logo

కట్టేసుకోండి..కళ్లప్పగిస్తాం!

గన్నవరం మండలం కేసరపల్లి పంచాయతీ పరిధి దుర్గాపురం కాలనీలో అక్రమణలకు అడ్డులేకుండాపోతోంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి అభిముఖంగా రూ.కోట్ల విలువ చేసే పోరంబోకు భూములే లక్ష్యంగా కబ్జాదారులు తెగబడుతున్నారు.

Updated : 18 Jul 2023 05:46 IST

దుర్గాపురంలో యథేచ్ఛగా కబ్జాకాండ
30 ఎకరాలను కమ్మేసినా కదలని అధికారులు

40 అడుగుల రోడ్డు ఆక్రమించి వేస్తున్న పాకలు ఇవే...

‘ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే శిక్షార్హులంటూ’ తెదేపా గన్నవరం మండలాధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావుకు వారసత్వంగా 50 ఏళ్ల నుంచి వచ్చిన భూమిలో నిర్మించిన దుకాణ సముదాయాన్ని.. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం తిప్పనగుంటలో మాదల శ్రీనివాసరావుకు చెందిన ఎరువుల గోదాం, షెడ్‌ను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు.. విమానాశ్రయం అభిముఖంగా దుర్గాపురంలో రూ.కోట్ల విలువైన భూముల ఆక్రమణపై చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలి. కబ్జాదారులకు ఎందుకు వత్తాసు పలుకుతున్నారు? దీనిపై కింది స్థాయి కోర్టును ఆశ్రయించినా న్యాయం జరగలేదు. త్వరలో హైకోర్టులో పిటిషన్‌ వేయనున్నాం.’

కొడాలి ఏకాంబరరావు, దుర్గాపురం పట్టాదారుల సంఘ నాయకుడు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే : గన్నవరం మండలం కేసరపల్లి పంచాయతీ పరిధి దుర్గాపురం కాలనీలో అక్రమణలకు అడ్డులేకుండాపోతోంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి అభిముఖంగా రూ.కోట్ల విలువ చేసే పోరంబోకు భూములే లక్ష్యంగా కబ్జాదారులు తెగబడుతున్నారు. ప్రభుత్వం తమకు పట్టాలిచ్చిందంటూ ఒక్కొక్కరుగా చేరడంపై పట్టాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందినకాడికి స్థలాలను ఆక్రమించి బహుళ అంతస్తులు నిర్మిస్తున్నా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని స్థానిక రైతులు వాపోతున్నారు. కనీసం తమ పొలాలు, స్థలాల్లోకి వెళ్లేందుకు వీలులేకుండా రోడ్లను సైతం కబ్జా చేస్తున్నా రెవెన్యూ యంత్రాంగం చూసిచూడనట్లు వ్యవహరించడం ఏమిటని నిలదీస్తున్నారు. ఇప్పటికే అక్రమణలపై వందలసార్లు రెవెన్యూ, పంచాయతీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని పట్టాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో ఇళ్లు వేస్తున్నారని ఫిర్యాదు ఇస్తే.. చర్యలు తీసుకోవడం మానేసి రెవెన్యూ అధికారులు స్థల ధ్రువపత్రాలివ్వడం.. పంచాయతీ వారు పన్ను వేయడం.. విద్యుత్తుశాఖ అధికారులు మీటర్లు అందివ్వడం వల్లనే ఈ రోజు సుమారు 30 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని రైతులు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్కరు రెండు నుంచి మూడు ఇళ్లు ఉన్నప్పటికీ పరిసరాల్లో మిగిలిన రహదారుల్లో సైతం పాకలు వేయడం కాలనీలో అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏనుగు కాలువ మాయం

ప్రస్తుతం ఉన్న హెచ్‌సీఎల్‌కు ఆనుకొని గతంలో కేసరపల్లి సర్వే నంబర్‌ 20లో సుమారు 30 ఎకరాల పెద్దచెరువు ఉండేది. ఆ చెరువులో నీటిని సర్వే నంబరు 31లో ఏనుగు కాలువ ద్వారా రైతులకు నీరందించేవారు. కాలక్రమేణా చెరువు, కాలువ వినియోగం తగ్గిపోవడంతో నెమ్మదిగా ఆక్రమణలు మొదలయ్యాయి. తొలుత ఓ వ్యక్తి సుమారు 5 సెంట్ల స్థలాన్ని ఆక్రమించి ఇళ్లు నిర్మాణం చేపట్టాడు. అనంతరం మరికొందరు ఆక్రమణలకు క్యూ కట్టారు. ఇష్టం వచ్చినట్టు రోడ్లను ఆక్రమించి ఇళ్లు నిర్మించారు. 40 అడుగుల రహదారి ఉండాల్సిన కాలనీలో ప్రస్తుతం నడిచేందుకు తప్ప ఎటువంటి భారీ వాహనం వెళ్లేందుకు కూడా వీలులేని పరిస్థితి నెలకొంది.

ఆందోళనలో పట్టాదారులు..

తమ స్థలాలకు దారులు లేకుండా కొందరు ప్రైవేట్‌ వ్యక్తులు, కొంతమంది ఉద్యోగులు ఆక్రమణలకు పాల్పడుతున్నారంటూ దుర్గాపురం పట్టాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన పొలంలోకి వెళ్లే దారిని కబ్జాకు పాల్పడ్డారంటూ కొడాలి ఏకాంబరరావు అనే రైతు రెవెన్యూ అధికారులు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఎవరూ పట్టించుకోక పోవడంతో కోర్టును ఆశ్రయించారు. ఆక్రమణలు తొలగించి దారివ్వాలని కోర్టు ఆదేశించినప్పటికీ రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ వృద్ధాశ్రమం ఎదురుగా ఉన్న 40 అడుగుల రహదారిని ఓ ఉద్యోగి ఆక్రమించి ఇళ్లు నిర్మించేందుకు యత్నించగా అడ్డుకొని అధికారులకు ఫిర్యాదులు చేస్తే కనీసం ఆక్రమణను తొలగించలేదని నిర్వాహకురాలు స్వర్ణకుమారి వాపోయారు. రెవెన్యూ, పంచాయతీ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించడం వల్లనే ఆక్రమణలు ఎక్కవై పట్టాదారులం తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ స్పందించి ఆక్రమణలపై విచారణ చేపట్టి చర్యలతో పట్టాదారులకు న్యాయం చేయాలని పట్టాదారులు కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని