logo

ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది

ప్రధాని మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.. ప్రజలకు అనుకూలమైన ప్రత్యామ్నాయ ప్రభుత్వంతోనే తిరిగి గాడిలో పెట్టగలమని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.

Published : 09 May 2024 04:04 IST

గాడిలో పడాలంటే ప్రత్యామ్నాయ ప్రభుత్వమే మార్గం

ఐక్యత చాటుతున్న సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, పద్మశ్రీ, అభ్యర్థులు వెంకటేశ్వరరావు, కృష్ణ

దావాజీగూడెం (గన్నవరం గ్రామీణం), న్యూస్‌టుడే: ప్రధాని మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.. ప్రజలకు అనుకూలమైన ప్రత్యామ్నాయ ప్రభుత్వంతోనే తిరిగి గాడిలో పెట్టగలమని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం పట్టణ శివారు దావాజీగూడెంలో ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు, బందరు కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి గొల్లు కృష్ణ విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర పద్మశ్రీ, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు వింతా సంజీవరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి నరసింహారావులతో కలిసి సీతారం ఏచూరి ప్రసంగించారు. మతోన్మాద భాజపాను గద్దె దింపేందుకు దేశంలోని 26 పార్టీలతో ఇండియా కూటమి బ్లాక్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ దేశాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టిస్తున్న భాజపాను ఇంటికి పంపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అన్నదమ్ముల్లా మెలిగే హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెడుతూ పబ్బం గడుపుతోందన్నారు. గడిచిన పదేళ్లలో భాజపా సర్కార్‌ ప్రభుత్వ ఆస్తులు అమ్మడం తప్ప.. చేసిందేమీ లేదని సీపీఐ రాష్ట్ర కార్యదరి రామకృష్ణ విమర్శించారు. దేశ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏఒక్కటీ భాజపా నెరవేర్చలేదన్న రామకృష్ణ.. కల్ల్లబొల్లి మాటలతో ప్రాంతీయ, మత విద్వేషాలను రెచ్చగొట్టి తిరిగి అధికారం కోసం ప్రయత్నిస్తోందని విమర్శించారు. సామాజిక న్యాయం అని పదేపదే చెబుతున్న ఒక్క రెడ్డి సామాజికవర్గానికి తప్ప ఇతర కులాలన్నింటినీ పాతాళానికి తొక్కారని ఆరోపించారు. ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని ఇతర నేతలు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని