logo

రోడ్డు ప్రమాదంలో ఇంజినీర్‌ దుర్మరణం

బొలెరో వాహనం అదుపు తప్పి ఇంజినీర్‌ దుర్మరణం పాలైన ఘటన మంగళవారం హుకుంపేట మండలంలో చోటుచేసుకుంది.

Published : 08 May 2024 01:36 IST

పవన్‌

హుకుంపేట, పాడేరు: బొలెరో వాహనం అదుపు తప్పి ఇంజినీర్‌ దుర్మరణం పాలైన ఘటన మంగళవారం హుకుంపేట మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై సతీష్‌ కథనం ప్రకారం.. కొట్నాపల్లి హైవే బేస్‌ క్యాంపు కార్యాలయం నుంచి హుకుంపేట వైపు వస్తున్న బొలెరో వాహనం తాడిపుట్టు జంక్షన్‌ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో హైవే అథారిటీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న వలసంగారి పవన్‌(28) తలకు తీవ్రగాయాలయ్యాయి. ఇతడిని పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందారు. ఇతడిది నెల్లూరు జిల్లా ముత్తుకూరు గ్రామం. ఈ ప్రమాదంలో ఆఫీస్‌ బాయ్‌కు గాయాలయ్యాయి. ఎస్సై సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. వాహన డ్రైవర్‌ సాయికృష్ణపై కేసు నమోదు చేశారు. పవన్‌ కుటుంబ సభ్యులకు హైవే అధికారులు సమాచారం అందించారు.


వలస కూలీ మృతి

చింతూరు, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ నుంచి తమిళనాడు కూలికి వెళ్లి తిరిగొస్తూ ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని చట్టిలో మంగళవారం జరిగింది. తమిళనాడు రాష్ట్రానికి కూలికి వెళ్లిన బాలచంద్‌కు ఫిట్స్‌ రావడంతో అక్కడి నుంచి అతన్ని పంపివేశారు. మార్గ మధ్యలో అస్వస్థతకు గురికావడంతో చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యలు చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్‌కు చెందిన ఇతడు ఇటీవల తమిళనాడు రాష్ట్రానికి కూలికి వెళ్లాడని చెపుతున్నారు.


దుంగల స్వాధీనం

స్వాధీనం చేసుకున్న వాహనం, దుంగలతో రేంజర్‌ జగదీష్‌, అటవీ సిబ్బంది

కొయ్యూరు, న్యూస్‌టుడే: బూదరాళ్ల పంచాయతీ నూకరాయితోట సమీపంలో బొలెరో వాహనంలో మైదాన ప్రాంతానికి తరలిస్తున్న 11 రోజ్‌వుడ్‌ దుంగలను పెదవలస రేంజర్‌ జగదీష్‌ ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది మంగళవారం పట్టుకున్నారు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం పాత కృష్ణదేవిపేటకు చెందిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిని చింతపల్లి డీఎఫ్‌వో కార్యాలయానికి తరలిస్తున్నట్లు అటవీ సిబ్బంది తెలిపారు. సెక్షన్‌ అధికారి సింహాద్రి, సిబ్బంది రాకేష్‌కుమార్‌, రాజ్‌కుమార్‌, దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు. పట్టుకున్న దుంగల విలువ రూ.85 వేలు ఉంటుందని వారు తెలిపారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని