logo

కలగా మిగిలిన వంతెన

జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

Published : 25 Apr 2024 05:28 IST

అయిదేళ్లు వేడుకున్నా ప్రజల గోడు పట్టలే
నెరవేరని ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ హామీ
న్యూస్‌టుడే, తోట్లవల్లూరు

పాములలంక గ్రామానికి వంతెన నిర్మించిన తర్వాతే దానిపై నడుచుకుంటూ వచ్చి వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతాను.
-గత ఎన్నికల సమయంలో వైకాపా అభ్యర్థిగా అనిల్‌కుమార్‌ ఇచ్చిన హామీ


అధికారం చేపట్టి అయిదేళ్లు పూర్తై మళ్లీ ఎన్నికలొచ్చాయి. ఇచ్చిన హామీ నెరవేర్చలేకపోయారు. దీంతో ఏటా వర్షాకాలంలో ప్రజలు, రైతులు పడవలపై ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు.

గనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 2014 ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రూ.13.5 కోట్ల అంచనాతో అప్పటి ఎమ్మెల్యే డీవై దాస్‌ ఈ వంతెనకు శంకుస్థాపన చేశారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఉప్పులేటి కల్పన రూ.30 కోట్లు మంజూరు చేయగా తెదేపా హయాంలో పనులు ప్రారంభించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో పనులు నిలిపి వేయించడంతో గుత్తేదారు సామగ్రి మొత్తం తీసుకెళ్లిపోయారు. వైకాపా ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ పాములలంక వంతెన నిర్మాణానికి 2021 సెప్టెంబరులో రూ.31.5 కోట్లు మంజూరయ్యాయని, నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి వెళ్లి పోయారు. ఇంత వరకు పనులు చేపట్టలేదు.

వేలాదిమంది జనాభాకు ఉపయోగం

తోట్లవల్లూరు మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరాన కృష్ణానది గర్భంలో పాములలంక గ్రామం ఉంది. పచ్చని పంట పొలాలతో కళకళలాడే ఈ గ్రామంలోని వారంతా దళితులే. పూర్తిగా వ్యవసాయం, పశుపోషణపై ఆధారపడి జీవిస్తున్నారు. సాధారణ రోజుల్లో నది మధ్యలో తాత్కాలిక బాటపై రాకపోకలు సాగిస్తారు. వరదొస్తే పడవలపై ప్రమాదకరంగా ప్రయాణిస్తారు. వంతెన నిర్మిస్తే పాములలంకతో పాటు సమీప లంకగ్రామాలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తుమ్మలపచ్చిక లంక, వల్లూరుపాలెం శివారు కాళింగదిబ్బలంక, రొయ్యూరు శివారు తోడేళ్లదిబ్బలంక గ్రామాలకు మేలు కలుగుతుంది. లంక గ్రామాల్లో సుమారు 3,200 మంది జనాభా ఉన్నారు. 4,200 ఎకరాల్లో చెరకు, అరటి, కంద, పసుపు పండిస్తారు.


పంట ఉత్పత్తుల తరలింపులో ఇబ్బంది

- పాముల శ్రీనివాసరావు

వరదలు వచ్చినప్పుడల్లా లంక గ్రామాల్లో పంటలు వేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైకాపా పాలనలో వంతెనకు సంబంధించి ఎటువంటి పనులు చేపట్టలేదు. వంతెన నిర్మిస్తే పంట ఉత్పత్తుల తరలింపు సులభతరం అవుతుంది.  


హామీలకే పరిమితం

- శీలం రాముడు, పాములలంక

ఈ వంతెన నాయకుల హామీలకే పరిమితమైంది. నిధులు మంజూరయ్యాయని చెప్పారు తప్ప అయిదేళ్లు గడిచినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు