logo

పేర్ని నాని అరాచకానికి చెక్‌ పెడదాం

మచిలీపట్నం నియోజకవర్గాన్ని సొంత సామాజ్యంగా భావిస్తూ రాచరికపు పోకడలతో అన్ని వర్గాలను అణిచివేస్తున్న పేర్ని వెంకట్రామయ్య(నాని) కబంధ హస్తాల నుంచి నియోజకవర్గాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సైనిక్‌ సమతాదళ్‌(ఎస్‌ఎస్‌డీ) నాయకులు స్పష్టం చేశారు.

Updated : 06 May 2024 05:06 IST

ఎస్‌ఎస్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు

మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: మచిలీపట్నం నియోజకవర్గాన్ని సొంత సామాజ్యంగా భావిస్తూ రాచరికపు పోకడలతో అన్ని వర్గాలను అణిచివేస్తున్న పేర్ని వెంకట్రామయ్య(నాని) కబంధ హస్తాల నుంచి నియోజకవర్గాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సైనిక్‌ సమతాదళ్‌(ఎస్‌ఎస్‌డీ) నాయకులు స్పష్టం చేశారు. ఈశ్వర్‌ రెసిడెన్సీలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఎస్‌ఎస్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు మాట్లాడుతూ పేర్ని, ఆయన కుమారుడు కిట్టూ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన ఏపార్టీలో ఉన్నా నియోజకవర్గంలో ఏ ఒక్కరినీ ఎదగనీయకుండా చేసి కుటుంబ వారసత్వానికే పెద్దపీట వేసుకుంటారన్న విషయం ప్రత్యేకించి చెప్పకోవాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయంగా ఏమాత్రం అనుభవం లేని టిక్‌టాక్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న కుమారుడు కిట్టూను రంగంలోకి దింపారనీ, గంజాయిబ్యాచ్‌ను వెంటేసుకుని తిరిగే ఆయనకు ప్రజా సంక్షేమం ఏమాత్రం పట్టదన్నారు.

పోర్టు నిర్మించాకే ఓటు అడుగుతానని చెప్పి..

మచిలీపట్నంలో అంబేడ్కర్‌ భవన్‌ నిర్మాణానికి రూ.5 కోట్లు నిధులు మంజూరైతే అవి ఏమయ్యాయో  తెలియకుండా చేశారన్నారు. పోర్టు నిర్మించాకే ఎన్నికల్లో ఓటు అడుగుతానంటూ హామీ ఇచ్చి మళ్లీ ఓటు రాజకీయం కోసం పోర్టు పనులు 10 శాతం కూడా పూర్తిచేయకుండా ఎలా ప్రజలకు ముఖం చూపిస్తున్నారో చెప్పాలన్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో అకృత్యాలు, అరాచకాలు, దోపిడీలు, బెదిరింపులు, హత్యలకు గురవుతూ రాజ్యాంగ కల్పించిన హక్కులను కూడా దూరం చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఓటు చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఎస్‌డీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌షిండే మాట్లాడుతూ పేర్ని నాని మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గం అభివృద్ధికి ఏమి  చేయలేదన్నారు. ఎస్‌ఎస్‌డీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.


జగన్‌కు ఓటేస్తే ఐదేళ్లు మళ్లీ నరకం

పెడన, న్యూస్‌టుడే: వైకాపాకు ఓటేస్తే రానున్న ఐదేళ్లు ప్రజలు మరింత నరకం చవిచూడక తప్పదని సమతా సైనిక్‌ దళ్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు పేర్కొన్నారు.. ఆదివారం పెడనలో పర్యటించిన ఆయన ఎస్సీ కాలనీలకు వెళ్లి ప్రజలను చైతన్యపర్చారు. సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాకు ఓటేయవద్దని ఆపార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీలు మరింతగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని సూచించారు. అనంతరం స్థానిక వీరభద్రపురం కర్ణభక్త కల్యాణ మంటపంలో విలేకర్లతో  మాట్లాడారు. జగనన్న కాలనీల పేరిట ఎస్సీలకు చెందిన 12వేల ఎకరాల భూముల్ని బలవంతంగా ప్రభుత్వం తీసుకుందని తద్వారా ఎస్సీలు ఉపాధిని కోల్పోయారన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో వైకాపాను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌ షిండే, స్థానిక నేతలు కమ్మగంటి వెంకటేశ్వరరావు, బొడ్డు చినబాబు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని