logo

బూతులు.. గోతులు.. మనకొద్దు!

జనసేనాని పవన్‌ కల్యాణ్‌ రాకతో ఎన్డీయే కూటమిలోనూతనోత్సాహం వచ్చింది. గుడివాడ, అవనిగడ్డల్లో శనివారం వారాహి విజయభేరి బహిరంగ సభల్లో పవన్‌ పాల్గొన్నారు.

Published : 05 May 2024 03:29 IST

కొడాలి, జగన్‌ ఓడిన రోజే సంబరం
వైకాపా పాలనపై పవన్‌ నిప్పులు
గుడివాడ, అవనిగడ్డల్లో నీరాజనం
ఈనాడు, అమరావతి- ఈనాడు డిజిటల్‌, మచిలీపట్నం, న్యూస్‌టుడే బృందం

గుడివాడలో ప్రసంగిస్తున్న జనసేనాని, పక్కనే వల్లభనేని బాలశౌరి, వెనిగండ్ల రాము

నసేనాని పవన్‌ కల్యాణ్‌ రాకతో ఎన్డీయే కూటమిలోనూతనోత్సాహం వచ్చింది. గుడివాడ, అవనిగడ్డల్లో శనివారం వారాహి విజయభేరి బహిరంగ సభల్లో పవన్‌ పాల్గొన్నారు. ఒకవైపు ఎండ మండిపోతున్నా.. లెక్క చేయకుండా జనసేన, తెదేపా, భాజపా శ్రేణులు భారీగా తరలివచ్చారు. తొలుత గుడివాడలో మధ్యాహ్నం, అవనిగడ్డలో రాత్రి సభలు నిర్వహించారు. ఎ.ఎన్‌.ఆర్‌. కళాశాల వద్దకు నేరుగా హెలీకాఫ్టర్‌లో చేరుకున్న పవన్‌ అక్కడి నుంచి ర్యాలీగా నెహ్రూచౌక్‌కు వచ్చారు. ఆయన వెంట వేల మంది జనసైనికులు, తెదేపా అభిమానులు ద్విచక్రవాహనాలతో ర్యాలీగా వచ్చారు. పవన్‌ను సభా ప్రాంగణానికి తీసుకొచ్చే.. దారి పొడవునా.. పూలు చల్లుతూ, గజమాలలతో స్వాగతం పలికారు. ఎండ తీవ్రత పెరుగుతున్నా.. ఏమాత్రం జనం రద్దీ తగ్గకపోవడం చూస్తేనే.. కూటమి విజయం ఈసారి ఎంత బలంగా ఉండబోతోందో అర్థమవుతోందని నేతలు పేర్కొన్నారు.

అవనిగడ్డ: అభిమానులు అందించిన పడవ, వలతో జనసేనాని పవన్‌. వేదికపై అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌, బందరు ఎంపీ అభ్యర్థి బాలశౌరి

దౌర్జన్యం చేసేవాళ్లకు ఓటు వేయొద్దు..

మచిలీపట్నం లోక్‌సభ నుంచి బాలశౌరిని ఎంపీగా, గుడివాడ, అవనిగడ్డ నుంచి వెనిగండ్ల రాము, మండలి బుద్ధప్రసాద్‌లను ఎమ్మెల్యేలుగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పవన్‌ విజ్ఞప్తి చేశారు. తాను పిఠాపురం నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతాననీ, గుడివాడ నుంచి రాము, అవనిగడ్డ నుంచి బుద్ధప్రసాద్‌ను గెలిపిస్తే.. వారితో కలిసి తాను కృష్ణా జిల్లా సమస్యల పరిష్కారానికి గళం వినిపిస్తానని పేర్కొన్నారు 2019లో జనసేన అభ్యర్థుల తరఫున వెనిగండ్ల ప్రచారం చేశారన్నారు. రాష్ట్రంలో వైకాపా, గుడివాడలో కొడాలి నాని ఓడిపోయిన తర్వాతే.. వేడుకలు చేసుకుందామని పవన్‌ అనడంతో.. ఒక్కసారిగా సభావేదిక వద్ద చప్పట్లు, ఈలల మోత మోగింది. బూతులు మాట్లాడేవాళ్లు, దౌర్జన్యాలు చేసే వాళ్లకు ఓట్లేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఏదైనా అడిగితే నోరేసుకునే కొడాలికి సరైన మందు వెనిగండ్లే అని పవన్‌ ఉద్ఘాటించారు.

కొనకళ్ల పోరాటాన్ని కీర్తిస్తున్న పవన్‌

గుడివాడలో దోపిడీ...

గత ఐదేళ్లలో గుడివాడలో వైకాపా నాయకులు చేసిన దౌర్జన్యాలు, దోపిడీ శ్రుతి మించాయని పవన్‌ ధ్వజమెత్తారు. పంచాయతీ చెరువులు, దేవస్థానం భూముల్లో విచ్చలవిడిగా మట్టిని తవ్వి అమ్ముకున్నారన్నారు. చివరికి శ్మశాన వాటికలనూ వదలకుండా మట్టి తరలించుకుపోయారని మండిపడ్డారు. ఇదేంటని అడిగిన ప్రభుత్వ ఉద్యోగులపైనా దాడులకు తెగబడిన గుడివాడ వైకాపా నాయకులకు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.  

దమ్మున్న నేత బాలశౌరి...

అవనిగడ్డకు రైల్వేలైను రావాలంటే.. దమ్మున్న బాలశౌరి వల్లే సాధ్యమవుతుందని పవన్‌ కొనియాడారు. జనసేన కార్యకర్తపై మచిలీపట్నంలో దాడి చేస్తే.. బాలశౌరి వీరసింహంలా తిరగబడటం తనకు బాగా నచ్చిందన్నారు. జనసైనికులకు ఆయనలాంటి దమ్మున్న బలమైన నేత దొరకడం ఆనందంగా ఉందన్నారు. పార్లమెంట్‌లో కొనకళ్ల మీద దాడి జరిగితే తెలుగు వారంతా చలించిపోయారనీ.. అందుకే.. ఆయనంటే తనకు అపారమైన వాత్సల్యమని పవన్‌ తెలిపారు. కొనకళ్ల పెద్ద మనుసుతో ఆయన ఎంపీ స్థానం బాలశౌరికి ఇచ్చారనీ, తన జన్మలో ఇది మరచిపోలేనన్నారు. వైకాపాలో ఆత్మగౌరవంతో ఉండలేకే.. బాలశౌరి, అంబటి రాయుడు బయటకొచ్చేశారని పవన్‌ తెలిపారు. అవనిగడ్డలో బుద్ధప్రసాద్‌ లాంటి నేతను గెలిపించాలని కోరారు.

అవనిగడ్డ సభకు హాజరైన అశేష జనవాహిని


చేనుకు నీరు.. చేతికి పని

ఐదేళ్లలో స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు చేతిలో అవనిగడ్డ దోపిడీకి గురైంది. నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడింది. ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు తయారయ్యాయి. వైకాపా పాలనలో పంటలకు నీళ్లు లేక భూములు బీడుగా మారాయి. డ్రెయినేజీ మరమ్మతులు లేక పంటలు మునిగి అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని ఇచ్చే బాధ్యత కూటమి తీసుకుంటుంది. ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేసి తాగు నీటి సమస్య పరిష్కరిస్తాం. ప్రశ్నిస్తే జైలుకు పంపిన ప్రభుత్వంలో ఇన్నేళ్లు గడిపాం. ప్రజల కోసం తాపత్రయ పడే వ్యక్తి పవన్‌ కల్యాణ్‌.

బుద్ధప్రసాద్‌, అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థి


అరాచక పాలన అంతానికి ఓటేయాలి..

రాష్ట్రంలో అరాచక పాలన పోవాలంటే కూటమి అభ్యర్థులకు ఓట్లేయాలి. గుడివాడలో రైల్వే పైవంతెన నిర్మాణం చేయడానికి కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో మాట్లాడి నిధులు తీసుకు వచ్చాను. సీఎస్‌ఆర్‌లో భాగంగా రూ.కోట్ల నిధులను తీసుకొచ్చి పాఠశాలలు, ఆసుపత్రుల్లో అభివృద్ధి పనులు పెద్దసంఖ్యలో చేపట్టాం. రైతు సంక్షేమమే ధ్యేయంగా తన సొంత నిధులను వారికి ఇచ్చిన గొప్ప వ్యక్తి పవన్‌. ఎన్డీయే సారథ్యంలో పోలవరం నిర్మాణం పూర్తిచేసి కృష్ణా డెల్టాకు పుష్కలంగా నీటిని అందిస్తాం.

వల్లభనేని బాలశౌరి, ఎన్డీయే కూటమి లోక్‌సభ అభ్యర్థి


పవన్‌ రాకతో వెన్నులో వణుకు..

వెనిగండ్ల రాము, గుడివాడ అసెంబ్లీ ఎన్డీయే కూటమి అభ్యర్థి

పవన్‌ కల్యాణ్‌ పేరు వింటేనే యువతలో వైబ్రేషన్స్‌ వస్తాయి. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్న వైకాపాకు ఎదురు నిలవడమే కాకుండా.. ప్రజాక్షేమం కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని మూడు పార్టీలను ఏకం చేసిన ఘనత పవన్‌ కల్యాణ్‌కే దక్కుతుంది. వైకాపా అరాచక పాలనను అంతం చేయడానికి పవన్‌ అడుగు ముందుకేస్తే.. లక్షల మంది ఆయన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్టీఏ కూటమి గెలుపు ఖాయం. ఎన్ని సీట్లు వస్తాయన్నదే లెక్క. పవన్‌ రాకతో గుడివాడలో కొందరికి వెన్నులో వణుకు మొదలైంది.


పోటెత్తిన అభిమానం

కూటమిదే.. జయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని