logo

TDP-Janasena-BJP: మిత్రపక్షాల్లో ... ఉత్కంఠ..!

ఉమ్మడి జిల్లాలో మిత్రపక్షాలకు చెందిన నాలుగు స్థానాల్లో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. పార్లమెంటు స్థానాల విషయంలో స్పష్టత వచ్చినా.. శాసనసభ నియోజకవర్గాల విషయం కొలిక్కి రాలేదు.

Updated : 22 Mar 2024 09:28 IST

స్వతంత్రంగా పోటీ చేస్తామంటున్న ఆశావాదులు

ఈనాడు అమరావతి: ఉమ్మడి జిల్లాలో మిత్రపక్షాలకు చెందిన నాలుగు స్థానాల్లో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. పార్లమెంటు స్థానాల విషయంలో స్పష్టత వచ్చినా.. శాసనసభ నియోజకవర్గాల విషయం కొలిక్కి రాలేదు. నాలుగు స్థానాల్లో రెండు తెదేపా పోటీ చేసే విషయం తెలిసిందే. మిగిలిన రెండింటిలో ఒకటి జనసేనకు, మరో స్థానం భాజపాకు కేటాయించారు. వీటిపై స్పష్టత కోసం పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. మరోవైపు సీటు ఇచ్చినా ఇవ్వకున్నా పోటీ చేస్తానని ఆశావాదులు ప్రకటనలు చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. ప్రధానంగా జనసేన-భాజపా మధ్య ఈ సందిగ్ధం నెలకొంది.

ఉమ్మడి జిల్లాలో రెండు లోక్‌సభ, 14 శాసనసభ స్థానాలకు.. ఇప్పటికే తెదేపా 10 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అవనిగడ్డ, విజయవాడ పశ్చిమ మిత్రపక్షాలకు వదిలేసింది. మొదట రెండూ జనసేనకే అని భావించారు. కానీ భాజపాతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఎన్టీఆర్‌ జిల్లాలో ఒకటి కేటాయించాల్సి వచ్చిందని స్వయంగా జనసేనాని పవన్‌ ప్రకటించడం విశేషం. తెదేపా పోటీ చేసే పెనమలూరు, మైలవరం అభ్యర్థుల ఖరారులోనూ ప్రతిష్టంభన నెలకొంది.

ఖరారుపై కసరత్తు..!

ఈ నాలుగింట మిత్రపక్షాలు అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నాయి. లోతుగా పరిశీలన చేస్తున్నారు. గెలుపు గుర్రాలపై అంచనాలు వేస్తున్నారు. వైకాపా నుంచి తెదేపాలో చేరిన మైలవరం ఎమ్మెల్యే వసంత దాదాపు అక్కడే పోటీ చేస్తారని స్పష్టత ఇచ్చినట్లు తెదేపా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది మాజీ మంత్రి దేవినేని ఉమా బాధ్యుడిగా ఉన్న నియోజకవర్గం కావడంతో సర్దుబాటుపై చర్చ జరుగుతోంది. వసంత నియోజకవర్గ ముఖ్యనాయకులతో భేటీలు నిర్వహించి ప్రచార ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పెనమలూరుకు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ ఇన్‌ఛార్జిగా ఉన్నారు. ఆయనకు ఈసారి అవకాశం ఇవ్వలేకపోతున్నానని అధినేత చంద్రబాబు స్వయంగా చెప్పారు. కానీ ఆయన బాబు ఫొటోతో స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించి కలకలం లేపారు. మరోవైపు ఆయనకే ఖరారైందనే ప్రచారమూ జరుగుతోంది. అలాగే తెనాలికి చెందిన ఆలపాటి రాజాకు ఇస్తున్నారని చెబుతున్నారు. దేవినేని కుటుంబం నుంచి తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని చంద్రశేఖర్‌కు పిలుపొచ్చిందని ప్రచారం జరుగుతోంది. పార్టీ న్యాయ విభాగానికి చెందిన గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్‌ క్యూలో ఉన్నారు. మరోవైపు తనపై దుష్ప్రచారం తగదనీ... తనకు వంశీకి, కొడాలి నానికి సంబంధం లేదని బోడే వివరణ ఇవ్వడం చర్చనీయాంశమైంది.


జనసేనకు ధిక్కరింపు..!

టీవల భేటీలో జనసేనాని పవన్‌... పొత్తు ధర్మం ప్రకారం విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేయలేకపోతున్నామని ప్రకటించారు. అయినా.. తనకు ఇస్తే సరి లేకపోతే పవన్‌ ఫొటోతో పోటీ చేస్తానని తాజాగా పోతిన మహేష్‌ ప్రకటించడం కలకలం రేపింది. మరోవైపు ఇక్కడ అభ్యర్థిని ఖరారు చేయడంలో భాజపా జాప్యం చేస్తోంది. అవనిగడ్డలోనూ జనసేన అభ్యర్థి తేలలేదు. ప్రధాన పోటీదారుడు, వైకాపా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ మాత్రం తన ప్రసంగంలో జనసేన నుంచి ఓ ఎన్‌ఆర్‌ఐ పోటీ చేయనున్నారనీ.. ఆయన వచ్చి ఖర్చు చేస్తారట అని ఓ సభలో ప్రకటించడం విశేషం. ఇక్కడ ఎవరు పోటీ చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని