logo

జగనాసుర వారి.. నరకాపురి..!

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని రహదారులపై ప్రయాణించినవారెవరైనా సరే.. జగన్‌ సర్కారును శాపనార్థాలు పెట్టకుండా ఉండలేరు. అటు ప్రైవేటు వాహనాలవారే కాదు.. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు సైతం మేం నడపలేం అంటూ మొత్తుకున్న సందర్భాలెన్నో. పల్లె వెలుగు బస్సులు నడి రోడ్డుమీదనే ఎన్నిసార్లు నిలిచిపోయాయో లెక్కే లేదు.  

Updated : 06 May 2024 06:42 IST

గోతుల రోడ్లతో ప్రయాణికుల నడ్డి విరిచిన వైకాపా సర్కారు
మరమ్మతుల మాటే లేదు.. ఐదేళ్లలో ఎంతో నష్టపోయిన జనం
ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే బృందం

ఏ రోడ్డు చూసినా ఏమున్నది
గర్వకారణం...
అడుగుకో గుంత.... గజానికో గొయ్యి... కంకర తేలిన రోడ్లు.. కుంగిపోయిన భారీ గోతులు...
వర్షం వస్తే తటాకాలను తలపించే
రహదారులు..
వాహనం నడపాలంటే వెన్నులో వణుకు.. నడకే నాట్యంగా
మారిన తీరు.. తరచూ మరమ్మతులు... పైగా ఇంధనం ఆవిరి...
ఒళ్లు గుల్ల.. జేబుకు చిల్లు..

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇదీ తీరు.

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని రహదారులపై ప్రయాణించినవారెవరైనా సరే.. జగన్‌ సర్కారును శాపనార్థాలు పెట్టకుండా ఉండలేరు. అటు ప్రైవేటు వాహనాలవారే కాదు.. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు సైతం మేం నడపలేం అంటూ మొత్తుకున్న సందర్భాలెన్నో. పల్లె వెలుగు బస్సులు నడి రోడ్డుమీదనే ఎన్నిసార్లు నిలిచిపోయాయో లెక్కే లేదు.  

మ్మడి జిల్లాలో రాష్ట్ర, జిల్లా రహదారులపై ఐదేళ్లలో జగన్‌  సర్కారు వెచ్చించింది అంతంతే. న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు సాయంతో చేపట్టిన పనులు ఆగిపోయాయి. నిధులు పక్కదారి పట్టాయి. కొత్త దారులకు అధికారులు ప్రతిపాదించినా... మేం చేయలేమని గుత్తేదారులు పరారైపోతున్నారు. చేసినవాటికే బిల్లులు రాక లబోదిబోమంటున్నారు. కేంద్ర నిధులతో అత్తెసరు పనులు చేసినా.. వర్షాలకు మూన్నాళ్ల ముచ్చటే అయింది. వైకాపా రాజకీయ వ్యూహ సంస్థ ఐపాక్‌ బృందం సూచించిన కొన్ని దారులకు  పైపైన పూతలు పూసి అదే గొప్పగా చెబుతున్నారు. వాగులు, వంకలపై నిర్మించాల్సిన వంతెనలనూ వదిలేశారు.

జాతీయ రహదారులే దిక్కు

ఉమ్మడి జిల్లా మీదుగా చెన్నై - కోల్‌కతా; హైదరాబాద్‌, భద్రాచలం, బందరు, 215 జాతీయ రహదారులు వెళ్తున్నాయి. గత తెదేపా ప్రభుత్వ హయాంలోనే వీటికి ఒక రూపు వచ్చింది. విజయవాడ బైపాస్‌ సహా వివిధ పనులకు 2019కు ముందే టెండర్లను పూర్తి చేసి నిర్మాణం చేపట్టారు. వీటికి అనుసంధానంగా రాష్ట్ర, గ్రామీణ రహదారులు 4 వేల కిమీ మేర ఆర్‌ అండ్‌ బీ పరిధిలో ఉన్నాయి. గ్రామాల్లో లింకు రోడ్లు మాత్రం పీఆర్‌ నిర్వహిస్తోంది. గ్రామాలకు, పొలాలకు రవాణా సౌకర్యం కల్పించలేదు. జడ్పీ రహదారులు మట్టి కొట్టుకుపోయాయి.

అదనపు భారం: గుంతల రోడ్లలో ప్రయాణంతో ఆరోగ్యం దెబ్బతిని వైద్యఖర్చులు తప్పట్లేదు.

  • ఆటోలు తరచూ మరమ్మతులకు గురై డ్రైవర్లు అప్పులు చేస్తుండగా.. ఇంధనానికీ రెట్టింపు వ్యయమవుతోంది.
  • భారీ వాహనాలు యాక్సిల్‌ విరిగి రోడ్డుపైనే రెండుమూడ్రోజులు ఉంటున్నాయి.
  • ట్రాక్టర్లు సైతం వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేయలేని దుస్థితి.

వనిగడ్డ నియోజకవర్గం కోడూరు నుంచి రామకృష్ణాపురం వెళ్లే రహదారి దారుణంగా తయారైంది. 13 కిలోమీటర్ల దూరం వరకు గుంతలమయంగా ఉంది. దీంతో ఆర్టీసీ బస్సులు నడపడం నిలిపివేసిన సందర్భాలున్నాయి. వి.కొత్తపాలెం నుంచి బడేవారిపాలెం రహదారి పాడవడంతో సుమారు 4 నెలల కిందట గోపీనాథ్‌ అనే యువకుడు బైక్‌పై వెళుతూ రాత్రి సమయంలో గుంత కనిపించక ప్రమాదానికి గురై వాహనం ఎగిరిపడి మరణించాడు. అదే రహదారిలో ఎమ్మెల్యే రమేష్‌బాబుకు చెందిన పాఠశాల బస్సు కూడా గుంతలో పడి పల్టీకొట్టి పంట కాల్వలోకి దూసుకు వెళ్లింది.

న్యూస్‌టుడే, కోడూరు(అవనిగడ్డ)


గత ప్రభుత్వంలో..

  • 2014 నుంచి 2019 మధ్య కాలంలో 16 నియోజకవర్గాల్లో దాదాపు రూ. 1,271.48 కోట్లతో 1,431.64 కిలోమీ టర్ల రహదారులు నిర్మించారు.  వీటిలో ఎక్కువగా బీటీ, కొన్నిచోట్ల సిమెంటువి ఉన్నాయి.
  • రూ. 210.85 కోట్లతో 268.22 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు
  • రూ. 650.14 కోట్లతో 787.90 కిలోమీటర్ల మేర జిల్లా ప్రధాన రహదారులు.
  • రూ. 197.72 కోట్లతో 332.42 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులను నిర్మించారు.
  • కేంద్ర రోడ్డు నిధులు సీఆర్‌ఎఫ్‌ ద్వారా 127.95 కోట్లతో 57.60 కిలోమీటర్ల మేర నిర్మించారు.
  • ఎన్సీఆర్‌ఎంపీ ప్రాజెక్టు కింద రూ. 129.80 కోట్లతో అయిదు కిలోమీటర్ల రహదారి, మచిలీపట్నం నియోజకవర్గంలో రెండు వంతెనలు, పెడన నియోజకవర్గంలో ఒక వంతెన నిర్మించారు.

    మ్మడి జిల్లాలో ఎన్‌డీబీ నిధులు రూ. 36,486 కోట్లతో ఒకే ప్యాకేజీ కింద 13 రోడ్ల పనులు చేపట్టారు. ఒక్కటీ పూర్తి కాలేదు.

  • నాబార్డు కింద రూ. 109 కోట్లు మంజూరు చేస్తే.. ఒక్క పనీ చేపట్టకుండా నిధులు మళ్లించేశారు.
  • ప్లాన్‌ గ్రాంట్లు, నాన్‌ప్లాన్‌ గ్రాంటు, ప్రత్యేక మరమ్మతులు, కోర్‌నెట్‌, సీఆర్‌ఎఫ్‌ కింద చేపట్టాల్సిన పనులను మధ్యలోనే వదిలేశారు.
  • అత్యవసరం కింద చేపట్టాల్సిన మరమ్మతులకు 71 పనులకుగాను రూ. 128.58 కోట్లను కేటాయించగా.. రూ. 117.79 కోట్లను ఖర్చు చేశారు.
  • కంకిపాడు నుంచి కలువపాముల మీదుగా గుడివాడ వెళ్లే రహదారిపై బస్సులో వెళ్తే నడ్డి విరిగి జనం ఆసుపత్రులపాలవుతున్నారు.
  • అవనిగడ్డ, పెడనల్లోనూ రహదారులు దారుణంగా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని