logo

డబ్బులు పంచుతూ.. స్టిక్కర్లు అంటిస్తూ..

ఇంటింటికీ ప్రచారం పేరుతో వైకాపా స్టిక్కర్లు అంటిస్తూ గుట్టుచప్పుడు కాకుండా నగదు పంపిణీ చేస్తున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెదేపా నాయకులపైనే వైకాపా నాయకులు తప్పుడు కేసులు బనాయించారు.

Published : 08 May 2024 04:25 IST

వైకాపా నాయకుల అరాచకం
అడ్డుకున్న తెదేపా నాయకులపై కేసు

పాయకాపురం (మధురానగర్‌), న్యూస్‌టుడే : ఇంటింటికీ ప్రచారం పేరుతో వైకాపా స్టిక్కర్లు అంటిస్తూ గుట్టుచప్పుడు కాకుండా నగదు పంపిణీ చేస్తున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెదేపా నాయకులపైనే వైకాపా నాయకులు తప్పుడు కేసులు బనాయించారు. వివరాల్లోకి వెళితే... ఎన్డీయే కూటమి అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు తనయుడు రవితేజ మంగళవారం ఉదయం 62వ డివిజన్‌, రాధానగర్‌లో ప్రచారం చేస్తున్నారు. వైకాపా నాయకులు కరుణశ్రీ, జ్యోతి, చిన్ని తల్లి మరికొంత మంది ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు ఇస్తూ, స్టిక్కర్లు అంటిస్తూ డబ్బులు పంచుతున్నారు. దీన్ని గుర్తించిన స్థానికులు.. తెదేపా నాయకులకు సమాచారం అందించారు. బొండా రవితేజ మరికొందరు అక్కడకు వెళ్లి ప్రశ్నించడంతో.. వైకాపా నాయకులు దుర్భాషలాడుతూ దౌర్జన్యం చేశారు. స్టిక్కర్లు అంటించేందుకు అనుమతి ఉందా? అని అడిగితే కొట్టారంటూ షేక్‌ మస్తాన్‌ అనే తెదేపా నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని అడ్డుకున్నందుకు బొండా రవితేజను కూడా దుర్భాషలాడారన్నారు. తనను ఎన్నికలు అయ్యేలోపు ఖతం చేస్తామంటూ వైకాపా అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, మరికొంత మంది బెదిరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో షేక్‌ మస్తాన్‌ పేర్కొన్నారు.

పోలీస్‌ స్టేషన్‌ వద్ద హైడ్రామా.. రాధానగర్‌లో తెదేపా, వైకాపా నాయకుల ఘర్షణతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఘటనపై ఫిర్యాదు చేసేందుకు బొండా రవితేజ ఇతర నాయకులు నున్న పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసులు అతనిని స్టేషన్‌లో కూర్చోపెట్టారు. వైకాపా అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా తదితరులు స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు. బొండా ఉమామహేశ్వరరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెదేపా నాయకులు వందలాది మంది విచ్చేశారు. ఇరువర్గాలు ఎదురెదురు పడడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సైతం వచ్చారు. బొండా రవితేజపై ఫిర్యాదు చేయాలంటూ చెప్పి వెలంపల్లి వెళ్లిపోయారు. బొండా ఉమా సోదరుడు బొండా శ్రీనివాసరావు, తెదేపా ఫ్లోర్‌లీడర్‌, న్యాయవాది నెల్లిబండ్ల బాలస్వామిలు కూడా స్టేషన్‌కు వచ్చారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.

కులం పేరుతో దూషించారని మహిళలు ఫిర్యాదు.. 62వ డివిజన్‌ లచ్చిరెడ్డి పిండి మర వెనుక వీధిలో.. బొండా రవితేజ ఆధ్వర్యంలో ప్రచారం చేస్తుండగా వైకాపాకు చెందిన పలువురు బాలికలతోపాటు మాతా మహేష్‌, ఎస్‌.కె.మస్తాన్‌ (పొట్టి మస్తాన్‌)లు తమను అడ్డుకున్నారని చొప్పర వరలక్ష్మి నున్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది మా ప్రాంతమని, తెదేపా వాళ్లు ప్రచారం చేయాలంటే మా అనుమతి తీసుకోవాలంటూ వైకాపా నాయకులు అడ్డుకున్నారు. వెళ్లకపోతే చంపుతామని బెదిరించారని, కులం పేరుతో దుర్భాషలాడుతూ ఇష్టానుసారం కొట్టారు. మేరి, కుమారి, బోను కుమారి, రమణమ్మ అనే కార్యకర్తలపై దాడి చేశారని, మాతా మహేష్‌, ఎస్‌.కె.మస్తాన్‌ (పొట్టి మస్తాన్‌)లు తమ దుస్తులు లాగి అసభ్యంగా ప్రవర్తించారని చొప్పర వరలక్ష్మి ఫిర్యాదు చేశారు.

బాలికలతో పంపిణీపై సర్వత్రా ఆగ్రహం.. బాలికలతో ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైకాపా నాయకుల ప్రచారానికి పిల్లలు తప్ప పెద్దలు రావడం లేదా? అని పలువురు ప్రశ్నించారు. తెదేపా నాయకులు అడ్డుకోవడం.. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో బాలికలు బెంబేలెత్తిపోయారు. బిక్క ముఖాలతో నిలబడ్డ వీరితోనే.. వైకాపా నాయకులు రాజకీయం చేయడం చూసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు