logo

ఎత్తిపోయలే... ఒట్టి మాటలే...

ఎన్నెస్పీ నీరు అందని చోట ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశారు. వాటిలో చాలా మరమ్మతులకు గురయ్యాయి. ప్రతిపాదనలు పంపినా అయిదేళ్లలో పైసా విదల్చలేదు.

Published : 05 May 2024 03:12 IST

సాగు నీరు లేక అన్నదాతల విలవిల
పథకాల మరమ్మతులకు నిధులివ్వని జగన్‌

మాది అన్నదాతల పక్షపాతి ప్రభుత్వం. ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాం. రైతన్నలను ఆదుకుంటున్నాం.

సీఎం జగన్‌ వివిధ సభల్లో చెప్పే కబుర్లు

వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పూర్తి స్థాయిలో ఎన్నెస్పీ నీరు విడుదలకు ప్రయత్నించడం లేదు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు.

నందిగామ గ్రామీణం, తిరువూరు, మైలవరం, న్యూస్‌టుడే

ఎన్నెస్పీ నీరు అందని చోట ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశారు. వాటిలో చాలా మరమ్మతులకు గురయ్యాయి. ప్రతిపాదనలు పంపినా అయిదేళ్లలో పైసా విదల్చలేదు. కొత్తవి నిర్మించకపోగా ఉన్నవి నిరుపయోగంగా మార్చిన ఘనత వైకాపా ప్రభుత్వానిదే.

చుక్కనీరు రాల్చని విస్సన్నపేట మండలం నూతిపాడు ఎత్తిపోతల పథకం

ఇదీ పరిస్థితి...

  • వేదాద్రి ఎత్తిపోతల ద్వారా వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో చుక్కనీరు ఇవ్వలేదు. దాని కింద 17,366 ఎకరాలు ఉంది. 4 మోటార్లు పాడయ్యాయి. కొత్తవి కొనుగోలుకు రూ.8 కోట్లతో ఐడీసీ అధికారులు ప్రతిపాదనలు పంపారు. నిధులు మంజూరు చేయలేదు. 
  • నందిగామ మండలంలోని వైరా ఏటిపై కమ్మవారిపాలెం ఎత్తిపోతల ద్వారా 600 ఎకరాలకు నీరు ఇవ్వాలి. ఇక్కడ 2 మోటార్లు మరమ్మతులకు గురయ్యాయి. ఒకదానితో 150 ఎకరాలకు సాగునీరు సరఫరా చేశారు. 
  • సోమవరం వద్ద వైరా ఏటి ఒడ్డున మాగల్లు-2 ఎత్తిపోతలు నిర్మించారు. ఒక మోటారు పని చేయడం లేదు. 
  • జగ్గయ్యపేట మండలం బూదవాడ, మల్కాపురం, పెనుగంచిప్రోలు మండలం కె.పొన్నవరం ఎత్తిపోతల ద్వారా ఆయకట్టుకు సాగు నీరు అందడం లేదు.

తిరువూరు నియోజకవర్గంలో..

  • తిరువూరు మండలం ముష్టికుంట్లలో నిర్మించిన 2 పథకాలు మూలకు చేరాయి. వాటి పరిధిలోని 600 ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకమైంది. కొమ్మిరెడ్డిపల్లి పథకం నామరూపాలు లేకుండా పోయింది. చౌటపల్లి, ఎరుకోపాడు, గానుగపాడులో నిరుపయోగమై 800 ఎకరాలకు సాగు నీరందని పరిస్థితి నెలకొంది.
  • గంపల గూడెం మండలం నెమలి, దాసాపురం, పెదకొమిర పథకాలు వినియోగంలో లేవు.
  • విస్సన్నపేట మండలం మారెమండతండా, నూతిపాడు-1, 2, పథకాలు అక్కరకు రాకుండా పోయాయి. వాటి ఆయకట్టులో 4 వేల ఎకరాలు ఉంది.
  • ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెం, మాధవరం సమీపంలోని ఎన్‌ఎస్‌పీ మైలవరం బ్రాంచి కాలువపై నిర్మించిన పథకాలు పని చేయడం లేదు. 4 వేల ఎకరాల్లో సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది.

మైలవరం ప్రాంతంలో..

  • మైలవరం నియోజకవర్గంలో దాదాపు 22 ఎత్తిపోతల పథకాలు తెదేపా ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి దేవినేని ఉమా చొరవతో ఏర్పాటయ్యాయి. అప్పట్లో ఐదేళ్ల పాటు నిరాటంకంగా సాగిన పథకాలు నేడు మూలకు చేరాయి.
  • మైలవరం మండలం దాసుళ్లపాలెంలో రూ.2.22 కోట్ల వ్యయంతో సుమారు 100 ఎకరాలకు నీరిచ్చే ఎత్తిపోతల వైకాపా అధికారంలోకి వచ్చాక ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది.
  • రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట, రెడ్డిగూడెం తదితర గ్రామాల్లో చెరువులను సాగర్‌ నీటితో నింపాలని ఎన్నెస్పీ కాలువలపై ఉన్న 3 పథకాలు నిరుపయోగంగా మారాయి.

నీరందక నష్టపోయా

నాలుగు ఎకరాల్లో మిర్చి సాగు చేశా. అందులో మూడెకరాలు రూ.75 వేలకు కౌలుకు తీసుకున్నా. వైకాపా ప్రభుత్వంలో వేదాద్రి ఎత్తిపోతల ద్వారా చుక్కనీరు విడుదల చేయలేదు. సాగర్‌ నీరు రాలేదు. రెండు బోర్లున్నా రోజుకు అరెకరం మాత్రమే తడిసింది. రూ.50 వేలు వెచ్చించి ఇతర రైతుల బోర్ల సహాయంతో మిర్చికి తడులందించా. నీరందక దిగుబడి తగ్గి తీవ్రంగా నష్టపోయా.     

జమళ్లమూడి శ్రీనివాసరావు, చెర్వుకొమ్ముపాలెం


సీఎం హామీ నెరవేర్చలేదు

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు ఒక్క పైసా ఇవ్వలేదు. వాటి కింద గతంలో రెండు పంటలు పడిన భూములు ఇప్పుడు బీడుగా మారాయి. గత ఏడాది ఖరీఫ్‌, ఈ ఏడాది రబీ పంటలు సాగుకు నోచుకోలేదు. కొత్త వాటిని నిర్మిస్తామని ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీని జగన్‌ నెరవేర్చలేదు. 

జి.హరిబాబు, రైతు, తిరువూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని