logo

అనువుగాని భూములే.. అపూర్వమా పేర్ని!

వ్యవసాయ పరిశోధన స్థానానికి కేటాయించిన భూమి పరిశోధనలకు అనువుగా ఉండదు. అక్కడ భూసార పరీక్షలు కూడా చేశాం. చౌడు ఎక్కువగా ఉండడంతో పంటలు పండే అవకాశం ఉండదు.

Updated : 05 May 2024 04:32 IST

పడకేసిన పరిశోధనలు
చౌడుబారిన భూముల్లో చనిపోతున్న మొక్కలు
శాస్త్రవేత్తల మాటలు బేఖాతర్‌
మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

నిరుపయోగంగా ఇలా..

శాస్త్రవేత్తలు ఏమన్నారు

వ్యవసాయ పరిశోధన స్థానానికి కేటాయించిన భూమి పరిశోధనలకు అనువుగా ఉండదు. అక్కడ భూసార పరీక్షలు కూడా చేశాం. చౌడు ఎక్కువగా ఉండడంతో పంటలు పండే అవకాశం ఉండదు. దీనిపై ఆలోచించి అనువుగా ఉండే భూమి కేటాయించేలా చర్యలు తీసుకోవాలి. పరిశోధనాస్థానానికి భూమి కేటాయించే సమయంలో లాంఫాం శాస్త్రవేత్తలు ఎమ్మెల్యే పేర్ని నానీకి చెప్పిన మాటలు ఇవి

పనికిరాని భూమి ఉంటుందా: పేర్ని నాని

ఏం చెబుతారండి పనికి రాని భూమి అంటూ ఉంటుందా...ఏదైనా భవనం నిర్మించి ఖాళీగా వదిలేస్తే ఏమవుతుంది. గబ్బిలాలు పడతాయి. అలాగే  ఆ భూమి కూడా సాగు చేయడంలేదు కాబట్టి అలా ఉంది. గతంలో అక్కడ పంటలు పండించేవారు. ఏవైనా వసతులు కావాలంటే సమకూరుద్దాం.. ఎమ్మెల్యే పేర్ని శాస్త్రవేత్తలకు వ్యగ్యంగా ఇచ్చిన సమాధానం.

ది జరిగిన రెండేళ్లకు శాస్త్రవేత్తలు కలెక్టరేట్‌లో నిర్వహించిన వ్యవసాయ సలహామండలి సమావేశంలో ఎమ్మెల్యే పేర్నిని కలిసి సాగుచేసిన పంట అంతా పాడైపోతోంది. వ్యవసాయ పరిశోధనా స్థానానికి ప్రత్యేకంగా పైపులైన్‌ ఏర్పాటు చేసి సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలి. విద్యుత్తుతో పాటు వివిధ వసతులు కల్పించాలని కోరారు. దానికి ఎమ్మెల్యే పేర్ని నాని స్పందిస్తూ తాను రాజకీయాలనుంచి రిటైర్‌ అవుతున్నాననీ మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని అన్నారు.

ఇలా ఎమ్మెల్యే పేర్ని నాని ఎప్పటికప్పుడు ఏదో ఒక సమాధానాలు చెప్పి మభ్యపెట్టడం తప్ప ఇంతవరకు వ్యవసాయ పరిశోధన స్థానం గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుత భూములు చౌడుతేలి అధ్వానంగా మారిపోవడంతో అసలు పరిశోధనలు సాగుతాయా లేదా అన్న అనుమానాలు రైతులనుంచి వ్యక్తమవుతున్నాయి.

ఎండిపోతున్న పంటలు

పరిశోధనాస్థానం స్థలాన్ని వైద్య కళాశాలకు కేటాయించి కృష్ణా విశ్వవిద్యాలయం సమీపంలోని 17 ఎకరాల స్థలాన్ని వ్యవసాయ పరిశోధన స్థానం కోసం కేటాయించారు. ఆ స్థలం సాగుకు అనువుగా సిద్ధం కావాలంటే కొన్నేళ్లు పడుతుందని ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ముందునుంచీ చెబుతూనే ఉన్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు చూస్తే వారు అన్నది స్పష్టమైందని రైతులు అంటున్నారు. అక్కడ పరిశోధనలు ప్రారంభించాలని 5 ఎకరాల్లో వివిధ రకాల విత్తనాలు సాగు చేశారు. నాట్లు వేసిన కొన్ని రోజులకే మొక్కలన్నీ చనిపోయాయి. అలా రెండేళ్లు ఒక మొక్క కూడా బతికిన దాఖలాలు లేవు. పొలాన్ని సాగుకు సిద్ధం చేయడంతోపాటు వివిధ రకాల పనులు చేయించి విత్తనాలు చల్లించడంతోపాటు ఇతర అవసరాల నిమిత్తం ఏటా రూ.2లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు.

కౌలు భూముల్లో పరిశోధన

ఒక విత్తనం వివిధ దశల్లో నిర్వహించే పరిశోధనలు పూర్తై రైతులకు అందుబాటులోకి రావాలంటే 12ఏళ్ల సమయం పడుతుందని, ఇలా ఏటా పంట దెబ్బతింటేే మరింత జాప్యం అవుతుందని శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  చేసేది లేక వివిధ ప్రాంతాల్లో పొలాన్ని కౌలుకు తీసుకుని సాగుచేయాల్సి వచ్చింది. వ్యవసాయ పరిశోధనస్థానం ఆధ్వర్యంలో  .ఎంసీఎం-109,  ఎంసీఎం-125 విత్తనాలు పరిశోధనలో ఉన్నాయి. ఎంసీఎం-103 విత్తనాన్ని రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేయాల్సి ఉండడంతో తోట్లవల్లూరులో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని గత రబీలో సాగు చేశారు.

ఏటా వేలల్లో విత్తనాలపై పరిశోదనలు

ఏటా 2,500 నుంచి 3వేల రకాల వరకు విత్తనాలపై పరిశోధనలు జరుగుతుంటాయి. వ్యవసాయ పరిశోధనాస్థానం ఫిలిప్పిన్‌ పరిశోధనాస్థానంతో కూడా ఒప్పందం చేసుకోవడంతో వాళ్లు అందించేవి 400 రకాల వరకు ఉంటాయి వరుసగా రెండేళ్లపాటు సాగుచేసిన పంట చనిపోవడంతో విత్తన సైక్లింగ్‌ దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

వసతులు లేవు... భవనం లేదు

పరిశోధన స్థానానికి కేటాయించిన భూమిని సాగుకు అనుగుణంగా మార్చేందుకు శాస్త్రవేత్తలు పడరాని పాట్లు పడుతున్నారు. పరిశోధన కేంద్రం ఉత్పత్తి చేసే విత్తనాలు 12శాతం వరకు ఉన్న చౌడును తట్టుకుంటాయి.  ప్రస్తుతం ఆ భూమిలో 16 నుంచి 20శాతంవరకు చౌడు ఉండటంతో నాట్లు వేసిన మొక్కలన్నీ చనిపోతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికోసం పంట కాల్వ నుంచి పరిశోధనాస్థానం వరకు ప్రత్యేక పైపులైన్‌ వేయాలని కోరినా ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. కేంద్రానికి ఇప్పటివరకు కార్యాలయమే లేదు.ప్రస్తుతం ఉద్యోగులు తాత్కాలికంగా ఏరువాక కేంద్రంలో సర్దుకుని విధులు నిర్వహిస్తున్నారు. భవన నిర్మాణాలు, విత్తనాలు నిల్వచేసేందుకు గోదాములు ఇలా అనేక వసతులు కల్పించాల్సి ఉన్నా పట్టించుకోకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విత్తనాలకు ఇబ్బందులు

వ్యవసాయ పరిశోధనాస్థానం ఉత్పత్తి చేసే విత్తనాలతోపాటు వివిధ రకాల ఫౌండేషన్‌, బ్రీడర్‌ విత్తనాలు లభించేవి. వాటిని రైతువారీగా తాము సాగు చేసుకుని తరువాత ఇతర రైతులకు విత్తనాలు విక్రయించేవాళ్లం. అలాంటి పరిశోధనాస్థానం కేవలం పాలకుల వైఫల్యం కారణంగా నిర్వీర్యం అయ్యే పరిస్థితులు దాపురించాయి. వెంటనే ఆ భూములకు సాగునీరు సౌకర్యం కల్పించాలి. లేదంటే వేరేచోట భూములు కేటాయించాలని కోరుతున్నాం.

చీడేపూడి ఏడుకొండలు, రైతు,మల్లవోలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని