logo

దేవాదాయశాఖ భూమిపై పాలకుల కన్ను

వైకాపా ప్రభుత్వం ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న దేవాదాయ శాఖ భూమిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీమంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు.

Updated : 09 Feb 2023 05:16 IST

అఖిల పక్ష సమావేశంలో నాయకుల ఆరోపణ

ఐక్యత చాటుతున్న అఖిలపక్ష నాయకులు

భాస్కరపురం(మచిలీపట్నం), న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న దేవాదాయ శాఖ భూమిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీమంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక ఈశ్వర్‌ రెసిడెన్సీలో బుధవారం సాయంత్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రూ.290 కోట్ల విలువ చేసే దేవాదాయశాఖ ఆస్తిని మన కళ్ళ ముందే దోచేసే కుట్ర జరుగుతుందన్నారు. తొలుత 2 ఎకరాలు వైకాపా పార్టీకి అని చెప్పినా మొత్తం 5.45 ఎకరాలపై పాలకులు కన్నేశారని ఆరోపించారు.  1942లో చల్లపల్లి రాజా వారు ఈడేపల్లిలోని జోడుగుళ్ళకు ఆ భూమిని దానం చేశారన్నారు. తాజాగా పాలకులు సర్వేయర్‌పై ఒత్తిడి తెచ్చి పీడబ్ల్యూడీ భూమిగా మార్పు చేశారని, ఈ వ్యవహారమంతా ఎమ్మెల్యే పేర్ని నాని కనుసన్నల్లోనే జరిగిందన్నారు. బందరులో ఆక్రమణల పర్వం కొనసాగుతోందని, చలరస్తాలో సత్రం, సోడా, బీడీ వర్తకసంఘం భవనం, నోబుల్‌ చర్చి పక్కన స్థలం ఆక్రమణకు గురయ్యాయని ఆరోపించారు. కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తే కన్నెత్తి కూడా చూడలేదన్నారు. ఈ ఆక్రమణలపై సోమవారం స్పందనలో కలెక్టర్‌కు ఫిర్యాదు అందజేయాలని నిర్ణయించారు. మచిలీపట్నం జనసేన ఇన్‌ఛార్జి బండి రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కబ్జా చేయడం,  తాకట్టు పెట్టడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామన్నారు. భాజపా నాయకుడు కూనపరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఆక్రమణకు గురవుతున్న భూమిని కాపాడుకునేందుకు తొలుత కాకినాడలోని ఎండోమెంట్స్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాల్సి ఉంటుందని తెలిపారు. ఏఐటీయూసీ నాయకులు లింగం ఫిలిప్‌ మాట్లాడుతూ భూమిని కాపాడటానికి ఎటువంటి ఉద్యమం చేపట్టినా మద్దతు ఇస్తామన్నారు. పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు భూమిని కాపాడేందుకు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్‌ నాయకుడు చంద్రశేఖర్‌ తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం నాయకుడు కె.సత్యనారాయణ, సీపీఐ నాయకుడు గగన్‌, జనసేన నాయకుడు గడ్డం రాజు, కార్పొరేటర్లు నాగరాము, అనిత, బ్రాహ్మణ సంఘ నాయకుడు పి.వి.ఫణికుమార్‌, తెదేపా రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గొర్రెపాటి గోపీచంద్‌,నాయకులు ఎం. బాబాప్రసాద్‌, మురళీకృష్ణ, నాని, సోమశేఖర్‌, నారాయణప్రసాద్‌, ఇలియాస్‌ పాషా, భాజపా నాయకుడు గంటా సతీష్‌, న్యాయవాది లంకె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కొల్లు రవీంద్రకు నోటీస్‌ అందజేత: మాజీమంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేశారు. బుధవారం అఖిలపక్ష సమావేశంలో ఉన్న ఆయనకు చిలకలపూడి ఎస్‌ఐ కిషోర్‌ 41ఎ నోటీస్‌ అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని