logo

మురిసేలోగా.. ముసిరిన చీకట్లు

దాదాపు రెండు సంవత్సరాలుగా బదిలీల కోసం ఆశగా ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగులకు నిరాశే మిగిలింది.

Published : 03 Jun 2023 03:52 IST

బదిలీలపై సచివాలయ ఉద్యోగుల అసంతృప్తి

కలెక్టరేట్‌ (మచిలీపట్నం), న్యూస్‌టుడే: దాదాపు రెండు సంవత్సరాలుగా బదిలీల కోసం ఆశగా ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగులకు నిరాశే మిగిలింది. బదిలీలకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు చెప్పుకోవడానికి మినహా ఆచరణకు అక్కరక్కొచ్చేవి కావన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధరణ బదిలీలకు వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం వాటితో పాటు సచివాలయ ఉద్యోగులకు తొలుత అవకాశం కల్పించకపోయినా.. తదుపరి ఇచ్చిన జీవోలో మార్గదర్శకాల ప్రకారం అసలు బదిలీలకు అవకాశం ఎక్కడుందని వారు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థలో ఉద్యోగాల భర్తీ కోసం 2019 రాత పరీక్ష ద్వారా తొలివిడత ఉద్యోగులను ఎంపిక చేశారు. తర్వాత రెండు విడతల ఎంపిక ద్వారా మిగిలిన ఖాళీలు భర్తీ చేశారు. సచివాలయాల్లో వివిధ కేడర్లలో పనిచేసే ఏ ఒక్కరికి ఐదేళ్ల సర్వీసు పూర్తవకపోవడంతో వీరికి సాధారణ బదిలీలు వర్తించే పరిస్థితి లేదు. తాము బాధ్యతలు చేపట్టాక  నాలుగేళ్లు గడుస్తున్నా తమ బదిలీల గురించి ఎందుకు పట్టించుకోరన్న సచివాలయ ఉద్యోగుల సంఘ డిమాండ్‌తో ప్రభుత్వం వారి బదిలీలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. అందులో ఉన్న మార్గదర్శకాల ప్రకారం నామమాత్రపు బదిలీలు కూడా అయ్యే అవకాశం లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. తొలుత సూచించిన నిబంధనల మేరకు మెడికల్‌ గ్రౌండ్‌, స్పౌజ్‌ కేసులు, ఒంటరి మహిళలు, పరస్పర అంగీకారం ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా పేర్కొన్నారు. దివ్యాంగులకు సంబంధించి ఎటువంటి స్పష్టత లేకపోవడంతో సంఘ నాయకులు ఈ విషయాన్ని సీఎస్‌ దృష్టికి తీసుకువెళ్లడంతో వారితో పాటు ముందు సూచించిన నాలుగు కేటగిరీల అనంతరం ఇతరులకు అవకాశం కల్పిస్తున్నట్టు హామీ ఇచ్చారు.


పరస్పర అంగీకారం ఉంటేనే..

ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన బదిలీలు చేపట్టాల్సి ఉంది. మొత్తం 508 సచివాలయాల పరిధిలో 4,500 మందికి పైగా పనిచేస్తున్నారు. వీరిలో జిల్లా స్థాయిలో 20 శాతం, అంతర్‌ జిల్లాల పరిధిలో 15 శాతం బదిలీలు నిర్వహించాలని స్పష్టం చేశారు. సచివాలయాల్లో ఎక్కడా ఖాళీలు లేకపోవడంతో ఏ స్థాయి బదిలీ అయినా పరస్పర అంగీకారం ఉంటేనే కుదిరే అవకాశం ఉంది. ఎన్నికల ముందస్తుగా వస్తాయన్న ఊహాగానాలతో బదిలీకి అవసరమైన నోడ్యూ సర్టిఫికెట్‌లు ఇచ్చేందుకు సంబంధిత శాఖాధిపతులు సుముఖంగా లేరు. పశ్చిమ కృష్ణాకు చెందిన పలువురు తూర్పు కృష్ణా పరిధిలో వ్యవసాయ అసిస్టెంట్‌లుగా ఉన్నారు. వారు పశ్చిమ కృష్ణాకు వెళ్లాలనుకుంటే అక్కడ ఉద్యాన వన అసిస్టెంట్లు ఉన్నారు. అవసరార్థం పరస్పర అంగీకారంతో రావాలనుకున్నా వీలుపడదు. జిల్లాలో అంతర్‌ జిల్లా బదిలీ కోరుకునే వారు దాదాపు ఎనిమిది శాతానికి పైగా ఉన్నారు. విభజిత జిల్లాలకు వెళ్లానుకునే వారు 40 శాతానికి పైగా ఉన్నారు. తప్పనిసరిగా బదిలీ కావాలని కోరుకునే వారిని వారి ప్రత్యామ్నాయంగా మరొకరు వచ్చేలా మ్యూచువల్‌ బదిలీ పెట్టుకోవాలని సూచిస్తున్నారు.


రాజకీయ పైరవీలే ప్రధానం

జిల్లా వాప్తంగా అధికశాతం సచివాలయాల్లో ఉద్యోగులపై కొందరు అధికార పార్టీ నాయకులు, సర్పంచులే పెత్తనం చలాయిస్తున్నారు. నిబంధనలను అతిక్రమించి వారు చెప్పింది చేయకపోతే వారు సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఎక్కువగా వేధింపులకు గురవుతున్న వారు మరో సచివాలయానికి వెళ్లాలనే ప్రయత్నం చేసుకుంటున్నారు. బదిలీలన్నీ పారదర్శకంగా ఆన్‌లైన్‌లోనే నిర్వహించాల్సి ఉన్నా ఉద్యోగులు తాము కోరుకునే సచివాలయాన్ని ఎంచుకునే అవకాశం లేదు. కేవలం మండలాన్ని మాత్రమే సూచిస్తే అక్కడి ఎంపీడీవో నిర్వహించే కౌన్సెలింగ్‌ ద్వారా సచివాలయాన్ని కేటాయిస్తారు. ఇక్కడే రాజకీయ పైరవీలు ప్రభావం చూపుతాయి. గ్రేడ్‌-5 కార్యదర్శుల విషయానికొస్తే పంచాయతీల్లో గ్రేడ్‌-4 ఖాళీలు ఎన్నో ఉన్నా అర్హతలను బట్టి తమకు అవకాశం కల్పించలేదని, కనీసం డీడీవో అధికారం కల్పించకుండా ఉత్సవ విగ్రహాల్లానే కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే సచివాలయం ఉన్న పంచాయతీకి బదిలీ చేయించుకుంటే అవకాశాన్ని బట్టి డీడీవో అధికారం దక్కవచ్చన్న ఆశతో కొందరు పావులు కదుపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని