logo

గన్నవరం పంచాయతీ ఈవో సస్పెన్షన్‌

రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు గన్నవరం పంచాయతీ ఈవో రాజేంద్రవరప్రసాద్‌ను సస్పెండ్‌ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి ఎస్వీ నాగేశ్వరనాయక్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 29 Nov 2022 05:21 IST

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు గన్నవరం పంచాయతీ ఈవో రాజేంద్రవరప్రసాద్‌ను సస్పెండ్‌ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి ఎస్వీ నాగేశ్వరనాయక్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రూ.4 కోట్ల ఆదాయం కలిగిన పంచాయతీలో ఈవో, సర్పంచి నిడమర్తి సౌజన్యలు సుమారు రూ.2 కోట్ల మేర నిధులను పక్కదారి పట్టించి స్వాహా చేశారని అక్టోబర్‌ 10న స్పందనలో జిల్లా కలెక్టర్‌కు పాలకవర్గ సభ్యులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గుడివాడ డీఎల్‌పీవో సంపత్‌కుమారి, సీనియర్‌ అసిస్టెంట్‌ శివరామకృష్ణ సహా మరో ఐదుగురితో కలెక్టర్‌ రంజిత్‌బాషా విచారణకు ఆదేశించారు. సుమారు పది రోజుల పాటు విచారణ చేపట్టిన డీఎల్‌పీవో బృందం.. ఈవో, సర్పంచి ఇద్దరూ రూ.1,58,12,672 నిధులను దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించారు. విచారణ కమిటీ నుంచి నివేదిక అందుకున్న డీపీవో.. తదుపరి చర్యల నిమిత్తం వివరణ కోరుతూ ఈ నెల 10న ఈవో, సర్పంచిలకు షోకాజ్‌ నోటీసులిచ్చారు. దుర్వినియోగానికి పాల్పడిన నగదును 1:1 నిష్పత్తిలో రూ.79.06 లక్షల చొప్పున ఇరువురిని బాధ్యులను చేస్తూ.. సర్పంచి చెక్‌పవర్‌ ఎందుకు రద్దు చేయకూడదో వివరణ కోరారు. ఈవో నుంచి వివరణ అందుకున్న అనంతరం అతడిని సస్పెండ్‌ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు జిల్లా కలెక్టర్‌ను సోమవారం స్పందనలో కలిసిన పాలకవర్గ సభ్యులు వీలైనంత త్వరలో రూ.1.58 కోట్లను రికవరీ చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో కోర్టును ఆశ్రయించేందుకు వెనుకాడమని తేల్చి చెప్పారు.
ప్రతి బిల్లు రూ.లక్షపైనే..: పంచాయతీ నిధుల దుర్వినియోగ వ్యవహారంలో ప్రతి బిల్లు రూ.లక్షపైనే ఉన్నట్లు తెలిసింది. విచారణ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా అద్దె ట్రాక్టర్లను తిప్పడమే కాకుండా సుమారు రూ.25 లక్షల మేర చెల్లించడంపై డీఎల్‌పీవో సంపత్‌కుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్వరమే అద్దె ట్రాక్టర్లను తొలగించాలని ఆదేశించినా నేటికీ కొనసాగించడం గమనార్హం. కలెక్టర్‌, డీపీవో స్థాయి అధికారులు అనుమతించాల్సిన బిల్లులకు సైతం నేరుగా నగదు చెల్లించారని సమాచారం. నకిలీ బిల్లులు పెట్టడంలో ఈవో, సర్పంచికి ఓ ప్రైవేట్‌ వ్యక్తితో కలిసి బదిలీపై వెళ్లిన గుమస్తా రామారావు వీరికి సహకరించినట్లు విశ్వసనీయ సమాచారం. చెత్త తరలింపు, పారిశుద్ధ్య కార్మికుల పేరిట ఈవో, సర్పంచిలు నకిలీ బిల్లులతో దోపిడీకి సంబంధించిన పూర్తి ఆధారాలను కలెక్టర్‌, విచారణ కమిటీకి ఫిర్యాదుదారులు అందజేయడంతోనే ఉచ్చుబిగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని