logo

అంతటా తూడు... పట్టించుకోరా గోడు

పంటలకు సాగునీరు అందించే కాలువలు ఎంత అవసరమో మురుగుపారే డ్రైన్లు కూడా అంతే కీలకం. ఏటా ప్రకృతి విపత్తుల ద్వారా నష్టపోయే దానికంటే సక్రమంగా మురుగుపారకపోవడం వల్ల జరిగే నష్టమే ఎక్కువగా ఉంటోంది. ఈ ఏడాది ఖరీఫ్‌కు అన్నదాతలు

Published : 26 May 2022 06:27 IST

అధ్వానంగా డ్రైన్లు

ఆందోళనలో అన్నదాతలు

లజ్జబండ మురుగు కాలువలో అల్లుకున్న తూడు

మచిలీపట్నం కార్పొరేషన్‌,న్యూస్‌టుడే: పంటలకు సాగునీరు అందించే కాలువలు ఎంత అవసరమో మురుగుపారే డ్రైన్లు కూడా అంతే కీలకం. ఏటా ప్రకృతి విపత్తుల ద్వారా నష్టపోయే దానికంటే సక్రమంగా మురుగుపారకపోవడం వల్ల జరిగే నష్టమే ఎక్కువగా ఉంటోంది. ఈ ఏడాది ఖరీఫ్‌కు అన్నదాతలు సమాయత్తమవుతున్న తరుణంలో మేటవేసుకుపోయిన మురుగుకాలువలు వారిని కలవరపెడుతున్నాయి.ఈ ఏడాది వివిధ డ్రైన్‌లలో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు చేసినా, ఇంకా ప్రారంభం కాలేదు. మరో వైపు గుత్తేదారులకు కోట్ల రూపాయల బకాయిలు ఉండటంతో పనులు చేపట్టేందుకు ముందుకురాని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో పూడిక తీత పనులు జరుగుతాయా లేదా అన్న అనుమానాలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

జిల్లాలో 21 పెద్దతరహా , 54 మధ్యతరహా, 702 చిన్నతరహా డ్రైన్లు ఉన్నాయి.ఇవన్నీ 2,752 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. బందరు మండలంలోని వాడపాలెం పంచాయతీ పరిధిలోని డ్రైన్‌ పూడుకుపోవడంతో గత ఖరీఫ్‌లో 500 ఎకరాలకుపైగా పొలాలు నీట మునిగిపోవడంతో రైతులు నష్టపోయారు. గూడూరు, బందరు మండలాల పరిధిలో విస్తరించిన కుక్కలకోడు, రొయ్యల కోడు ఈ రెండింటి పరిధిలో 3వేల ఎకరాల వరకు ఆయకట్టు ఉంటుంది. వీటిని తవ్వి ఏళ్లుగడిచిపోతుంది. మురుగు పారే దారిలేక ఏటా వేలాది ఎకరాలు ముంపుబారిన పడుతున్నాయి.పెడన, గూడూరు మండలాల పరిధిలోని లజ్జబండ డ్రైన్‌ పరిధిలో వేలాది ఎకరాల విస్తీర్ణం ఉంది. దీని పొడవునా తూడు,గుర్రపుడెక్కతో నిండిపోవడంతో ఆయా ప్రాంతాల్లో పొలాలు తరచూ ముంపునకు గురవుతున్నాయి. పెడన సెక్షన్‌ పరిధిలోని మేజర్‌ డ్రైన్‌ లజ్జబండ పొడవునా పిచ్చిమొక్కలు, జమ్ము దట్టంగా అల్లుకుపోతే ఇటీవల కొంత వరకు పనులు చేసి వదిలేశారు. మచిలీపట్నంలోని శివగంగ బేసిన్‌ కింద శివగంగ మేజర్‌ మురుగుకాలువ, గూడూరు మండలంలోని మల్లవోలు, కుక్కలకోడు, బంందరు -చల్లపల్లి రోడ్డుపక్కన , తాళ్లపాలెం , పోతేపల్లి మురుగు కాలువ ఇలా అన్నీ అధ్వానంగానే ఉన్నాయి. ఇటీవల కలెక్టరేట్‌లో నిర్వహించిన సాగునీటి సలహామండలి సమావేశంలోనూ ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సాగు సమయం సమీపిస్తున్నా ఇంతవరకు పట్టించుకోకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రొయ్యలకోడు డ్రైన్‌లో ఇలా..

రూ.30కోట్ల బకాయిలు..రూ15కోట్ల ప్రతిపాదనలు

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన పనులకు సంబంధించిన బకాయిలు రాక గుత్తేదారులు ఏళ్లతరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారులు కూడా ఎప్పుడు వస్తాయో స్పష్టత ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో కొందరు గుత్తేదారులు కోర్టులకు వెళ్లి వసూలు చేసుకుంటే మరికొందరు ఇంకా తిరుగుతూనే ఉన్నారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో చెల్లించాల్సిన బకాయిలు రూ.30కోట్ల వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. తాజాగా మళ్లీ రూ.15 కోట్ల పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు చేశారు. గతేడాది అత్యవసర పనులు నిమిత్తం ఒకటికి రెండుసార్లు టెంటర్లు పిలిచినా ఎవరూ రాలేదు. ఈ సారైనా వస్తారా అంటే అది నమ్మకం లేదని అంటున్నారు. దీంతో ఏంచేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికైనా పాలకులు చొరవ చూపి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

టెండర్ల దశలో పనులు

ఈ ఏడాది ప్రతిపాదించిన పనులు టెండర్ల దశలో ఉన్నాయి. ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. గుత్తేదారులకు బిల్లులు చెల్లించాల్సిన మాట వాస్తవమే. శాఖాపరంగా ప్రభుత్వానికి నివేదించాం. నిధులు విడుదలైన వెంటనే వారికి ఖాతాలకు జమ అవుతాయి. రైతులు ఇబ్బందులు పడకుండా అన్నివిధాలుగా కృషి చేస్తున్నాం. - మురళీకృష్ణ, డీఈ నీటిపారుదలశాఖ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని