logo

టోల్‌ బాదుడు

జాతీయ రహదారి - 216పైకి రావాలంటేనే కార్ల యజమానులు, ట్యాక్సీ డ్రైవర్లు, ఆర్టీసీ ప్రయాణికులు హడలిపోతున్నారు. టోల్‌ ప్లాజాలు వాహనదారుల తోలు తీస్తున్నాయి.

Published : 09 Aug 2023 06:18 IST

కిలోమీటరు పరిధిలో రెండు చోట్ల వసూళ్లు
హడలిపోతున్న వాహనదారులు, ప్రయాణికులు
న్యూస్‌టుడే, అవనిగడ్డ గ్రామీణం, మోపిదేవి

జాతీయ రహదారి - 216పై మోపిదేవి గురుకులం వద్ద కొత్తగా ప్రారంభించిన టోల్‌ప్లాజా

జాతీయ రహదారి - 216పైకి రావాలంటేనే కార్ల యజమానులు, ట్యాక్సీ డ్రైవర్లు, ఆర్టీసీ ప్రయాణికులు హడలిపోతున్నారు. టోల్‌ ప్లాజాలు వాహనదారుల తోలు తీస్తున్నాయి. ఒక కిలోమీటరు పరిధిలో రెండు టోల్‌ప్లాజాలు వాహనదారుల ముక్కుపిండి పన్ను వసూలు చేస్తుండడమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా మోపిదేవి వార్పు గురుకులం వద్ద ఏర్పాటు చేసిన టోల్‌ప్లాజా ఈ నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చింది.

  • పులిగడ్డ - పెనుమూడి వారధి సమీపంలో అవనిగడ్డ మండలం పులిగడ్డలో గతంలోనే టోల్‌ప్లాజా ఉంది. అక్కడి నుంచి ఒక కిలోమీటరు పరిధిలోనే రెండోది ఏర్పాటు చేయడంతో తమ జేబులకు చిల్లులు పడుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు.
  • జాతీయ రహదారి విస్తరణ పనులు అసంపూర్తిగా ఉండగానే టోల్‌ వసూలు ప్రాంభించారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పులిగడ్డలోని హైలెవెల్‌ వారధికి రెండు వైపులా ఉన్న రహదారి నరకప్రాయంగా మారింది. పులిగడ్డ- పెనుమూడి వారధి టోల్‌ప్లాజా రహదారి దానికి తీసికట్టుగా ఉండడంతో టైర్లు పగిలిపోతున్నాయని.. అయినా టోల్‌ కట్టించుకుంటున్నారని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు.
  • 60 కిలోమీటర్ల పరిధిలో టోల్‌ప్లాజా ఏర్పాటు నిబంధన ఉన్నా జాతీయ రహదారుల అధికారులు అందుకు భిన్నంగా కిలోమీటరు లోపే రెండు టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేయడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  

పులిగడ్డ- పెనుమూడి వారిధి వద్ద రోడ్డు దుస్థితి ఇలా..


ఆర్టీసీ కూడా బాదుతోంది

మోపిదేవివార్పు వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన టోల్‌ప్లాజా అమలులోకి రావడంతో అవనిగడ్డ ఆర్టీసీ డిపో కూడా టోల్‌ఛార్జీ పేరుతో ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.10 అదనంగా ఛార్జీ వసూలు చేస్తోంది. మచిలీపట్నం, గుడివాడ రూట్‌లో ప్రయాణికుల ఛార్జీపై అదనంగా రూ.10 వసూలు చేస్తుండగా.. కరకట్ట, పామర్రు మీదుగా విజయవాడకైతే రూ.5 టోల్‌ ఛార్జిగా ఉందని ఆర్టీసీ అధికారులు వెల్లడిస్తున్నారు.


అధిక పన్నులు వసూలు

మోపిదేవి వార్పు వద్ద ఏర్పాటు చేసిన టోల్‌ప్లాజా వద్ద వాహనదారుల నుంచి అధిక పన్నులు వసూలు చేస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. వ్యాను, కారు, జీపు, తేలికపాటి మోటారు వాహనం ఒకసారి వెళ్లడానికి పులిగడ్డ టోల్‌ప్లాజా వద్ద రూ.25 వసూలు చేస్తుండగా కొత్త టోల్‌ప్లాజా వద్ద రూ.35 కట్టించుకుంటున్నారు. ఒక వాహనం ఒకరోజు వ్యవధిలో వెళ్లి వచ్చేందుకు పులిగడ్డ టోల్‌ప్లాజా వద్ద రూ. 37 తీసుకుంటుండగా మోపిదేవి వార్పు వద్ద రూ.55 వసూలు చేస్తున్నారు. వాహనాలను బట్టి రెండు టోల్‌ప్లాజాల వద్ద రెండు రకాల పన్నులు వసూలు చేయడం పట్ల వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.


వసూళ్లు ఎక్కువగా ఉన్నాయి
- కె.ప్రసాద్‌, కారు డ్రైవర్‌, అవనిగడ్డ

మోపిదేవి వార్పు వద్ద ఏర్పాటు చేసిన టోల్‌ప్లాజాతో పన్నులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాం. అసలే డీజిల్‌, పెట్రోల్‌ రేట్లు అధికంగా ఉన్నాయి. కిరాయిలు కిట్టడంలేదు. దానికి తోడు టోల్‌ పన్నులు వెంటాడుతున్నాయి. సంపాదన పెట్రోలు, కారు మరమ్మతులు, పన్నులు కట్టడానికే సరిపోతే కుటుంబాలను ఎలా పోషించుకోవాలి? ఎలా బతకాలి?


టైర్లు పగిలిపోతున్నాయి
- ఎం.దుర్గారావు, కారు డ్రైవర్‌, అవనిగడ్డ

రహదారులపై గల గుంతల్లో పడి టైర్లు పగిలిపోతున్నాయి. పెరిగిన పెట్రోలు, డీజిల్‌ ధరలతోపాటు టోల్‌ప్లాజా పన్నులతో ఎలా జీవనం చేయాలో తెలియడం లేదు. వాహనాలు తరచూ మరమ్మతులు చేయించాల్సి వస్తోంది. పన్నుల వసూలులో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు