logo

ఐదు వేల ఎకరాల్లో.. ఇండస్ట్రియల్ హబ్‌

మచిలీపట్నం ఎంపీగా.. గత ఐదేళ్లలో కృష్ణా జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండానే.. ఎంతో చేయగలిగాను. కేంద్ర ప్రభుత్వం నిధులను భారీగా తీసుకొచ్చి పలు ప్రాజెక్టులను పట్టాలెక్కించాను. ప్రధానంగా.. బందరు పోర్టుకు అన్ని అనుమతులు, రూ.4 వేల కోట్ల వరకూ రుణం తీసుకొచ్చాను

Updated : 08 May 2024 05:45 IST

ఉపాధి కల్పనలో స్థానిక యువతకే తొలి ప్రాధాన్యం
తాగునీళ్లు లేని ప్రతి గ్రామంపై ప్రత్యేక దృష్టి పెడతా
జగన్‌ ప్రభుత్వ సహకారం లేక.. అభివృద్ధి కుంటుపడింది
కేంద్రం నుంచి భారీగా నిధులు తెచ్చినా.. వాడుకోలేదు
బందరు లోక్‌సభ ఎన్డీయే కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి
ఈనాడు, అమరావతి

మచిలీపట్నం ఎంపీగా.. గత ఐదేళ్లలో కృష్ణా జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండానే.. ఎంతో చేయగలిగాను. కేంద్ర ప్రభుత్వం నిధులను భారీగా తీసుకొచ్చి పలు ప్రాజెక్టులను పట్టాలెక్కించాను. ప్రధానంగా.. బందరు పోర్టుకు అన్ని అనుమతులు, రూ.4 వేల కోట్ల వరకూ రుణం తీసుకొచ్చాను. మచిలీపట్నంలో వైద్య కళాశాల, ఫిషింగ్‌ హార్బర్‌, కేంద్రంతో మాట్లాడి రూ.325 కోట్లతో గుడివాడకు రైల్వే బ్రిడ్జి పనులు, పలు రహదారులు, వంతెనలు, పాఠశాలలకు నిధులు, వైద్య కేంద్రాల్లో అధునాతన సౌకర్యాల కల్పనకు.. రూ.కోట్ల నిధులను కేంద్ర సంస్థల నుంచి మంజూరు చేయించాను.

కానీ.. జగన్‌ ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల కేంద్ర నిధులతో ఇంకెంతో చేయడానికి అవకాశం ఉన్నా.. చేసుకోలేకపోయాం. ప్రధానంగా.. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడికెళ్లినా మంచినీటి సమస్య గురించే ప్రజలు అడుగుతున్నారు. నేను రూ.300 కోట్ల వరకూ జలజీవన్‌ మిషన్‌ కింద కేంద్రాన్ని ఒప్పించి నిధులను తెచ్చాను. కానీ.. రాష్ట్ర వాటాను విడుదల చేయకపోవడంతో కేంద్రం విడుదల చేసిన నిధులను కూడా వాడుకోలేకపోయిన.. దయనీయమైన పరిస్థితి.

అందుకే.. రాష్ట్రంలో కచ్చితంగా ఈసారి వచ్చేది తెదేపా, జనసేన, భాజపాతో కూడిన ఎన్డీయే కూటమి సర్కారే. నా శక్తి మేరకు అన్ని రకాలుగానూ ప్రయత్నం చేసి.. కేంద్రం నుంచి నిధులను తీసుకొచ్చి జిల్లావాసులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటినీ పరిష్కరించేందుకు వచ్చే ఐదేళ్లు ప్రయత్నం చేస్తానని’

మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిగా ఎన్డీయే కూటమి జనసేన పార్టీ తరఫున గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేస్తున్న ఎంపీ వల్లభనేని బాలశౌరి స్పష్టం చేశారు. తాను ఎంపీగా మరోసారి గెలిచాక.. వచ్చే ఐదేళ్లలో ఏం చేయబోతున్నారనేది ‘ఈనాడు’ ముఖాముఖిలో బాలశౌరి వెల్లడించారు. ఆయన మాటల్లోనే..


ఇంటింటికీ తాగునీరు..

నియోజకవర్గానికి వెళ్లినా.. తాగునీటి వెతలే కనిపిస్తున్నాయి. అందుకే నేను గెలిచిన వెంటనే ఈ సమస్యపై దృష్టి పెడతాను. రాష్ట్రం సహకరించి ఉంటే గత ఐదేళ్లలోనే పూర్తిగా తాగునీటి సమస్యను పరిష్కరించేవాడిని. కేంద్ర ప్రభుత్వ అమృత్‌ పథకం ద్వారా మచిలీపట్నం, గుడివాడ, పెడన మున్సిపాలిటీల పరిధిలో ఇంటింటికీ కుళాయిలు వేసేందుకు చర్యలు చేపట్టాం. ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, ఇతర సదుపాయాల కోసం రూ.112 కోట్ల నిధులను తీసుకొచ్చాను. జల్‌జీవన్‌ మిషన్‌ కింద కూడా భారీగా నిధులను తీసుకొచ్చాను. మరో రూ.7 కోట్ల కేంద్ర నిధులతో తాగునీటి సమస్య అధికంగా ఉన్న 40 గ్రామాల్లో మైక్రోవాటర్‌ ఫిల్టర్లను ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే ఐదేళ్లలో పార్లమెంట్‌ పరిధిలో తీరప్రాంత గ్రామాలన్నింటిలోనూ ఇంటింటికీ కుళాయిలు వేసి.. నీరు అందిస్తాను.


ప్రగతికి సపోర్టు]

చిలీపట్నం పోర్టుకు పర్యావరణ అనుమతులు సహా అనేక సవాళ్లు ఎదురయ్యాయి. వాటన్నింటినీ పరిష్కరించి.. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రూ.4 వేల కోట్ల వరకూ రుణం తీసుకొచ్చాను. ప్రస్తుతం ఎలాంటి అడ్డంకులు లేకుండా పనులు శరవేగంగా సాగుతున్నాయి. పోర్టును త్వరితగతిన పూర్తిచేయించి, అనుబంధంగా సముద్ర తీర ప్రాంతంలోని ఐదు వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ హబ్‌ను ఏర్పాటు చేస్తాం. దీనిలో లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని స్థానిక యువతకే పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఈ ఐదేళ్లలో ఎలాంటి ఉపాధి లేక.. యువత నిరుద్యోగులుగా మిగిలిపోయారు. వారందరికీ ఓ దారి చూపిస్తాం.


కంకిపాడు-గుడివాడ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మిస్తాం..

కంకిపాడు నుంచి గుడివాడకు వెళ్లే రహదారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. కృష్ణా జిల్లాలో ముఖ్యమైన వాణిజ్య, వ్యాపార కేంద్రమైన గుడివాడకు వెళ్లేందుకు కనీసం ఈ ఒక్క రహదారినైనా వేయమని ఈ ప్రాంతవాసులు ఎన్నో ఏళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రహదారిని.. గ్రీన్‌ఫీల్డ్‌ హైవేగా నిర్మిస్తాను. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు కూడా సిద్ధంగా ఉన్నాయి. 30 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి శాశ్వతంగా చెక్కుచెదరకుండా ఉండేలా.. పటిష్ఠంగా నిర్మాణం చేపడతాం.


నేను చేయబోయే అభివృద్ధి ఇదీ..

  • నాగాయలంక-ఎదురుమొండి వంతెన నిర్మాణం పూర్తి చేస్తాను.
  • ప్రతి నియోజకవర్గంలో అత్యాధునిక వసతులతో కూడిన ఒక షాదీఖానా నిర్మిస్తాం. ్య మారుమూల గ్రామాలకు సౌర విద్యుత్తు తీసుకెళ్లి దీపాలు ఏర్పాటు చేయిస్తా.
  • దివ్యాంగులకు ఉచితంగా వాటర్‌ ప్లాంట్‌ నిర్మించి ఇచ్చి, గ్రామానికి అవసరమైన తాగునీటిని వాళ్లే అందించి ఆదాయం పొందుతూ కుటుంబాలు పోషించుకునేలా ప్రణాళిక రూపొందిస్తా.
  • చేతివృత్తుల వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రుణాలను బ్యాంకుల ద్వారా మంజూరు చేయిస్తా. మగ్గాలు లేని చేనేతలకు కూడా ప్రభుత్వం నుంచి సాయం అందేలా చొరవ తీసుకుంటా. యువకులు వ్యాపారాలు ప్రారంభించేందుకు అవసరమైన బ్యాంకు రుణాలు అందిస్తాను.
  • అన్ని నియోజకవర్గాల్లో అంబేడ్కర్‌ భవన్‌లు ఆధునికీకరించి, కొత్తగా లేనిచోట్ల నిర్మిస్తాం. కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తాం.
  • గ్రామాలలో ఉచితంగా క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షల నిర్వహణకు రూ.2 కోట్ల నిధులతో అత్యాధునిక వసతులు కలిగిన బస్సు ఏర్పాటు.
  • పామర్రు-చల్లపల్లి రోడ్డును జాతీయ రహదారిగా మార్చే చర్యలు చేపడతాం.
  • పోలవరాన్ని పూర్తిచేసి.. కృష్ణా డెల్టాకు నీటి ఎద్దడి సమస్య లేకుండా చేస్తాం.
  • గత ఐదేళ్లలోనే సీఎస్సార్‌ కింద రూ.45 కోట్ల వరకూ నిధులు తీసుకొచ్చి.. ఆర్వో ప్లాంట్లు, ప్రాథమిక వైద్య కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేశాం. మళ్లీ గెలిచాక సీఎస్సార్‌ నిధులపై ఎక్కువ దృష్టి పెడతాను.
  • క్రీడాకారుల ప్రోత్సాహానికి ఏడు నియోజకవర్గాల్లోనూ.. ఒక్కో ఇండోర్‌ స్టేడియం నిర్మాణం.

విమానాశ్రయంపై ప్రత్యేక చొరవ..

దేశవిదేశాల నుంచి నేరుగా కృష్ణా జిల్లాకు చేరుకునేందుకు ఉన్న సులభమైన మార్గం.. గన్నవరం విమానాశ్రయం. ఇంత కీలకమైన విమానాశ్రయం పర్యవేక్షణ విషయంలో జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అందుకే.. వచ్చే ఐదేళ్లలో గన్నవరం విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం. దేశ విదేశాలకు విమాన సర్వీసులతో పాటు, కార్గో సర్వీసులను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తాం.


మత్స్యకారుల కోసం ఎన్ని నిధులైనా తెస్తా..

త్స్యకారుల కోసం కేంద్రం నుంచి రూ.12 కోట్ల వరకూ నిధులు తీసుకొచ్చాను. పడవలు, వలలు, జెట్టీలు వాటితో పంపిణీ చేస్తాం. ఆ నిధులు ప్రస్తుతం కలెక్టర్‌ వద్ద ఉన్నాయి. అవనిగడ్డ, పెడన, మచిలీపట్నం పరిధిలోని మత్స్యకారుల కోసం ఆధునిక సాంకేతికతతో కూడిన రెండు పెద్ద బోట్‌లు కొని అందించే ఏర్పాటు చేశాం. చేపలను పట్టే యంత్రాలు, గ్రామాల్లో ఫిషింగ్‌ ప్లాట్‌ఫాంలు, తాగునీటి శుద్ధ జల కేంద్రాలు, తీరప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో వసతులు కల్పిస్తాం.మత్స్యకారుల ప్రయోజనాల కోసం కేంద్రం నుంచి ఎన్ని నిధులను తీసుకొస్తా.


బందరు-విజయవాడ హైవే ఆరు వరుసలు..

చిలీపట్నం నుంచి విజయవాడ వెళ్లే ఎన్‌హెచ్‌-65 జాతీయ రహదారి ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉంది. దీనిని ఆరు వరుసలకు విస్తరిస్తాం. మచిలీపట్నం పోర్టు నిర్మాణం పూర్తయితే.. ఈ రహదారి కీలకంగా మారబోతోంది. అందుకే.. త్వరితగతిన ఆరు వరుసలకు విస్తరించేందుకు చర్యలు చేపడతాం. దీనివల్ల విజయవాడ, మచిలీపట్నం మధ్య రాకపోకలు మరింత వేగవంతమవుతాయి.


మచిలీపట్నం-రేపల్లె రైల్వేలైను పూర్తి చేస్తాం..

నేను గెలిచిన వెంటనే ప్రధానంగా దృష్టిసారించబోయే ప్రాజెక్టు.. మచిలీపట్నం-రేపల్లె రైల్వేలైనే. దీనికోసం గత రెండు దశాబ్దాలకు పైగా ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్నారు. మత్స్య ఉత్పత్తులు అధికంగా ఉండే తీర ప్రాంతవాసులకు ఈ రైల్వేలైనుతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. చెన్నై వెళ్లాలంటే.. గుడివాడ, విజయవాడ వెళ్లాల్సిన పని ఇక ఉండదు. రేపల్లె లైను వస్తే.. నేరుగా ఇక్కడి నుంచే వెళ్లిపోవచ్చు. పోర్టు నిర్మాణం పూర్తయ్యాక.. సరకు రవాణా రైళ్లు కూడా నేరుగా రాకపోకలు సాగించొచ్చు. అందుకే.. దీనిపైనే ప్రధానంగా దృష్టి పెడతాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు