logo

జలుబా..కొవిడా..?

జిల్లాలో కొవిడ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అనుమానిత లక్షణాలతో అనేకమంది పరీక్షలు చేయించుకునేందుకు క్యూలు కడుతున్నారు. ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. మరో పక్క వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విస్తృతం చేస్తున్నారు.

Published : 28 Jan 2022 02:17 IST

గూడూరు మండలం తరకటూరులో ఇళ్లకు

వెళ్లి వివరాలు సేకరిస్తున్న వైద్య సిబ్బంది

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే : జిల్లాలో కొవిడ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అనుమానిత లక్షణాలతో అనేకమంది పరీక్షలు చేయించుకునేందుకు క్యూలు కడుతున్నారు. ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. మరో పక్క వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విస్తృతం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా అనేక మంది జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నారు. సీజనల్‌గా వచ్చే జలుబు లక్షణాలా లేక కొవిడ్‌ అన్నది తెలియక ఆందోళన చెందుతున్నారు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇంటింటి సర్వేని వేగవంతం చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు....వ్యాక్సిన్‌ వేయించుకున్నారా లేదా అనే వివరాలు సేకరిస్తోంది.

36వ విడత సర్వే ప్రారంభం

ఇప్పటివరకు జిల్లాలో 35 విడతలుగా సర్వే నిర్వహించగా ఈ నెల 24 నుంచి 36వ విడత ప్రారంభించారు. జిల్లాలోని ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు పట్టణ ఆరోగ్యకేంద్రాల్లోని ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలతోపాటు వాలంటీర్లు, ఇతర సిబ్బందిని ఈ సర్వేలో భాగస్వామ్యం చేశారు. ఆయా బృందాలు ఏరోజు ఎన్ని ఇళ్లని సందర్శించారు... అనారోగ్య సమస్యలతో ఉన్నవారిని ఎందరిని గుర్తించారనే వివరాలు నమోదు చేసేందుకు ప్రత్యేక యాప్‌ అందుబాటులోకి తెచ్చారు. గతేడాది కూడా విడతలవారీగా సర్వే నిర్వహించడం ద్వారా క్షేత్రస్థాయిలో రోగులను గుర్తించి సకాలంలో చికిత్స అందించగలిగారు. ప్రస్తుతం మళ్లీ కొవిడ్‌ విజృంభించడంతో ప్రభుత్వ ఆదేశాలతో సర్వే ప్రక్రియను ముమ్మరం చేశారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఎంతమంది సభ్యులు ఉన్నారు..వారిలో ఏయే వయసుల వారు...ఎలాంటి అనారోగ్యలక్షణాలతో ఉన్నారు ఇలా పూర్తి వివరాలు సేకరించి ఈ సంజీవని యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఒక్కో వాలంటీర్‌కు 50 కుటుంబాలు కేటాయించారు. దూర ప్రాంతాలనుంచి వచ్చిన వారు, ఇతర దేశాలనుంచి స్వగ్రామాలకు ఎవరైనా వచ్చారా ఇలా అన్ని అంశాలను సేకరించాలని ఆదేశించడంతో ఆ దిశగా సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు. సర్వేలో గుర్తించిన ఆయా కుటుంబాల ఆరోగ్య సమాచారం ఏఎన్‌ఎం లాగిన్‌ నుంచి వైద్యుని లాగిన్‌కు చేరుతుంది. అప్పుడు ఎవరెవరు ఎలాంటి లక్షణాలతో బాధపడుతున్నారో తెలుసుకుని వైద్యులు రోగులకు సేవలు అందిస్తారు. కొవిడ్‌ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్ష చేయించి చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటారు.

సేవలను వినియోగించుకోండి

ప్రజలు కూడా అవగాహనతో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా జాప్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇటీవల చాలామంది జ్వరాల బారిన పడుతున్నా అవి వైరల్‌ జ్వరాలుగానే భావిస్తూ అశ్రద్ధ చేస్తున్నారు. ప్రమాదకర స్థితిలో ఆసుపత్రిలో చేరేకంటే ముందుగానే తగు చికిత్స తీసుకుంటే వారితో పాటు ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు. ఈ క్రమంలోనే ప్రజలకు వైద్యపరమైన సలహాలు ఇవ్వడంతోపాటు సందేహాలను నివృత్తి చేసేందుకు విజయవాడ సబ్‌కలెక్టరేట్‌ కార్యాలయంలో కంట్రోల్‌రూం ఏర్పాటు చేసి, సిబ్బందిని కూడా నియమించారు. దిగువ ఇచ్చిన కంట్రోల్‌రూం నెంబర్లకు ఫోన్‌చేసి సలహాలు పొందవచ్ఛు ప్రతి నియోజకవర్గానికి ఒక కొవిడ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. ఎవరైనా కొవిడ్‌ లక్షణాలతో ఉంటే అక్కడ చేరి చికిత్స తీసుకోవచ్ఛు జిల్లావ్యాప్తంగా రోజుకు 5వేల నుంచి 6వేల పరీక్షలు చేస్తుంటే వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కరోనాను కౌగిలించుకున్నట్లే. ఈ విషయాన్ని అందరూ గుర్తించి జాగ్రత్తగా ఉండాలని అధికారులు పదే పదే సూచిస్తున్నారు.

అందరి వివరాలు సేకరిస్తున్నాం

జిల్లాలోని అన్ని కుటుంబాలను సర్వే చేసేలా ఏర్పాట్లు చేశాం. బృందాలు ఇళ్లకు వచ్చినప్పుడు దాయకుండా ప్రజలు పూర్తి వివరాలు చెప్పాలి. ఆరోగ్య సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాం. తద్వారా కచ్చితమైన సమాచారం అందుబాటులో ఉండి త్వరితగతిన సేవలు అందించడానికి ఉపయోగపడుతుంది. అనారోగ్య సమస్యలు గుర్తించి ముందుగానే చెప్పడం ద్వారా సకాలంలో చికిత్స అందించడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. - డా.ఎం.సుహాసిని, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి

ఆసుపత్రిలో 47మంది చేరారు

జిల్లా ఆసుపత్రిలో ప్రస్తుతం వివిధ ప్రాంతాలకు చెందిన 47 మంది కొవిడ్‌ రోగులు చికిత్స పొందుతున్నారు. వారిలో 45మంది ఆక్సిజన్‌ అవసరం లేకుండానే చికిత్స తీసుకుంటున్నారు. ఇద్దరికి మాత్రం కొంత ఆక్సిజన్‌ అందించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఎక్కువ మంది జ్వరాల బారిన పడుతున్నారు. వైరల్‌ అనుకుని జాప్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. కొవిడ్‌ సోకినా వారం రోజుల్లో పూర్తిగా నయం అవుతుంది. సకాలంలో చికిత్స తీసుకోవాలి. - డా.అల్లాడ శ్రీనివాసరావు, జిల్లా బ్లడ్‌ బ్యాంకుల నోడల్‌ అధికారి

జిల్లాలో మొత్తం కుటుంబాలు 14,95,728

ఈనెల 24 నుంచి సర్వే చేసింది: 7.63 లక్షలు

అనుమానిత లక్షణాలతో ఉన్నవారు 455

పరీక్షల్లో పాజిటివ్‌ నిర్ధారణ అయినవారు: 24

విజయవాడలోని కొవిడ్‌ కంట్రోల్‌రూం ఫోన్‌నెంబర్లు 0866-2474803, 0866-2474804, 7995244260

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని