logo

ఆత్మీయ అతిథికి అపూర్వ స్వాగతం

సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌  నూతలపాటి వెంకట రమణ గురువారం కృష్ణా జిల్లాలో పర్యటించారు.

Published : 29 Mar 2024 04:15 IST

సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు నమస్కరిస్తున్న రాజధాని రైతులు

గన్నవరం గ్రామీణం, హనుమాన్‌ జంక్షన్‌: సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌  నూతలపాటి వెంకట రమణ గురువారం కృష్ణా జిల్లాలో పర్యటించారు. హైదరాబాద్‌ నుంచి ఉదయం 9 గంటలకు విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు అమరావతి రైతులు, న్యాయవాదులు, పలువురు ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. రాజధాని రైతులు వారి ఆకాంక్షలను తెలియజేస్తూ.. న్యాయ సహకారం అందించాలని ఎన్వీ రమణను ప్రత్యేకంగా కలిసి, వినతిపత్రం అందజేశారు. అక్కడి నుంచి.. ఎన్వీ రమణ నేరుగా బాపులపాడు మండలం బొమ్ములూరులో తన సన్నిహితుడైన ముసునూరి కాశీబాబు, శ్రీనివాసరావుల నివాసానికి చేరుకున్నారు. అక్కడ అల్పాహారం తీసుకున్నారు. గ్రామస్థులను ఆప్యాయంగా పలకరిస్తూ, వారితో ఫొటోలు దిగారు. తర్వాత సమీపంలో సీతారామాలయానికి వెళ్లి.. స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జాతీయ రహదారిపై రామిలేరు వంతెన వద్ద ఉన్న భక్తాంజనేయస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్థులతో ఆప్యాయంగా మమేకమై.. వారి నుంచి చిరు సత్కారాలు స్వీకరించారు. తర్వాత వీరవల్లిలో విజయ డెయిరీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్మించిన నూతన యూనిట్‌ని సందర్శించారు. అన్నదాతలతో సమావేశమై, గ్రామీణ జీవన విధానంలో పాడి ప్రాముఖ్యం, ఆవశ్యకతను వివరించారు. విజయ డెయిరీ ఉన్నతిని, రైతులకు అందిస్తున్న సేవలను కొనియాడారు. సంస్థ ఛైర్మన్‌ చలసాని ఆంజనేయులు సారథ్యంలో చేపట్టిన కార్యక్రమాలను అభినందించారు.

మొక్క నాటుతున్న సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ

పాడిరైతులకు బోనస్‌ చెక్కు అందజేస్తున్న సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ. పక్కన కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ఛైర్మన్‌ చలసాని ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావు తదితరులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని