logo

Train Accident: తేరుకునేలోగా తునాతునకలు.. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లోని కృష్ణా జిల్లా వాసుల వేదన

‘‘వేగంగా వెళ్తున్న రైలు..ఒక్కసారిగా భారీ కుదుపు.. అంతలోనే పెద్ద శబ్దం.. క్షణాల్లో బోగీలు ఎగిరిపడ్డాయి.. ఏమైందో అర్థం కాలేదు.. తేరుకొని చూసేలోగా... తునాతునకలైన రైళ్లు.. ప్రయాణికుల శరీర భాగాలు.. భయంతో వణికిపోయాం.. ఘటనాస్థలిలో విగతజీవులుగా కొందరు.. తీవ్ర గాయాలై మరికొందరు.. మిన్నంటిన ఆర్తనాదాలు.. బాధితుల హాహాకారాలతో గుండె తరుక్కుపోయిందని’’ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి.. ప్రాణాలతో బయటపడిన ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రయాణికులు  ‘‘ఈనాడు’’తో తమ ఆవేదనను పంచుకున్నారు.

Updated : 04 Jun 2023 07:56 IST

‘‘వేగంగా వెళ్తున్న రైలు..ఒక్కసారిగా భారీ కుదుపు.. అంతలోనే పెద్ద శబ్దం.. క్షణాల్లో బోగీలు ఎగిరిపడ్డాయి.. ఏమైందో అర్థం కాలేదు.. తేరుకొని చూసేలోగా... తునాతునకలైన రైళ్లు.. ప్రయాణికుల శరీర భాగాలు.. భయంతో వణికిపోయాం.. ఘటనాస్థలిలో విగతజీవులుగా కొందరు.. తీవ్ర గాయాలై మరికొందరు.. మిన్నంటిన ఆర్తనాదాలు.. బాధితుల హాహాకారాలతో గుండె తరుక్కుపోయిందని’’ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి.. ప్రాణాలతో బయటపడిన ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రయాణికులు  ‘‘ఈనాడు’’తో తమ ఆవేదనను పంచుకున్నారు. శనివారం రాత్రి విజయవాడ చేరిన మృత్యుంజయులు.. ఆప్తులను చూసి ఉద్వేగంతో బోరున విలపించారు.

తండ్రి బిశ్వాస్‌ను చూసి బోరున విలపించిన చిన్న కుమార్తె

ఎదురుచూపులు ఫలించాయి: న్యూటన్‌ బిశ్వాస్‌, పెడన

నేను పెడనలో ఆర్‌ఎంపీ వైద్యుడిని. నా ఇద్దరు కుమార్తెలు, భార్య రైలులో ఉన్నారు. ఒక్కసారిగా బోగీలు ఎగిరిపడడంతో కుమార్తెలు ఇద్దరూ భయంతో వణికిపోయారని నా భార్య ఫోన్‌లో చెప్పడంతోనే తీవ్ర ఆందోళనకు గురయ్యా. నేను వెళదామంటే ఇక్కడి నుంచి ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. ఉదయం ప్రత్యేక రైలు వేశారని తెలియగానే విజయవాడ బయలుదేరి వచ్చేశా. నా ఎదురుచూపులు ఫలించి నా భార్యా పిల్లలు నా దగ్గరికి చేరారు.

కుదుపులకు మా అబ్బాయి.. పై బెర్తు నుంచి కింద పడ్డాడు

తనయ, పరిశోధన విద్యార్థి, ఖరగ్‌పూర్‌, పశ్చిమ బెంగాల్‌

నేను విజయవాడలో స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌లో పీహెచ్‌డీ ద్వితీయ ఏడాది చదువుతున్నా. విజయవాడలోనే ఉంటున్నా. నాతోపాటు పాప, బాబు, అత్త, మామయ్యలు కోరమాండల్‌ ఎక్కాం. శుక్రవారం రాత్రి రైలు కుదుపులకు గురైంది. మా అబ్బాయి పై బెర్తు మీద కూర్చుని ఉన్నాడు. ఒక్కసారిగా కింద పడ్డాడు. కాళ్లకు గాయాలయ్యాయి. బోగీలు చెల్లాచెదురయ్యాయి. మా బోగీలోనే లైట్లు ఉన్నాయి. మిగతా వాటిల్లో లేవు. తర్వాత కారులో భువనేశ్వర్‌ వచ్చి విజయవాడ బయలుదేరాం.

ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాం..

మురాల రఘు, వీరంకి లాకు, పమిడిముక్కల మండలం

నేను పశ్చిమ బెంగాల్‌లో ఉద్యోగం చేస్తున్నా. భార్య బిందుశ్రీతో కలిసి విజయవాడ వస్తున్నా. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బీ4 బోగీలో ప్రయాణిస్తున్నాం. ఒక్కసారిగా పెద్దగా శబ్దాలు రాగా ఆందోళనకు గురయ్యాం. మేము ప్రయాణిస్తున్న బోగీ పట్టాలు దాటి పక్కకు ఒరిగింది. మా పక్క బోగీలు పల్టీకొట్టాయి.  పక్కనున్న బోగీల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఆ దృశ్యం చూస్తే గుండె తరుక్కుపోయింది.

సురక్షితంగా బయటపడ్డా..

మాది ఒడిశాలో బరంపురం. భద్రాచలం సమీపంలోని చర్ల వద్ద ఓ సంస్థలో ఉద్యోగం చేస్తున్నా. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడకు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. నా ఎడమ చేతికి గాయాలయ్యాయి.  ప్రథమ చికిత్స చేయించుకున్నా. తరచూ ప్రయాణం చేస్తుంటా. ప్రమాదం జరగ్గానే కొద్ది సేపు ఏమి చేయాలో అర్థం కాలేదు. కొంత మంది ప్రయాణికులు, స్థానికులు కూడా వారి వంతు సహకారాన్ని అందించంతో సురక్షితంగా బయటపడ్డా.

రామారావు, బరంపురం, ఒడిశా

ఒక్కసారిగా అంతా మారిపోయింది..

అందరం సరదాగా కూర్చుని మాట్లాడుకుంటున్నాం. ఒక్కసారిగా భారీ శబ్దం, రైలు పెట్టెలు ఎగిరిపడడంతో పరిస్థితి అంతా క్షణాల్లో మారిపోయింది. చుట్టూ ఎటుచూసినా చీకటి, బోగీలు పట్టాలు తప్పి.. ట్రాక్‌ మీద నుంచి పక్కకు వచ్చేయడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నాం. నా భార్య, కుమారుడు కూడా ఉండడం, ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నాం. అరుపులు, కేకలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారిపోయింది. పక్కకు వెళ్లి చూస్తే.. తెగిపడిన చేతులు, కాళ్లు.. ప్రాణాలు కాపాడమనే బాధితుల ఆర్తనాదాలు. ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. స్థానికులే పెద్ద సంఖ్యలో వచ్చి.. సహాయం చేశారు.

సుశాంత్‌కుమార్‌దాస్‌, మందిరాదాస్‌, మహుల్‌ దాస్‌, కండ్రిక

పిల్లలిద్దరినీ గట్టిగా పట్టుకున్నా..

సయ్యద్‌ హబీబునీ, గుంటూరు

నా భర్త సయ్యద్‌ మదర్‌వలి.. పశ్చిమ బెంగాల్‌లో సిగ్నల్‌ రెజిమెంట్‌లో నాయక్‌గా పని చేస్తున్నారు. నెల రోజులు ఆయనకు శిక్షణ ఉండడంతో ఇద్దరు పిల్లలతో కలిసి నేను గుంటూరు బయలుదేరా. నా భర్త సహోద్యోగి మణిబాబు కుటుంబం విశాఖ వరకు వస్తుండడంతో వారితో కలిసి కోరమాండల్‌ ఎక్కాం.  పెద్ద శబ్దంతో ప్రమాదం జరగ్గా.. ప్రయాణికులు పెద్దగా కేకలు వేశారు. భయమేసి.. నిద్రపోతున్న పిల్లల్ని గట్టిగా పట్టుకున్నా. మా బోగీలో ఉన్న కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని