logo

కట్నం తేవాలంటూ భార్యకు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ విచిత్ర వేధింపులు

అదనపు కట్నం తేవాలని, ఆస్తులను తన పేరుపై బదిలీ చేయాలని భార్యను వేధిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు, అందుకు వత్తాసు పలుకుతున్న అత్తింటి బంధువులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 30 Oct 2023 08:18 IST

పెనమలూరు, న్యూస్‌టుడే: అదనపు కట్నం తేవాలని, ఆస్తులను తన పేరుపై బదిలీ చేయాలని భార్యను వేధిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు, అందుకు వత్తాసు పలుకుతున్న అత్తింటి బంధువులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం.. తాడిగడపకు చెందిన షేక్‌ ఖాదర్‌బీ, యనమలకుదురుకు చెందిన అబ్దుల్‌ కరీముల్లాలకు 2016లో వివాహం జరిగింది. వీరిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు కాగా.. హైదరాబాద్‌ మదీనాగూడలో కాపురం పెట్టారు. అప్పటి నుంచి భర్త అనుమానంతో భార్యను వేధించడం, మద్యం తాగి వచ్చి కొట్టడం చేసేవాడు. అర్ధరాత్రి వరకు సెల్‌ఫోన్‌లో క్రైం సినిమాలు చూడటం, భార్యను నిద్రలేపి నిత్యం సహ ఉద్యోగులతో ఎలా మాట్లాడేది, విధులు ఎలా నిర్వహించేది చూపించాలంటూ విసిగించడం చేసేవాడు. ల్యాప్‌టాప్‌ తెరచి సంభాషణలను చూపమంటూ వేధించేవాడు. భార్య జీతం రూ.80 వేలు తీసుకొని ఖర్చులకు మాత్రం రూ.వెయ్యి చేతిలో పెట్టేవాడు. ఇతను పెట్టే వేధింపులతో ఈమెకు అబార్షన్‌ అయింది. ఈ మధ్య గృహరుణం కూడా కట్టాలంటూ ఆమెను సాధిస్తుండగా.. అత్తమామలు, ఆడపడుచు భర్తకు వంతపాడటం చేస్తున్నారు. తాము చెప్పినట్టు వింటేనే కాపురమని లేనిపక్షంలో పుట్టింటికి వెళ్లిపోవాలంటూ ఈ నెల 7వ తేదీన పంపేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భర్త కరీముల్లా, అత్తమామలు మున్నీర్‌, ఖర్షీద్‌బీబీ, ఆడపడుచు అయేషాబేగంలపై పెనమలూరు పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని