచ్చిరొట్ట విత్తనాలు వేసుకుంటారు. జిల్లాలో జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పంటలు వేస్తారు. 2020లో జీలుగ పది కేజీలు రూ. 639 ధర ఉంటే దీన్ని రూ. 790కి పెంచారు. పిల్లిపెసర పది కేజీలు రూ. 877 ఉంటే ఈసారి రూ. 970కి పెంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని