logo

తెలుగువారికి అండగా తానా

విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారికి, అమెరికాలో ప్రవాసాంధ్రులకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) కొండంత అండగా నిలుస్తోందని వక్తలు పేర్కొన్నారు. తానా ఫౌండేషన్‌ ట్రస్టీ, తానా అన్నపూర్ణ సమన్వయకర్త పుట్టగుంట

Published : 07 Dec 2021 04:30 IST

ప్రభుత్వం ఐటీఐలో రూ.8 లక్షలతో సేవా కార్యక్రమాలు


రక్షిత నీటి ప్లాంటును ప్రారంభిస్తున్న తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, పుట్టగుంట సురేష్‌, ఆర్‌.వి.రమణ, తానా ప్రతినిధులు

కరెన్సీనగర్‌, న్యూస్‌టుడే: విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారికి, అమెరికాలో ప్రవాసాంధ్రులకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) కొండంత అండగా నిలుస్తోందని వక్తలు పేర్కొన్నారు. తానా ఫౌండేషన్‌ ట్రస్టీ, తానా అన్నపూర్ణ సమన్వయకర్త పుట్టగుంట సురేష్‌ ఆధ్వర్యంలో ఐటీఐ కళాశాల విశ్రాంత అధికారి వీరభద్రరావు(చలమయ్య) జ్ఞాపకార్థం కళాశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన రక్షిత నీటి ప్లాంటును తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి సోమవారం ప్రారంభించారు. అక్కడే ‘తానా వనం’ పేరిట నిర్మించిన పార్కులో మొక్కలు నాటారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో అంజయ్య చౌదరి మాట్లాడుతూ పుట్టగుంట వీరభద్రరావు చేసిన సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. ఫౌండేషన్‌ సేవా కార్యక్రమాల్లో భాగంగా సోమవారం కళాశాలలో రక్షిత నీటి ప్లాంటు, 400 మంది విద్యార్థులకు సీపీఆర్‌పై శిక్షణ, 20 మందికి ఉపకార వేతనాలు, ఉయ్యూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆక్సిజన్‌ కాన్సట్రేటర్‌, నిరుపేదలకు 100 రగ్గులు, 100 చీరలు అందించినట్లు వివరించారు. తానా ట్రస్టీ సురేష్‌ మాట్లాడుతూ తానా అన్నపూర్ణ పథకంలో భాగంగా విజయవాడ, గుంటూరు, తెనాలి, గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రుల్లో 600 మంది రోగులు, సహాయకులకు నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో విద్యార్థులు, బోధనా సిబ్బంది భోజనం చేసేందుకు రూ.12 లక్షలతో డైనింగ్‌ హాలు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రిన్సిపల్‌ హరి ధర్మేంద్రకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్‌ హ్యాండ్స్‌ నిర్వాహకులు వెంకట్‌ను సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధి శిక్షణ శాఖ ప్రాంతీయ అధికారి ఆర్‌.వి.రమణ, న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్‌, తానా కమ్యూనిటీ సర్వీసెస్‌ సమన్వయకర్త రాజా, ‘అక్షయపాత్ర’ ప్రతినిధి విలాస విగ్రహదాస, డాక్టర్‌ ఒ.కె.మూర్తి, తానా ఫౌండేషన్‌ ప్రతినిధులు, నగరానికి చెందిన ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని