logo

కొట్టేదీ... కేసు కట్టేదీ.. వారే!

ఆమె దళిత మహిళ.. మాజీ శాసన సభ్యురాలు.. ఆమె ప్రసంగాలు మర్యాద, గౌరవవాచకాలతో.. సాధారణంగా ఉంటాయి. కానీ ఆమె దుష్ప్రవర్తన కలిగి ఉన్నారనీ, దూషించారనీ, రెచ్చగొట్టే ప్రసంగాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చేశారనీ, పోలీసు విధులకు ఆటంకం కలిగించారని వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు.

Updated : 13 Sep 2023 09:53 IST

తెదేపా శ్రేణులపై ఇష్టారీతిన కేసులు
ఖాకీ చాటున వైకాపా అరాచకీయం
ఈనాడు, అమరావతి

ఆమె దళిత మహిళ.. మాజీ శాసన సభ్యురాలు.. ఆమె ప్రసంగాలు మర్యాద, గౌరవవాచకాలతో.. సాధారణంగా ఉంటాయి. కానీ ఆమె దుష్ప్రవర్తన కలిగి ఉన్నారనీ, దూషించారనీ, రెచ్చగొట్టే ప్రసంగాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చేశారనీ, పోలీసు విధులకు ఆటంకం కలిగించారని వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఆమే... నందిగామ మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య. ఐపీసీ 504 (శాంతిభద్రతలకు విఘాతం), 505 (దూషించడం, దుష్ప్రవర్తన కలిగి ఉండటం), 353 ప్రభుత్వ ఉద్యోగిపై దాడి వంటి నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టారు. ఆమెపైనే కాదు.. ఇవే సెక్షన్లు మరో 30 మందిపై పెట్టారు. ఇంకా కొందరిని చేర్చే ఉద్దేశంలో ఉన్నారు.

ఇదే ఠాణా పరిధిలో ఇసుక మాఫియా తమపై దాడి చేసిందని సెబ్‌ అధికారులు ఫిర్యాదు చేస్తే.. బెయిలబుల్‌ కేసులు పెట్టారు. కానీ నేటికీ చర్యల్లేవ్‌. కారణం.. వారు వైకాపా నాయకులు. వత్సవాయి ఠాణాలో మూడు ఇసుక లారీలు పట్టుకుని తెదేపా వారు  అప్పగిస్తే.. న్యాయసలహా పేరిట కేసు పెట్టకనే దాటవేశారు. కారణం.. వైకాపా నాయకులు. -- ఇవీ కంచికచర్ల ఠాణాలో నమోదైన కేసులు.

అధికార పార్టీకి ఓ లెక్క.. ప్రతిపక్షానికి మరోలెక్క.. అధికార పార్టీ నేతలు ఎందరిని బెదిరించినా.. దాడులు చేసినా కేసులుండవు. కానీ ప్రతిపక్ష నేతలు అడిగితేనే బెదిరించినట్లు, హత్యాయత్నం చేసినట్లు.. పోలీసు కేసులతో తెదేపా శ్రేణులను వైకాపా నాయకులు హడలెత్తిస్తున్నారు. ప్రజాస్వామ్యయుత నిరసనలపైనా ఉక్కుపాదం మోపి.. ఇష్టానుసారం కేసులు పెడుతున్నారు. అదే వైకాపా నాయకులు అక్రమాలకు పాల్పడినా.. అరాచకంతో బరి తెగించినా ఖాకీలకు కనిపించదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇలాంటి ఉదంతాలు ఎన్నో. ఇసుక దందా నుంచి బూడిద రవాణా వరకు అంతే. ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. పోలీసు యంత్రాంగం ఇంతలా పక్షపాతం చూపడంపై తెదేపా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

లోపల వేయండి.. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి గడప గడపకు మన ప్రభుత్వం పేరిట తిరుగుతుండగా ఓ యువకుడు ఉద్యోగాలు, అవినీతిపై ప్రశ్నించాడు. అంతే అతడిని అరెస్టు చేయాలని అక్కడ పోలీసులను ఆదేశించారు. ఆ వ్యాఖ్యలు చాలా దురుసుగా.. అసభ్యంగా పోలీసులు తన బానిసలు అన్నట్లు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అంతే జీ హుజూరు అని పోలీసులు అడిని ఈడ్చేశారు. ఇదేం పద్ధతని అందరూ ఆశ్చర్యపోయారు.

  • మంత్రి జోగి రమేష్‌ అనుచరులమని కొందరు యువకులు గుంటూరు జిల్లా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ప్రయాణీకుల బస్సులకు అడ్డం తిరిగి వారి బంధువుల ముందే దూషించారు. వీరు ఎమ్మెల్యే స్టిక్కర్లున్న కార్లలో వచ్చారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయినా.. పోలీసులు మాత్రం మంత్రి చెప్పారని కేసు కట్టలేదు.
  • పెడన పాఠశాలలో విద్యార్థులు తరగతులు బహిష్కరిస్తే.. తెదేపా నాయకులపై ట్రెస్‌పాస్‌ (అక్రమ ప్రవేశం) పేరుతో ఆరుగురిపై కేసులు పెట్టారు. కారణం.. మంత్రి జోగి రమేష్‌ ప్రోద్బలంతో ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే జోగి రమేష్‌... మాజీ సీఎం ఇంటిపై దాడి చేయడానికి ఆయుధాలతో వెళితే కేసులే లేవు. కలిసేందుకు వెళ్లారని కొత్త భాష్యం చెప్పారు. వైకాపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాఠశాలలలో అక్రమంగా ప్రవేశించి విద్యార్థులు తరగతుల నుంచి బయటకు తెచ్చిన సందర్భాలు కోకొల్లలు.

రాజకీయ కేసులు ఎన్నో..!

చంద్రబాబు అరెస్టు సందర్భంగా చేసిన నిరసనలకు అందరిపైనా కేసులు నమోదు చేశారు. అక్రమ ప్రవేశం, బెదిరింపులు, దూషణల కింద నాన్‌బెయిల్‌బుల్‌ కేసులు, పోలీసు ఆంక్షల ఉల్లంఘన పేరిట బెయిల్‌బుల్‌ కేసులకు లెక్కే లేదు. ఇప్పటికే పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రను ఓ హత్య కేసుతో సంబంధం ఉందనీ, మాజీ మంత్రి దేవినేని ఉమాను కొండపల్లి తవ్వకాల ఆందోళనలో అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఇలా కేసులు పెడతామని.. నాయకులను హెచ్చరిస్తున్నారు.

  • గుడివాడలో వెనిగండ్ల రాము, మరో 30 మందిపై పోలీసు యాక్ట్‌ ఉల్లంఘించారని కేసులు పెట్టారు. నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేసి సమాచారం ఇవ్వకుండా వదిలేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత రాజకీయ కారణాలతో తెరమీదకు తెస్తున్నారు. రావి వెంకటేశ్వరరావు, మరికొందరు టిడ్కో ఇళ్లను పరిశీలిస్తే.. కేసులెట్టారు. ఓ మాజీ ఎమ్మెల్యేగా ప్రజాసమస్యలపై స్పందించే పరిస్థితి లేదని ఆయన వాపోతున్నారు.
  • మైలవరంలో తెలుగు యువత నాయకులపై కేసులు పెట్టారు. మాట్లాడితే కేసులే పెడుతున్నారు.ఔ
  • విజయవాడలో బంద్‌ సందర్భంగా టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టిముక్కల రఘరామకృష్ణంరాజు పై ప్రభుత్వ ఉద్యోగుల ఆదేశాలు ధిక్కరించారని సెక్షన్‌ 188 కింద కేసు నమోదు చేశారు. ప్రజామార్గంలో అవరోధం కింద 283, న్యూసెన్సు కింద 290 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
  • కృష్ణలంకలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మరో 20 మందిపై సెక్షన్‌ 151 కింద కేసు నమోదు చేశారు. గద్దె అనురాధ, గొట్టిముక్కల, బాలస్వామి, పరుచూరి ప్రసాద్‌ తదితరులపై సెక్షన్‌ 151 కేసులు పెట్టారు. వన్‌ టౌన్‌లో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరో 20 మందిపై సోమవారం కేసులు పెట్టారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని