logo

Andhra news: అనుమానం పెనుభూతమై.. భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య

చక్కని కాపురంలో ఏడాది క్రితం  అనుమానపు భూతం ప్రవేశించింది. చివరికి అది తీవ్రరూపం దాల్చి ఓ చిన్నారిని అనాథను చేసింది. భార్యపై అనుమానంతో భర్త ఆమెను 12 సార్లు కత్తితో పొడిచి చంపిన తర్వాత అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గుడివాడలో ఆదివారం సంచలనం కలిగించింది.

Updated : 25 Dec 2023 10:33 IST

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: చక్కని కాపురంలో ఏడాది క్రితం  అనుమానపు భూతం ప్రవేశించింది. చివరికి అది తీవ్రరూపం దాల్చి ఓ చిన్నారిని అనాథను చేసింది. భార్యపై అనుమానంతో భర్త ఆమెను 12 సార్లు కత్తితో పొడిచి చంపిన తర్వాత అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గుడివాడలో (Gudivada) ఆదివారం సంచలనం కలిగించింది. పట్టణం ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన విష్ణుమూర్తుల వెంకన్న రెండో కుమార్తె రామలక్ష్మికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని అప్పన్నపేటకు చెందిన తాతపూడి సూర్యనారాయణతో 2017 మే 24న వివాహమైంది. వారికి నాలుగేళ్ల హేమాన్ష్‌ కుమార్‌ అనే బాబు ఉన్నాడు. గత ఏడాది నుంచి సూర్యనారాయణ(30) భార్యను అనుమానిస్తుండడంతో ప్రశాంతంగా సాగుతున్న వారి కాపురంలో చిచ్చు రేగింది. తరచూ భార్యను కొడుతుండడంతో ఆమె పుట్టింటికి రావడం, వారు పెద్దలతో సర్దిచెప్పి మళ్లీ కాపురానికి పంపిస్తున్నారు.

అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. వేధింపులు తాళలేని రామలక్ష్మి(26) ఈ ఏడాది ఆగస్టులో ఏలూరు జిల్లా గణపవరం పోలీసు స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసి పుట్టింటికి వచ్చేసింది. సూర్యనారాయణ వస్తే మాట్లాడి పంపుదామని రామలక్ష్మి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. రామలక్ష్మి కుటుంబ సభ్యులు ఆదివారం పనులకు వెళ్లగా ఇంటి వద్ద ఎవరూ లేరని తెలుసుకొని భర్త సూర్యనారాయణ వచ్చాడు. ఆమె తండ్రి వెంకన్న మరుగుదొడ్డిలో ఉండగా సూర్యనారాయణ పదునైన కత్తితో రామలక్ష్మిపై దాడి చేసి విచక్షణారహితంగా 12 సార్లు పొడిచాడు. ఆమె ఆర్థనాదాలకు తండ్రి వెంకన్న వచ్చి తన కూతుర్ని చంపకంటూ కేకలు వేశాడు. దీంతో అతనిపై కూడా కత్తితో దాడి చేశాడు.

అప్పటికే రామలక్ష్మి చంక కింద భాగంలో పొడవడం వల్ల ఆమె కుప్ప కూలిపోయింది. వెంటనే స్థానికుల 108 సాయంతో ఇద్దర్నీ గుడివాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో సూర్యనారాయణ కలుపు నివారణ మందు తాగేశాడు. అతడ్ని కూడా స్థానికులు 108 ఆంబులెన్స్‌ ద్వారా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతిచెందాడు. గుడివాడ డీఎస్పీ పి.శ్రీకాంత్‌, వన్‌టౌన్‌ సీఐ కె.ఇంద్రశ్రీనివాస్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రి వద్ద రామలక్ష్మి సోదరి పాండ్రంకి నాగదుర్గ, బంధువుల రోదనలు చూపరుల్ని కలచి వేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని