logo

వినూత్నం.. విభిన్నం

ఇంజినీరింగ్‌ విద్యార్థులు విభిన్నంగా ఆలోచించి వినూత్న ఆవిష్కరణలు చేస్తున్నారు. సమాజాన్ని నిశితంగా పరిశీలించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూసే విధంగా యంత్రాలు రూపొందిస్తున్నారు. ప్రయోగాలు చేసి విజయవంతం అవుతున్నారు. అటువంటి ఇద్దరి యువకులపై కథనం.

Published : 27 Jan 2022 05:15 IST

జగ్గయ్యపేట, నందిగామ గ్రామీణం - న్యూస్‌టుడే

ఇంజినీరింగ్‌ విద్యార్థులు విభిన్నంగా ఆలోచించి వినూత్న ఆవిష్కరణలు చేస్తున్నారు. సమాజాన్ని నిశితంగా పరిశీలించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూసే విధంగా యంత్రాలు రూపొందిస్తున్నారు. ప్రయోగాలు చేసి విజయవంతం అవుతున్నారు. అటువంటి ఇద్దరి యువకులపై కథనం.


కాలుష్య రహితం... ఖర్చు స్వల్పం

రూపొందించిన ఎలక్ట్రికల్‌ ఆటోతో విద్యార్థులు, అధ్యాపకులు

సామాన్యుడి కోసం ఆటోను కాలుష్యరహితంగా రూపొందించారు జగ్గయ్యపేటలోని మండవ ఇంజినీరింగ్‌ (మైట్‌) కళాశాల విద్యార్థులు. మెకానికల్‌ విద్యార్థులు అనంత్‌ పాక్రెల్‌, వైవీ భాను, డి.ప్రదీప్‌, రవీంద్రసాహు, సందీప్‌ రూపొందించిన ఎలక్ట్రికల్‌ ఆటో విజయవంతమైంది. ప్రిన్సిపల్‌ శ్యాం పర్యవేక్షణలో మెకానికల్‌ విభాగాధిపతి ఎ.రాధాకృష్ణ, అధ్యాపకులు ఫతేమహ్మద్‌, సైదా, శ్యాంబాబుల సహకారంతో రూ.లక్ష వెచ్చించి దానిని రూపొందించారు. 3 గంటలు ఛార్జింగ్‌ చేస్తే 100 కి.మీ. ప్రయాణించే ఈ ఆటో 600 కిలోల బరువు మోయగలదు. 2 కేవీ బీఎల్‌డీసీ మోటారు, లిథియం అయాన్‌ బ్యాటరీ, 42 అంగుళాల డిఫరెన్షియల్‌ ఎలక్ట్రికల్‌ మోటార్‌ కంట్రోలర్‌ని వాడి నెలరోజుల్లో తయారు చేశారు. కి.మీ.కు కేవలం 20 పైసలు ఖర్చు అవుతుంది. ఆటోను ప్రస్తుతం కళాశాల అవసరాలకు వినియోగిస్తున్నారు. మరికొన్ని పరీక్షల తరువాత తగిన అనుమతులతో మార్కెట్లోకి వెళ్తామని కళాశాల కార్యదర్శి మండవ శ్రీధర్‌ తెలిపారు.


తక్కువ వ్యయంతో మినీ కల్టివేటర్‌

తయారు చేసిన యంత్రంతో నవీన్‌

వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆ యువకుడు సేద్యంలో తండ్రి కనకాచారి పడుతున్న కష్టం చూసి తక్కువ ఖర్చుతో కల్టివేటర్‌ యంత్రం తయారు చేశాడు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెద్దమండవకు చెందిన కన్నోజు నవీన్‌ నందిగామ జీడీఎంఎం ఇంజినీరింగ్‌ కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. కల్టివేటర్‌ (కలుపు తీసే యంత్రం) తయారీ కోసం పాత బైకు కొన్నాడు. కలుపుతీసే పరికరాన్ని దానికి బిగించి పెట్రోల్‌తో నడిచేలా తయారు చేశాడు. రూ.200 ఖర్చుతో ఎకరం పొలంలో కలుపు తీసుకోవచ్చు. బైకుకు చైను, ఇనుప చక్రాలు, పలుగు, గుంటక, అచ్చు పరికరంతో పాటు ఎరువు వేయడానికి 20 లీటర్ల డబ్బా బిగించాడు. యంత్రం తయారీకి రూ.15 వేలు ఖర్చు పెట్టాడు. ఈ యంత్రంతో ఎకరంలో కలుపు తీయడానికి రెండు లీటర్ల పెట్రోలు ఖర్చవుతుంది. అదే కాడెద్దులతో అయితే ఎకరానికి రూ.1200 ఇవ్వాలి. భవిష్యత్తులో యంత్రానికి విత్తనాలు వేసే పరికరం ఏర్పాటు చేస్తానని చెప్పాడు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని