గోపాలమిత్రపై హత్యాయత్నం
పెడన, న్యూస్‌టుడే: పశు సంవర్థక శాఖలో గోపాలమిత్రగా పనిచేస్తున్న ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగినట్లు స్థానిక పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై టి.మురళీ తెలిపిన వివరాల ప్రకారం.. బందరు మండలం కానూరుకు చెందిన దివి మహేష్, పెడన మండలం నందమూరులో గోపాలమిత్రగా పనిచేస్తున్న మోర్ల బాలాజీలు మంచి స్నేహితులు. ఇద్దరి మధ్య వ్యక్తిగత కారణాలతో కొంతకాలం క్రితం మనస్పర్థలు వచ్చాయి. ఈనేపథ్యంలో బాలాజీపై కక్షకట్టి, ఎలాగైనా అతన్ని హతమార్చాలని మహేష్ నిర్ణయించాడు. నాలుగు నెలల క్రితం మంగినపూడిలో నివాసం ఉంటున్న, గుంటూరు వెంకట్రావుపేటకు చెందిన నాగిరి చైతన్యతో నందమూరుకు సమీపంలోని మడక గ్రామం వద్ద బైక్‌పై వెళ్తోన్న బాలాజీని బైక్‌తో ఢీకొట్టించాడు. ఈ ప్రమాదంలో బాలాజీ త్రుటిలో తప్పించుకున్నారు. రెండ్నెళ్ల క్రితం ఇదే తరహాలో మరో ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఈనేపథ్యంలో బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై వెళ్తోన్న బాలాజీని పెదనందమూరు వద్ద నిర్మానుష్య ప్రాంతంలో చైతన్య మరో ఇద్దరితో కలిసి కత్తులు, కారంతో దాడిచేశారు. నిందితులు తమ వద్ద క్రిమిసంహార మందును సిద్ధంగా ఉంచుకున్నట్లు ఎస్సై చెప్పారు. ఈ దాడిలోనూ త్రుటిలో తప్పించుకున్న బాలాజీ అర్ధరాత్రి ప్రాంతంలో పెడన పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదుచేశారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన ఎస్సై దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడు చైతన్యతో పాటు అతని సన్నిహితులు మరో ఇద్దరిని ముందుగా అదుపులోకి తీసుకొని విచారించారు. దీనిలో హత్యాయత్నానికి సూత్రధారి దివి మహేష్‌గా గుర్తించారు. మహేష్‌తో పాటు అతని మిత్రుడు బందరు మండలం సత్రంపాలెం గ్రామ వాసి కోరశిక సుబ్రహ్మణ్యంలను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశామని, శనివారం కోర్టులో హాజరుపరుస్తామని ఎస్సై చెప్పారు. మచిలీపట్నం డీఎస్పీ మాసుంబాషా, రూరల్ సీఐ కొండయ్యలు శుక్రవారం పెడన పోలీసుస్టేషన్‌కు వచ్చి హత్యాయత్నం జరగటానికి దారితీసిన కారణాలపై నిందితులను పూర్తిస్థాయిలో విచారించారు.