logo

కాసులిస్తేనే.. క్రమబద్ధీకరణ..!

రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ఆలయమైన దుర్గగుడిలో.. ఎన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారనే లెక్కన ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ జరగడం లేదు. ఎంత లాబీయింగ్‌ చేయగలరు.. ఎంత ముట్టజెబుతారనే ప్రాతిపదికనే.. క్రమబద్ధీకరిస్తున్నారు.

Updated : 05 Mar 2024 05:43 IST

కమిషనర్‌కు నివేదిక ఇవ్వకుండా ఆపేశారు
ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగులపై కక్ష సాధింపు
దుర్గగుడిలో మారని అధికారుల తీరు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ఆలయమైన దుర్గగుడిలో.. ఎన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారనే లెక్కన ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ జరగడం లేదు. ఎంత లాబీయింగ్‌ చేయగలరు.. ఎంత ముట్టజెబుతారనే ప్రాతిపదికనే.. క్రమబద్ధీకరిస్తున్నారు. ఆలయంలో రెండున్నర దశాబ్దాలకుపైగా.. నామమాత్ర జీతాలతో 60 మందికి పైగా ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఆలయంలో ఏ పెద్ద పండగ నిర్వహణ సజావుగా సాగాలన్నా.. వీరే కీలకం. కానీ.. కొలువుల క్రమబద్ధీకరణ విషయంలో మాత్రం.. వీరే చివరిలో ఉంటారు. వీరిలోనూ ఎవరైతే.. ఉన్నతాధికారులకు డబ్బులు చెల్లించుకుంటారో, అధికార పార్టీ నేతల సిఫార్సులతో వస్తారో.. వాళ్లను మాత్రమే క్రమబద్ధీకరిస్తున్నారు. వీళ్ల కంటే చాలా ఏళ్ల తర్వాత కొలువుల్లో చేరిన వాళ్లను కూడా రెగ్యులర్‌ చేస్తున్నారు. తమకు నచ్చిన, అడిగినంత ఇచ్చిన వాళ్లను రెగ్యులర్‌ చేశారు. తాజాగా మరోసారి ఇలాగే చేసేందుకు పావులు కదుపుతున్నారు. దుర్గగుడిలో కేవలం 10 మంది పరిచారకులే ఎన్‌ఎంఆర్‌ సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నారనీ, వీళ్లను క్రమబద్ధీకరించాలని ఈవో నుంచి నివేదిక వెళ్లడం, కమిషనర్‌ ఆమోదించినట్లు తెలుస్తోంది.

ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించమని ప్రభుత్వం గత ఏడాది నవంబరులో జీవో జారీ చేయడంతో.. దుర్గగుడిలో వారంతా దేవాదాయశాఖ కమిషనర్‌, ఈవోకు దరఖాస్తులు పెట్టుకున్నారు. కమిషనర్‌ కూడా వెంటనే స్పందించి.. పూర్తి వివరాలతో నివేదిక పంపమని ఈవోను ఆదేశించారు. కానీ.. ఇప్పటివరకూ ఈవో కార్యాలయం దీనిపై స్పందించలేదు. కానీ.. ఈ ఏడాది జనవరి 17న ఆలయంలో ఎన్‌ఎంఆర్‌లుగా పనిచేస్తున్న 10 మంది పరిచారకులు వచ్చి ఈవో, కమిషనర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈవో వెంటనే స్పందించి వీరిని రెగ్యులర్‌ చేయాలని నివేదిక పంపేశారు. తమ కంటే ఎన్నో ఏళ్ల తర్వాత ఉద్యోగంలో చేరిన వీళ్లను క్రమబద్ధీకరించేందుకు ఈవో ఇంత ఉత్సాహంగా నివేదిక ఇచ్చేయడం, తమపై మాత్రం ఇలా కక్ష సాధించడం సరికాదని.. ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు అందరిలా లాబీయింగ్‌ చేతకాక పోవడం, అధికార పార్టీ నేతలతో సిఫార్సులు చేయించుకోకపోవడం వల్లే.. తమను ఇలా వేధిస్తున్నారా అని వాపోతున్నారు. వారి కంటే ముందు.. తమ వివరాలను కమిషనర్‌ పంపమంటే.. ఇంతవరకూ ఎందుకు పంపలేదని ప్రశ్నిస్తున్నారు. దుర్గగుడిలో ప్రతి పనికి ధర నిర్ణయించి.. వసూలు చేసే కొందరు అవినీతి అధికారులే తమకు అడ్డుపడుతున్నారని, గతంలోనూ ఇలా చాలాసార్లు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


జీవనం.. దయనీయం..

దుర్గగుడిలో దశాబ్దాలుగా పనిచేస్తున్న ఎన్‌ఎంఆర్‌ సిబ్బంది పరిస్థితి అత్యంత దయనీయం. పేరుకే ఉద్యోగం తప్ప.. వారికి వచ్చే జీతం కూడా కొంతకాలం కిందటి వరకూ రూ.15 వేలకు అటూఇటుగానే ఉండేది. ప్రస్తుతం కొద్దిగా పెరిగి.. కొందరికి రూ.18 వేలుంటే, మరికొందరికి ఓ ఐదారువేలు ఎక్కువ ఉంటుంది. ఈ జీతాలతో విజయవాడలో బతకలేక అప్పులపాలవుతున్నారు. ఎప్పటికైనా రెగ్యులర్‌ చేస్తారనే ఆశతోనే ఉద్యోగాలు చేస్తూ.. ఇప్పటికే చాలామంది చనిపోయారు కూడా. వీరికి జీతాలు పెంచినా.. ఆ భారం ప్రభుత్వ ఖజానాపై పడదు. భక్తుల ద్వారా వచ్చే ఆదాయంతోనే ఇస్తుంటారు. వీరికి టైం స్కేలు ఇచ్చి.. డీఏ, హెచ్‌ఆర్‌ఏలు కల్పిస్తామని ఏళ్లుగా ప్రభుత్వాలు హామీలు ఇస్తూనే ఉన్నాయి. విజయవాడలో ఇళ్ల అద్దెలు, పిల్లల చదువులు, నిత్యావసరాల ధరలు.. నింగినంటిన వేళ తల్లడిల్లుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని